logo

భూముల విలువ పెంపునకు కసరత్తు

భూముల మార్కెట్‌ విలువ సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో క్షేత్రస్థాయిలో సబ్‌రిజిస్ట్రార్లు, తహసీల్దార్లు అధ్యయనం ప్రారంభించారు. ప్రభుత్వానికి ఆదాయం రావడంతో పాటు ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఈ పెంపు ఉండాలని సర్కారు పెద్దల ఆదేశించడంతో అధికారులు కసరత్తు చేస్తున్నారు.

Updated : 18 Jun 2024 05:42 IST

క్షేత్రస్థాయిలో సబ్‌ రిజిస్ట్రార్లు, తహసీల్దార్ల అధ్యయనం
ఈనాడు, నల్గొండ

భూముల మార్కెట్‌ విలువ సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో క్షేత్రస్థాయిలో సబ్‌రిజిస్ట్రార్లు, తహసీల్దార్లు అధ్యయనం ప్రారంభించారు. ప్రభుత్వానికి ఆదాయం రావడంతో పాటు ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఈ పెంపు ఉండాలని సర్కారు పెద్దల ఆదేశించడంతో అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లా కేంద్రాలైన నల్గొండ, భువనగిరి, సూర్యాపేటల్లో వాస్తవ ధరలకు, మార్కెట్‌ వెలలకు భారీ వ్యత్యాసం ఉందని గుర్తించి వాటి అంతరాన్ని తగ్గించే విధంగా చర్యలు మొదలుపెట్టారు.

వారంలో ప్రభుత్వానికి నివేదిక

మండల స్థాయిలో భూముల విలువ పెంపుపై సబ్‌ రిజిస్ట్రార్లు, తహసీల్దార్లతో కూడిన సమన్వయ కమిటీ అధ్యయనం తుది దశకు చేరుకుంది. మండల, పురపాలిక, డివిజన్, జిల్లా కేంద్రాల స్థాయిలో డిమాండ్‌ ఉన్న సర్వే నెంబర్లేవీ, వాటిలో ప్రస్తుతం ఎంత విలువ ఉంది? బహిరంగ మార్కెట్‌తో పోలిస్తే ఎంత మేర పెంపునకు ఆస్కారం ఉంటుందనే వివరాలను రెవెన్యూ సిబ్బంది ద్వారా రిజిస్ట్రేషన్‌ అధికారులు సేకరిస్తున్నారు. ఈ నెలాఖరుకు కసరత్తు పూర్తి చేసి ఏ ప్రాంతంలో ఎంత పెంచాలో తెలుపుతూ ప్రాథమిక నివేదికను సిద్ధం చేయనున్నారు. ఈ నివేదికలన్నీ జిల్లా స్థాయిలో కలెక్టర్‌ ఛైర్మన్‌గా ఉన్న కమిటీకి చేరనున్నాయి. తర్వాత ప్రభుత్వం ప్రతిపాదిత నివేదికల ప్రకారం అభ్యంతరాలు స్వీకరించి సమస్యల పరిష్కారం అనంతరం ఆ ధరలను వాస్తవ రూపంలోకి తేనున్నారు. ఆగస్టు నెల ప్రారంభం నాటికి ఈ క్రతువును పూర్తి చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

ఈ ధరల్లో హెచ్చుతగ్గుల వల్ల ప్రాజెక్టుల నిర్మాణ సమయంలోనూ నిర్వాసితులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న చర్లగూడెం, కిష్టరాయినిపల్లి రిజర్వాయర్లలో భూములు కోల్పోతున్న వారికి ప్రభుత్వం నుంచి గరిష్ఠంగా పరిహారం దక్కలేదు. భూసేకరణ చట్టం - 2013 ప్రకారం బహిరంగ మార్కెట్‌లో భూమి విలువకు అదనంగా నాలుగు రెట్లు పెంచి ప్రభుత్వం నిర్వాసితుడికి పరిహారం చెల్లిస్తుంది. ఆ ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్‌కు, రిజిస్ట్రేషన్‌ విలువకు భారీ అంతరం ఉండటంతో చాలా మంది నిర్వాసితులకు న్యాయం దక్కలేదని అధికారులే అప్పట్లో అభిప్రాయపడ్డారు. ఈ హేతుబద్ధ పెంపు వల్ల ప్రాజెక్టు నిర్వాసితులకు సైతం గరిష్ఠ పరిహారం దక్కనుందని అధికార వర్గాలు వెల్లడించాయి.


డిమాండ్‌కు అనుగుణంగా నిర్ణయం

త ప్రభుత్వం 2021, 2022లో వ్యవసాయ భూముల మార్కెట్‌ విలువ పెంపు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తక్కువ ధరలున్న చోట 50 శాతం, మధ్యస్థంగా ఉంటే 40, ఎక్కువ ఉంటే 30 శాతం వరకు ఒకే విధంగా పెంచారు. ఈ దఫా అలా కాకుండా డిమాండ్‌ ఉన్న ప్రాంతాల్లో మార్కెట్‌ విలువ ఎంత ఉంది? ప్రభుత్వ ధర ఎంత ఉందని తెలుసుకొని రెండింటి మధ్య వ్యత్యాసాన్ని గణనీయంగా తగ్గించే విధంగా హేతుబద్ధ ప్రక్రియకు అధికారులు కృషి చేస్తున్నారు. ఉదాహరణకు నల్గొండ పట్టణంలోని దేవరకొండ రహదారిలో, నకిరేకల్‌-సాగర్‌ జాతీయ రహదారి పక్కన ఉన్న ప్రాంతాల్లో గజం రూ.లక్ష వరకు బహిరంగ మార్కెట్లో పలుకుతుండగా.. సబ్‌ రిజిస్ట్రార్‌ మార్కెట్‌ విలువ మాత్రం రూ.10 వేల వరకు ఉంది. ఇక్కడ సుమారు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు రిజిస్ట్రేషన్‌ విలువ పెంచుకునే వెసులుబాటు ఉందని అధికారులు గుర్తించారు.

హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న స్థలాల్లో గత ప్రభుత్వం మార్కెట్‌ ధర అన్ని ఒకే స్థాయిలో పెంచింది. ఇప్పుడు అలా కాకుండా పురపాలికలు, మండల కేంద్రాల్లో ఒక ధర, గ్రామాల్లో ఒక ధర పెంచాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. జిల్లా కేంద్రమైన భువనగిరిలో పట్టణం నడిబొడ్డున బాగా డిమాండ్‌ ఉన్న ప్రాంతాల్లో మార్కెట్‌ ధర, పురపాలిక చివరన, రహదారికి దూరంగా ఉన్న ప్రాంతాల్లో ధరలు పోల్చినప్పుడు ఒకే విధంగా ఉన్నాయని అధికారులు అంచనాకు వచ్చారు. 


హేతుబద్ధంగా ఉండేలా.. 

- కోమటిరెడ్డి వేణుగోపాల్‌రెడ్డి, సబ్‌ రిజిస్ట్రార్, నల్గొండ 

ప్రభుత్వ ఆదేశం మేరకు భూముల విలువ పెంపు హేతుబద్ధంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. డిమాండ్‌ ఉన్న ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్‌లో ఎంత ఉంది? రిజిస్ట్రేషన్‌ ధర ఎంత ఉంది? అనే దానిపై అధ్యయనం చేస్తున్నాం. మరో వారం రోజుల్లో ఈ కసరత్తు కొలిక్కి వస్తుంది. ఈ నెలాఖరుకు నివేదిక సమర్పిస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని