logo

ఇసుకాసురుల ఇష్టారాజ్యం

ఇసుక కొరతను తీర్చేందుకు నార్కట్‌పల్లి మండలంలో ఇసుక డిపోల ఏర్పాటుపై అధికారులు కఠిన చర్యలు చేపట్టకపోవడంతో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది.

Updated : 18 Jun 2024 05:43 IST

నార్కట్‌పల్లి గ్రామీణం న్యూస్‌టుడే: ఇసుక కొరతను తీర్చేందుకు నార్కట్‌పల్లి మండలంలో ఇసుక డిపోల ఏర్పాటుపై అధికారులు కఠిన చర్యలు చేపట్టకపోవడంతో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఇసుకాసురులకు మూడు పువ్వులు ఆరు కాయలుగా కాసుల వర్షం కురిపిస్తోంది. నార్కట్‌పల్లి మండలంలోని అమ్మనబోలు శివారులోని నిత్యం మూసీ జలాలు పారుతూనే ఉంటాయి. కానీ.. పచ్చని పంటలు మాత్రం మచ్చుకైనా కనిపించవు. దీనంతటికీ కారణం అక్రమార్కులు మూసీ నుంచి ఇసుకను తరలించడమే. అనుమతులు లేకున్నా.. రోజు ఇక్కడి నుంచి వందల సంఖ్యలో వాహనాల్లో ఇసుకను తరలిస్తున్నారు. తమకేం సంబంధం లేదన్నట్లు అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ఇసుకను తరలించవద్దని గ్రామస్థులు పేర్కొంటున్నా.. కొందరు ప్రజాప్రతినిధులే ఇసుకను తరలిస్తూ జేబులు నింపుకొంటున్నారు. ఈ గ్రామంలో ప్రతి పది ఇళ్లకు ఒక ట్రాక్టర్‌ ఉంది అంటే ఇసుక ఎంత మోతాదులో తరలిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

ప్రమాదకరంగా మూసీ వాగు లోలెవల్‌ వంతెన..

మూసీ వాగు లోలెవల్‌ వంతెన నుంచి నీరు పారుతుంది. వంతెన కింద ఉన్న ఇసుకను నిత్యం ట్రాక్టర్లలో తరలించడం ద్వారా వంతెన అడుగు భాగం దెబ్బతింటుంది. ఇసుకాసురులు ఇష్టారాజ్యంగా ఇసుకను ఎక్కడపడితే అక్కడ తీస్తుండటంతో వంతెన కూలే ప్రమాదం ఉంది. 

అందరూ భాగస్వాములే..

అక్రమంగా సాగుతున్న ఇసుక వ్యాపారంలో ఆ గ్రామంలోని కొంత మంది నాయకుల సహకారంతోనే రోజు రోజుకు ఇసుక మాఫియా పెరుగిపోతుంది. దీనికి తోడు పోలీసులు, రెవెన్యూ అధికారులు కూడా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయా శాఖాధికారులు, ప్రజాప్రతినిధులు నిజాయతీగా వ్యవహరిస్తే ఇసుక తరలింపును ఆపడం కష్టమైన పనేమి కాదు. 

కఠిన చర్యలు తీసుకుంటాం

-వెంకటేశ్వర్‌రావు, తహసీల్దార్, నార్కట్‌పల్లి

అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నాం. గత కొద్ది రోజుల క్రితం పోలీసు శాఖ వారి సహకారంతో ఇసుక తరలిస్తున్న వారిని బైండోవర్‌ చేశాం. మూసీ వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలించకుండా నిఘా ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటాం.


కేసులు నమోదు చేస్తున్నాం..

-అంతిరెడ్డి, ఎస్సై, నార్కట్‌పల్లి

ఇసుక తరలిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఘటన స్థలీకి వెళ్లి కేసులు నమోదు చేస్తున్నాం. త్వరలోనే అమ్మనబోలులో ఇద్దరు సిబ్బందిని నియమించి ఇసుక వ్యాపారం చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నాం.


ఇసుక తరలింపును అరికట్టాలి

-కొమ్ము గిరి, స్థానికుడు

మూసీ వాగు నుంచి ఇసుక మాఫియా ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. కేవలం స్థానిక అవసరాలకు సరిపడా మాత్రమే ఇసుక నిల్వలే ఉండే వాగును ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారు. పలు మార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక తరలింపును నియంత్రించాలి.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని