logo

వాన లేక.. అన్నదాత ఆందోళన

వరుణుడు మబ్బుచాటునే దోబూచులాడడంతో కర్షకులు ఆందోళనకు గురవుతున్నారు.  వర్షాకాలం ప్రారంభమయి 17 రోజులవుతున్నా ఆశించిన స్థాయిలో చినుకు లేక నిరాశే ఎదురవుతోంది.

Published : 19 Jun 2024 01:24 IST

మొలకెత్తని విత్తనాలు

న్యూస్‌టుడే, నార్సింగి(చేగుంట): వరుణుడు మబ్బుచాటునే దోబూచులాడడంతో కర్షకులు ఆందోళనకు గురవుతున్నారు.  వర్షాకాలం ప్రారంభమయి 17 రోజులవుతున్నా ఆశించిన స్థాయిలో చినుకు లేక నిరాశే ఎదురవుతోంది. తొలకరి వర్షాలకు దుక్కులు దున్ని, విత్తనాలు, ఎరువులను సమకూర్చుకున్నారు. చాలా మంది వరి నార్లు పోసుకున్నారు. మరి కొందరు పత్తి, మొక్కజొన్న, కంది విత్తనాలను వేసుకున్నారు. పది రోజులుగా తేలికపాటి వానలు కూడా కురవడంలేదు.

జిల్లా వ్యాప్తంగా 37,321 ఎకరాల్లో పత్తి సాగు చేస్తారని అధికారుల అంచనా. ఇప్పటివరకు 9,500 ఎకరాల్లో మాత్రమే సాగయింది. అందులో సగం కూడా మొలకెత్తలేదు. పరిస్థితి ఇలాగే ఉంటే మళ్లీ విత్తనాలు వేసుకోవాల్సి వస్తుందని  పేర్కొంటున్నారు. రేగోడ్, అల్లాదుర్గం, చేగుంట, నిజాంపేట, టేక్మాల్‌ తదితర మండలాల్లో తొలకరి వర్షాలకు పత్తి సాగు చేశారు. నీటి తడి అందక అవి మొలకెత్తడంలేదు. రూ.వేల పెట్టుబడులు పెట్టినా ఇదేం పరిస్థితని వాపోతున్నారు. 

బోర్ల నుంచి అందిస్తూ..:  మొక్కజొన్న 2,593 ఎకరాల్లో సాగు చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు 215 ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. చేగుంట, నిజాంపేట, శివ్వంపేట మండలాల్లోనే విత్తనాలు వేశారు. ఇందులో సగం మొలకెత్తలేదు. చేగుంట మండలం బోరు నుంచి నీటి తడులు అందిస్తూ పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే భూగర్భజలాలు కూడా తక్కువగా ఉండడంతో సరిగా అందడంలేదు. కందులు 945 ఎకరాల్లో వేయాల్సి ఉండగా, 100 ఎకరాల్లో వేశారు. అలాగే జొన్నలు 65 ఎకరాలకు కేవలం నాలుగు ఎకరాల్లో విత్తనాలు వేసుకున్నారు. జూన్‌లో సాధారణ వర్షపాతం 64.7 మిల్లీమీటర్లకు కురిసింది 86.1 మి.మీ. ఇది కూడా మొదటి వారంలోనే కురిసింది. దీంతో రైతులు పూర్తిస్థాయిలో విత్తనాలను వేసుకోలేని పరిస్థితి నెలకొంది. విత్తనాలు వేసిన చోట మొలకెత్తడంలేదు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే సాగుకు ఇబ్బందులు తప్పవని రైతులు పేర్కొంటున్నారు.

తగ్గిన భూగర్భజలాలు: వర్షం కురిస్తేనే వరినాట్లు వేసుకోవడం సాధ్యపడుతుంది. ప్రసుత్తం బోర్లలో భూగర్భజలాలు పూర్తిగా తగ్గిపోయాయి. చేగుంట, రామాయంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట, వెల్దుర్తి, శివ్వంపేట, మాసాయిపేట, నార్సింగి, హవేలిఘనపూర్, నర్సాపూర్, కొల్చారం తదితర మండలాల్లో బోరు బావులనే నమ్ముకొని వరి సాగు చేస్తుంటారు. ప్రస్తుతం బోర్లలో కూడా నీటి మట్టం తగ్గింది. 


తేమ ఉంటేనే విత్తనాలు వేయాలి

-గోవింద్, డీఏవో

భూమిలో తేమ ఎక్కువగా ఉంటేనే విత్తనాలు వేసుకోవాలి. భారీ వర్షాలు కురిసిన తర్వాత నీరు భూమిలోకి వెళితే తేమశాతం పెరుగుతుంది. అప్పుడు విత్తితే సమస్య ఉండదు. ప్రస్తుతం ఎండలు అధికంగా ఉన్నాయి. అందువల్ల విత్తనాలు వేయవద్దు.


మళ్లీ దున్నాల్సిందే

-మల్లయ్య, రైతు, బోనాల

ఎకరం విస్తీర్ణంలో మొక్కజొన్న వేశా. రూ.5 వేలు ఖర్చయింది. విత్తనం మొలకెత్తకపోతే మళ్లీ దున్ని వేయాలి. గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు. తొలకరితో విత్తనాలు నాటాం. వర్షాలు కురిస్తేనే పంటలు పండే అవకాశం ఉంది.


బోర్లలో నీటి మట్టం తగ్గింది

-మధుసూదన్‌రెడ్డి కర్నాల్‌పల్లి

బోర్లలో భూగర్భజలాలు పూర్తిగా తగ్గిపోయాయి. వర్షం వస్తుందని ఆకాశం వంక ప్రతి రోజు చూస్తున్నాం.  నీరు లేకపోతే వరి సాగు కష్టం. ఇంకా నారుమళ్లు పోయలేదు. ఎకరన్నర విస్తీర్ణంలో మొక్కజొన్న సాగుచేశా. కొద్దిగా మొలకెత్తినా ఎండవేడికి మాడిపోతోంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని