logo

గణిత పాఠం.. గురువుల పాటవం

సంగారెడ్డి జిల్లా కోహీర్‌ మండలం పీచేర్యాగడి పాఠశాలలో విద్యార్థులు గణిత గుర్తుల ఆకారాల్లో ప్రదర్శన నిర్వహించారు.

Published : 22 Dec 2023 01:59 IST

సంగారెడ్డి జిల్లా కోహీర్‌ మండలం పీచేర్యాగడి పాఠశాలలో విద్యార్థులు గణిత గుర్తుల ఆకారాల్లో ప్రదర్శన నిర్వహించారు. త్రికోణం, ‘పై’, సంఖ్యలు తదితర ఆకారాల్లో వారు ఉపాధ్యాయుల సాయంతో ప్రదర్శించారు.

న్యూస్‌టుడే, కోహీర్‌

చిన్నప్పటి నుంచి ఆసక్తి పెంచడమే కర్తవ్యం

దినచర్యలో భాగంగా ఏదో ఒక రూపంలో వినియోగించే గణిత శాస్త్రమంటే కొందరికి భయం. ఒక్కసారి లెక్కల పాఠాలపై ఆసక్తి మొదలైతే ఇక ఆగలేరు. ఇందుకు ప్రాథమిక స్థాయి నుంచి విద్యార్థులకు కొందరు ఉపాధ్యాయులు తమదైన శైలిలో గణిత పాఠాలను బోధిస్తూ గుర్తింపు పొందుతున్నారు. ఫలితాల్లోనూ లెక్క పక్కా అనిపిస్తున్నారు. నేడు జాతీయ గణిత   దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.

పేరొందిన బడి.. ఒరవడి

న్యూస్‌టుడే, సిద్దిపేట:  సిద్దిపేట అర్బన్‌ మండలం ఎన్సాన్‌పల్లి గ్రామానికి చెందిన పోతుగంటి లక్ష్మారెడ్డి 25 ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో రాణిస్తున్నారు. ప్రస్తుతం సిద్దిపేట ఇందిరానగర్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడు (ఎస్‌ఏ)గా విధులు నిర్వర్తిస్తున్నారు. జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన ఈ బడిలో ఐదేళ్లుగా కొనసాగుతుండగా.. ఏటా పదో తరగతి గణితంలో విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధిస్తుండటం విశేషం. దివ్యాంగుడైన లక్ష్మారెడ్డి.. ఉపాధ్యాయ వృత్తిపై ఎనలేని మమకారంతో ఈ రంగంలో అడుగుపెట్టారు. గత విద్యా సంవత్సరం గణిత ఫలితాల్లో 253 మందికి అందరూ ఉత్తీర్ణులయ్యారు. అందులో పాలిటెక్నిక్‌ డిప్లొమా విద్యకు 25 మంది, బాసర ట్రిపుల్‌ ఐటీకి 34 మంది, శ్రీమేధ, ఆర్‌జీరావు ట్రస్టులు నిర్వహించే ఇంటర్‌ కళాశాలలకు ముగ్గురు (ఉచిత విద్య) ఎంపికయ్యారు. మెరుగైన ఫలితాల సాధనకు ముందు నుంచి ప్రణాళికతో ఉంటున్నారు. ఏటా విద్యార్థులు తొమ్మిదో తరగతి పూర్తయిన వెంటనే ఏప్రిల్‌ నుంచి గణితంలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. జూన్‌ నుంచి ఉదయం 8.30 గంటల నుంచే అదనపు తరగతి చేపడుతున్నారు. సెలవులతో సంబంధం లేకుండా ప్రతి ఆదివారం తర్ఫీదు అందిస్తున్నారు. డిసెంబరు నుంచి ఉదయం, సాయంత్రం గంట చొప్పున నిర్వహిస్తున్నారు. డిజిటల్‌ విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పదో తరగతి పరీక్షలు పూర్తయిన వెంటనే విద్యార్థులకు ఆన్‌లైన్‌లో ఉదయం పూట గంటపాటు శిక్షణలు నిర్వహిస్తున్నారు. టీఎస్‌ఆర్‌జేసీ, టీఎస్‌డబ్ల్యూఆర్‌జేసీ, పాలిసెట్‌, కళాశాలల్లో ప్రవేశాల నిమిత్తం సన్నద్ధం చేస్తున్నారు. ఐదేళ్లుగా ఈ క్రతువును కొనసాగుతుండటం విశేషం.

సిద్దిపేట ఇందిరానగర్‌ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు లక్ష్మారెడ్డి

అవార్డులతో గుర్తింపు

గుమ్మడిదల, న్యూస్‌టుడే: గుమ్మడిదల ప్రాథమిక పాఠశాలలలో పనిచేస్త్తున్న ఉపాధ్యాయురాలు నింగారెడ్డిగారి సబిత గణితాన్ని విద్యార్థులు ఇష్టపడేలా బోధించడంలో దిట్ట. తరగతి గదుల్లో గణితం ఛార్టులు, పరికరాలు ఉంటాయి. సబితకు మూడు సార్లు మండల స్థాయిలో.. 2022లో జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డులు వచ్చాయి.

గుమ్మడిదలలో ఛార్టు ద్వారా బోధిస్తున్న సబిత

మనోఫలకంలో అభ్యాసం

రవివర్మ, ప్రధానోపాధ్యాయుడు, పెరికలగడ్డ పాఠశాల, కోహెడ

అంకెలతో ఆటలు, నిత్యజీవిత సన్నివేశాల ప్రక్రియలు కల్పిస్తూ స్వీయ అభ్యసనాన్ని ప్రోత్సహిస్తా. పెన్ను, పేపర్‌ లేకుండా మనోఫలకంలో సాధన చేసేలా నేర్పిస్తా. గణిత పాటలు, గేయాలు, కవితలతో ఆసక్తి పెంచుతా. పరిసరాలతో అవగాహన కల్పిస్తా. ఛార్టుల ద్వారా బోధన పరికరాలు రూపొందించా.

న్యూస్‌టుడే, కోహెడ గ్రామీణ

భయపడకుండా నేర్చుకోవాలి

సిద్దారెడ్డి, గణిత ఉపాధ్యాయుడు,

గణితం అంటే గరళం కాదు.. సరళం అనే స్థాయిలో ఉపాధ్యాయులు బోధించాలి. పరిసరాలు, స్థానిక వనరులను ఉపయోగిస్తూ ఆకట్టుకునేలా చెప్పాలి. విద్యార్థులు ఎన్ని ప్రశ్నలు సంధిస్తే అంత మంచిది. ఓపికగా సమాధానం చెప్పాలి. సంఖ్య వ్యవస్థ, బీజ, రేఖ, క్షేత్ర, త్రికోణమితి, వ్యాపార శాస్త్ర గణితాలకు సంబంధించి తప్పకుండా కృత్యాధారాలను తయారు చేసుకుంటే బోధన సులువవుతుంది.

న్యూస్‌టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ

సాధనయే ఉత్తమం

వెంకటేశ్వర్లు, గణిత శాస్త్రం ఉపాధ్యాయులు, గీతా పాఠశాల

మక్కువ పెంచుకునేలా ప్రాథమిక స్థాయి నుంచి ఉపాధ్యాయులు నేర్పించాలి. వివిధ విభాగాల కలయికగా ఉండే గణితాన్ని ఎక్కువసార్లు సాధన చేయడం ప్రప్రథమ, ఉత్తమమైన మార్గం.తప్పులను కనుక్కుంటూ, సరి చేసుకుంటూ నేర్చుకోవాలి. వైజ్ఞానిక ప్రదర్శనలో గీతా పాఠశాల విద్యార్థులు ఐదు సార్లు, దక్షిణ భారతదేశ స్థాయిలో.. రెండు సార్లు జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చారు.

న్యూస్‌టుడే,మెదక్‌ టౌన్‌,

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని