logo

తొలి మెట్టు.. భవితకు ఆయువుపట్టు

పాఠశాల ప్రారంభం నుంచే విద్యార్థులు చదువుపై ఆసక్తి చూపితే మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. ఆ విషయాన్ని గ్రహించిన యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాశాఖాధికారి నారాయణరెడ్డి ఇటీవల రాజపేటలోని బాలుర, బాలికల పాఠశాలను సందర్శించి పదో తరగతి విద్యార్థులకు సుమారు గంట పాటు ప్రత్యేక తర్ఫీదునిచ్చారు.

Published : 18 Jun 2024 04:50 IST

పదో తరగతిలో ప్రారంభం నుంచి దృష్టి పెడితే మేలు
రాజపేట, న్యూస్‌టుడే

పాఠశాల ప్రారంభం నుంచే విద్యార్థులు చదువుపై ఆసక్తి చూపితే మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. ఆ విషయాన్ని గ్రహించిన యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాశాఖాధికారి నారాయణరెడ్డి ఇటీవల రాజపేటలోని బాలుర, బాలికల పాఠశాలను సందర్శించి పదో తరగతి విద్యార్థులకు సుమారు గంట పాటు ప్రత్యేక తర్ఫీదునిచ్చారు. పదో తరగతిలో గతంలో మంచి ఫలితాలు సాధించిన వారి గురించి ఉదహరిస్తూ.. చదువుపై పిల్లలకు ఉత్తేజం కలిగించారు. ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా సాధన చేసి పదో తరగతిలో 10 జీపీఏ సాధిస్తే.. అత్యుత్తమ విద్యాసంస్థల్లో ప్రవేశం పొందితే భవిష్యత్తు బంగారుమయం అవుతుందని సూచించారు. విద్యార్థులకు స్ఫూర్తి నింపే అంశాలు చెబుతూ ముఖ్యమైన విషయాంశాలపై పట్టు పెంచుకునేలా ప్రేరణ కలిగించారు. పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులకు ముందస్తు సూచనాత్మక కథనం.

‘మేధా’ ట్రస్టు సహకారం ఇలా..

హైదరాబాద్‌లోని మేధా ఛారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ఏటా వందలాది మంది ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ఇంటర్మీడియట్‌ నుంచి డిగ్రీ తత్సమాన కోర్సులో కార్పొరేట్‌ కళాశాలల్లో చదివేందుకు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తోంది. పదో తరగతి పూర్తయిన నెల రోజులలోపు ట్రస్టు ఆధ్వర్యంలో అర్హత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేసి ఉన్నత చదువుకు ప్రోత్సహిస్తారు. పదో తరగతిలో తొమ్మిది ఆపైన జీపీఏ కలిగి ఉండి మేధా పరీక్షలో ప్రతిభ కనబరచిన పేద విద్యార్థులను ఎంపిక చేసి వారికి ఇంటర్మీడియట్‌ నుంచి అయిదు నుంచి ఆరేళ్ల పాటు డిగ్రీ లేదా ఇంజినీరిగ్‌ వైద్య విద్య, లేదా విద్యార్థి ఎంచుకున్న ఏ ఇతర కోర్సులోనైనా ఉచిత వసతి కల్పిస్తున్నారు.


సర్కారు బడి నుంచి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా..

రాజపేటకు చెందిన జమాల్‌పురం విన్య స్థానికంగా జడ్పీ ఉన్నత పాఠశాలలో 2016-17 విద్యాసంవత్సరంలో పదో తరగతిలో 9.7 జీపీఏ సాధించింది. బాసరలో ఐఐఐటీలో సీటు లభించినప్పటికీ అందులో చేరలేదు. మేధా ఛారిటబుల్‌ ట్రస్టు నిర్వహించిన అర్హత పరీక్షలో ప్రతిభ చూపి వారి సహకారంతో ఇంటర్, బీటెక్‌ కూడా పూర్తి చేస్తున్న క్రమంలోనే పీడబ్ల్యూసీ కంపెనీ నిర్వహించిన ప్రాంగణ నియామకానికి ఎంపికైంది. ఏడాదికి రూ.8 లక్షల ప్యాకేజీగా ఒప్పందం చేసుకుని గత మూడేళ్లుగా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఉద్యోగం చేస్తోంది. తాను పాఠశాలలో చదువుతున్నప్పుడు పదో తరగతి ప్రారంభం నుంచి శ్రద్ధతో చదవడమే కాకుండా, ప్రధానోపాధ్యాయుడు బూర్గు మహేందర్‌రెడ్డి, ఇతర ఉపాధ్యాయుల సూచనలు స్వీకరించి చదవడంతో రాణించినట్లు విన్య తెలిపింది. 


పది జీపీఏ సాధకుడికి సీఎం సత్కారం.. 

ఘునాథపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో గత సంవత్సరం పదో తరగతిలో పది జీపీఏ సాధించినందుకు కొంగరి రాకేశ్‌కు ‘వందేమాతరం ఫౌండేషన్‌’ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ ప్రాంతంలోని ఐటీ హబ్‌ లాంటి విశేష, చారిత్రక కట్టడాలు తిలకించే అవకాశం దక్కింది. అదే క్రమంలో ఇటీవల రవీంద్రభారతిలో సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన సమావేశానికి స్వయంగా పాల్గొనడంతో పాటు శాలువా, జ్ఞాపికతో సత్కారం లభించింది. పది జీపీఏ సాధించినందుకు అరుదుగా లభించే ఈ అవకాశం అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లా పాలనాధికారి హన్మంత్‌ కె.జెండగే చేతుల మీదుగా ప్రత్యేకంగా అభినందనలు సైతం అందుకున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని