logo

కొనుగోళ్లు ముగిశాయి.. పైసలు అందాయి..

జిల్లాలో యాసంగి సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లు ముగిశాయి. అకాల వర్షాలతో కొన్ని ఇబ్బందులు ఎదురైనా కేంద్రాల నిర్వాహకులు, అధికారులు కల్సి ఎలాంటి జాప్యం లేకుండా కొనుగోళ్లను విజయవంతం చేశారు.

Published : 19 Jun 2024 00:53 IST

3.15 లక్షల టన్నుల ధాన్యానికి రూ.691 కోట్ల చెల్లింపు

న్యూస్‌టుడే, హుస్నాబాద్‌ గ్రామీణం: జిల్లాలో యాసంగి సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లు ముగిశాయి. అకాల వర్షాలతో కొన్ని ఇబ్బందులు ఎదురైనా కేంద్రాల నిర్వాహకులు, అధికారులు కల్సి ఎలాంటి జాప్యం లేకుండా కొనుగోళ్లను విజయవంతం చేశారు. ముందుగా నిర్ణయించుకున్న లక్ష్యం కన్నా తక్కువ ధాన్యం కొన్నారు. వర్షాభావ పరిస్థితులతో ధాన్యం దిగుబడులు తగ్గడం, అంచనాకు తగినట్లుగా కొనుగోలు కేంద్రాలకు రాకపోవడమే కారణమని తెలుస్తోంది. 

ఎప్పటికప్పుడు పర్యవేక్షణ

ధాన్యం కొనుగోలు కేంద్రాలను 210 ఐకేపీ, 6 మెప్మా, 202 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం కొన్నారు. గతంలో సంఘటనలు, ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈసారి పునరావృతం కాకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. కలెక్టర్, అదనపు కలెక్టర్లు సహా పౌరసరఫరాలు, రెవెన్యూ, ఐకేపీ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి కొనుగోళ్ల తీరుతెన్నులను ఎప్పటికప్పుడు పరిశీలించారు. కొన్న వడ్లను ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేశారు.

గతేడాది కంటే తగ్గింది

గత ఏడాది యాసంగి సీజన్‌తో పోల్చితే ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్లు తగ్గాయి. వానాకాలం సీజన్‌తో పోల్చితే మాత్రం పెరిగాయి. ఈ ఏడాది వర్షాబావ పరిస్థితులతో వ్యవసాయ బావులు, బోర్లలో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. గింజకు పాలు పోసుకునే దశలో చాలా చోట్ల వరి పొలాలు ఎండిపోయాయి. దిగుబడులు పడిపోయాయి. గత ఏడాది యాసంగి సీజన్‌తో పోల్చితే ఈ ఏడాది  54,205 టన్నుల ధాన్యం కొనుగోలు తగ్గింది. వానాకాలం సీజన్‌తో పోల్చితే 6,100 టన్నులు పెరిగింది. గత ఏడాది వానకాలంలో 3.09 లక్షల మెట్రిక్‌ టన్నులు కొన్నారు.


విక్రయించిన మూడు రోజులకే చెల్లించాం

-హరీశ్, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌

ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతుల ఖాతాల్లో ఇప్పటివరకు రూ.691 కోట్లు జమ చేశాం. డబ్బుల చెల్లింపులో ఎలాంటి జాప్యం లేకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు ట్యాబ్‌లో నమోదు చేశారు. విక్రయించిన మూడు రోజుల్లో ఖాతాల్లో డబ్బులు పడేలా చర్యలు తీసుకున్నాం. ఇంకా సుమారు రూ.1 కోటి వరకు జమ చేయాల్సి ఉంది. అవి కూడా త్వరలోనే చెల్లిస్తాం. అందరి సహకారంతో కొనుగోళ్లు విజయవంతమయ్యాయి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని