logo

అర్జీల స్వీకరణ.. సవరణకు కార్యాచరణ

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ఆరు గ్యారంటీల పథకాలను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది.

Published : 19 Jun 2024 01:19 IST

న్యూస్‌టుడే, పెద్దశంకరంపేట: కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ఆరు గ్యారంటీల పథకాలను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ ఏడాది జవనరిలో గ్రామసభలు ఏర్పాటు చేసి అని గ్రామాల్లో లబ్ధిదారుల నుంచి  ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరించారు. ఇందులో గృహజ్యోతి పథకం కింద నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, మహాలక్ష్మి పథకం కింద రూ.500కే వంటగ్యాస్‌ పంపిణీ ప్రారంభించారు. అయితే దరఖాస్తుల్లో లోపాల వల్ల విద్యుత్‌ జీరోబిల్లు, మరికొందరికి వంటగ్యాస్‌ రాయితీ అందకుండా పోయింది. దీంతో ఎంపీడీవో కార్యాలయాలు, మున్సిపాలిటీ కార్యాలయాల్లో దరఖాస్తుల్లో సవరణల ప్రక్రియ చేపట్టారు. అంతలోనే లోక్‌సభ ఎన్నికల కోడ్‌ రావడంతో నిలిపివేశారు. మూడు నెలల తర్వాత తిరిగి చేపట్టారు. ఇందుకు సంబంధించిన వెబ్‌సైట్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. 

అర్హులకు అవకాశం: గృహజ్యోతి అర్హుల్లో కొందరికి విద్యుత్తు బిల్లులు వస్తున్నాయి. ప్రభుత్వం ఆహారభద్రతకార్డు కలిగిన ప్రతి ఒక్కరికి నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తామని ప్రకటించింది. కాని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే అందరికీ లబ్ధి చేకూరడం లేదు. ఇక రూ.500 గ్యాస్‌ పథకానికి సంబంధించిన నగదు అందరి ఖాతాల్లో జమ కావడం లేదు. ప్రజాపాలన గ్రామసభల సమయంలో దరఖాస్తులు ఆన్‌లైన్‌ చేయాలని అధికారులు ఒత్తిడి తీసుకురావడంతో కంప్యూటర్‌ ఆపరేటర్లు సరిపోక ప్రైవేటు వ్యక్తులకు, ఎవరికి పడితే వారికి అప్‌లోడ్‌ బాధ్యతను అప్పగించారు. వారు ఇష్టారాజ్యంగా చేయడంతో అనేక మందికి పథకాలు అందకుండా పోయాయి. సవరణ చేయించుకుందామంటే మూడు నెలల పాటు లోక్‌సభ ఎన్నికల కోడ్‌ కారణంగా సైట్‌ మూసి ఉంచారు. ప్రజాపాలనతో దరఖాస్తు చేసిన చాలా మంది అర్హులకు మొండిచేయి ఎదురవుతోంది. ప్రస్తుతం మళ్లీ సవరణకు ప్రభుత్వం అవకాశం కల్పించడంతో అర్హులైన లబ్ధిదారులు ఎంపీడీవో, మున్సిపాలిటీ కార్యాలయాలకు వెళ్లి వివరాలను సవరించుకునేందుకు అవకాశం కల్పించారు. వీటికి వెంటనే ఆమోదం లభిస్తుండడంతో లబ్ధిదారులకు ఊరట లభిస్తోంది. అయితే ఆపరేటర్లు చేసిన తప్పుల కారణంగా చాలా మందికి పథకాలు అందడం లేదు. దరఖాస్తు చేసుకున్నా మూడు, నాలుగు పథకాలకే దరఖాస్తు చేసినట్లు కొందరివి పొందుపరిచారు. దీంతో మిగతా పథకాలకు నాట్‌ అప్లయ్‌ అని వస్తుంది. ఇలా నాట్‌ అప్లయ్‌ అని వచ్చే పథకాలకు సంబంధించి ఆప్షన్‌ తెరిచేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో లబ్ధిదారులు నిరాశగా వెనుదిరుగుతున్నారు. సవరణలతో పాటు కొత్త దరఖాస్తులకు అవకాశం ఇవ్వాలని లబ్ధిదారులు కోరుతున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని