logo

నగదు రహితం.. పారదర్శకం

ఓ వైపు పొదుపు, మరోవైపు రుణాలు తీసుకొని వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు. తీసుకున్న రుణాలను వాయిదాల రూపంలో పక్కాగా చెల్లిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

Updated : 19 Jun 2024 06:10 IST

డిజిటల్‌ చెల్లింపులకు ప్రోత్సాహం
స్త్రీనిధి రుణ వాయిదాల  చెల్లింపులకు అవకాశం
న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్, సిద్దిపేట, మెదక్, వికారాబాద్‌

ఓ వైపు పొదుపు, మరోవైపు రుణాలు తీసుకొని వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు. తీసుకున్న రుణాలను వాయిదాల రూపంలో పక్కాగా చెల్లిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. స్త్రీనిధి రుణ వాయిదాలకు నగదు రహిత చెల్లింపులనూ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ విధానంతో పారదర్శకత పెరగడంతో పాటు చెల్లింపులకు ముందుకొచ్చే మహిళా పొదుపు సంఘాల సభ్యులకు ప్రోత్సాహకాలు (ఇన్సెంటివ్స్‌) కూడా ఇచ్చే కార్యక్రమం అమలు చేస్తోంది. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని ఆయా సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

గందరగోళానికి తావులేకుండా..

స్త్రీనిధి రుణ వాయిదాల చెల్లింపుల్లో కొంత గందరగోళంగా ఉంటుంది. రుణం తీసుకున్న సభ్యురాలు గ్రామైక్య సంఘం సమావేశం నిర్వహించే రోజు వాయిదా మొత్తాన్ని వీవోఏకు ఇవ్వాలి. అధ్యక్షురాలి సంతకంతో సభ్యురాలికి రసీదు ఇవ్వాల్సి ఉంటుంది. చాలా చోట్ల ఇది అమలుకు నోచుకోవడం లేదు. దీంతో సభ్యురాలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. తాను చెల్లించిన సొమ్ము సంబంధిత ఖాతాకు జమవుతుందో లేదో తెలియని పరిస్థితి. డిజిటల్‌ విధానంలో చెల్లింపులతో ఆ సమస్య ఉండదు. ఒక్కో సంఘానికి ప్రత్యేకంగా గుర్తింపు సంఖ్య (ఐడీ నంబర్లు)కేటాయించారు. చరవాణిలో డిజిటల్‌ చెల్లింపుల ఐచ్చికాన్ని ఎంచుకుని పొదుపు సంఘానికి సంబంధించిన ఐడీ నంబరును నమోదు చేయాల్సి ఉంటుంది. వాయిదాల చెల్లింపునకు సంబంధించిన ఐచ్ఛికం ఎంచుకుని చెల్లింపులు చేయవచ్చు. దీనిపై వీవోఏలకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. మహిళా సంఘాల సభ్యులు పూర్తిగా వినియోగించుకునేలా అవగాహన కల్పించనున్నారు.

సభ్యురాలి ఖాతాకు జమ

బ్యాంకు రుణ వాయిదాలు ప్రతినెలా 10వ తేదీలోపు చెల్లించేందుకు వెసులుబాటు ఉంటుంది. స్త్రీనిధి రుణ వాయిదాల చెల్లింపులు అలా కాదు. నిర్దేశించిన తేదీ రోజు చెల్లించాల్సిందే. ఒక్క రోజు ఆలస్యమైనా అపరాధ రుసుం భరించాల్సి ఉంటుంది. సభ్యురాలు సకాలంలో చెల్లించినా వీవోఏ నిర్లక్ష్యం చేసినా, సొంతానికి వాడుకున్నా సభ్యురాలికే నష్టం. నగదు రహిత చెల్లింపు పద్ధతిలో నిర్ణీత గడువు రోజే ఫోన్‌పే లేదా గూగుల్‌ పే ద్వారా చెల్లింపులు చేసేందుకు వీలుంటుంది. ఇలా చేయడం వల్ల ఇన్సెంటివ్‌ కూడా సభ్యురాలు బ్యాంకు ఖాతాకు జమ చేస్తారు. సభ్యురాలు చెల్లించే వడ్డీలో 0.5శాతం మొత్తాన్ని ఇన్సెంటివ్‌గా ఇస్తారు. ‘నగదు రహిత విధానంలో స్త్రీనిధి రుణ వాయిదాల చెల్లింపుతో మహిళా సంఘాల సభ్యులకు అన్ని విధాలుగా ప్రయోజనం ఉంటుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి’ అని సంగారెడ్డి స్త్రీనిధి ప్రాంతీయ మేనేజర్‌ మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని