logo

కేజీబీవీల్లో ప్రవేశాల జోరు

 నాణ్యమైన విద్య.. చక్కటి వసతి.. అనుబంధంగా వృత్తి విద్యా కోర్సులు.. అర్హత కలిగిన బోధనా సిబ్బందితో జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ) కొనసాగుతున్నాయి.

Published : 19 Jun 2024 00:50 IST

పాఠశాల స్థాయిలో లక్ష్యాన్ని మించి చేరిక

న్యూస్‌టుడే, సిద్దిపేట:  నాణ్యమైన విద్య.. చక్కటి వసతి.. అనుబంధంగా వృత్తి విద్యా కోర్సులు.. అర్హత కలిగిన బోధనా సిబ్బందితో జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ) కొనసాగుతున్నాయి. ఏటా వాటిల్లో చేరేందుకు విద్యార్థినులు పెద్దసంఖ్యలో ఆసక్తి చూపుతున్నారు. ఈ నెల 12న విద్యా సంవత్సరం ఆరంభమైన నేపథ్యంలో ప్రవేశాల ప్రక్రియ ముమ్మరంగా సాగింది. పాఠశాలల్లో లక్ష్యాన్ని మించి చేరారు. కొన్ని ప్రాంతాల్లో కొత్త కేజీబీవీలను ప్రభుత్వం మంజూరు చేస్తోంది. ధూల్మిట్టకు నూతనంగా మంజూరైన కేజీబీవీని తాత్కాలికంగా కొమురవెల్లిలోని అదే విద్యాలయం రెండో అంతస్తులో అందుబాటులోకి తెచ్చారు. ఒకేచోట రెండు విద్యాలయాలను నిర్వహిస్తున్నారు. 

కళాశాలల్లో గతం కంటే ఎక్కువ

జిల్లాలో కేజీబీవీల్లో పాఠశాల స్థాయిలో 23, కళాశాల స్థాయిలో (ఇంటర్‌) ఏడు కొనసాగుతున్నాయి. ఆరు నుంచి పదో తరగతి వరకు జిల్లా వ్యాప్తంగా పాఠశాలల్లో గత విద్యా సంవత్సరం 3842 మంది, కళాశాలల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో 555 మంది చదివారు. గత ఫలితాల్లో పదో తరగతిలో 99.7 శాతం, ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో 85.7 శాతం మేర ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 242 మంది బోధనా సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. గుణాత్మక విద్యను అందిస్తూ.. వసతి సదుపాయం కల్పిస్తుండటంతో ఎక్కువ శాతం బాలికలు మొగ్గు చూపుతున్నారు. రాత్రివేళల్లో ఉపాధ్యాయినుల పర్యవేక్షణలో అధ్యయన తరగతులు నిర్వహిస్తున్నారు. ఆరోగ్య రక్షణ దిశగా ఏఎన్‌ఎం అందుబాటులో ఉంటున్నారు. అన్ని చోట్ల సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశారు. కరాటేలో తర్ఫీదు అందిస్తున్నారు. చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో బాలికలు సత్తా చాటుతున్నారు. ఇంటర్‌ విద్యార్థినులకు ఎప్‌సెట్, లాసెట్, నీట్‌ సంబంధిత శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. జీవన నైపుణ్యాలు పెంపొందిస్తున్నారు. జిల్లాలోని మిట్టపల్లి, మిరుదొడ్డిలోని కేజీబీవీలలో రెండు చొప్పున వృత్తి నైపుణ్య కోర్సులు నిర్వహిస్తున్నారు. 

మూడు చోట్ల అద్దె భవనాలు

ప్రస్తుతం ఆరో తరగతి, ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. మిగిలిన తరగతుల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ధూల్మిట్ట కేజీబీవీలో 2024-25 విద్యా సంవత్సరానికి 6, 7 తరగతుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఒక్కో తరగతిలో 40 మందికి అవకాశం ఇవ్వనున్నారు. ఏడు చోట్ల కళాశాల స్థాయిలో రెండు చొప్పున కోర్సులు నిర్వహిస్తున్నారు. ప్రథమ సంవత్సరంలో ఒక్కో కోర్సులో 40 చొప్పున సీట్లు అందుబాటులో ఉన్నాయి. జిల్లాలో రాయపోల్, అక్కన్నపేట, ధూల్మిట్ట మినహా అన్ని సొంత భవనాల్లో కొనసాగుతున్నాయి. ‘న్యూస్‌టుడే’తో విద్యా శాఖ జెండర్‌ అండ్‌ ఈక్విటీ సమన్వయకర్త (జీఈసీవో) ముక్తేశ్వరి మాట్లాడుతూ.. అన్ని వసతులతో కొనసాగుతున్నాయని.. నెలకు రూ.100 చొప్పున ఒక్కో విద్యార్థినికి స్టైపండ్‌ అందిస్తున్నామని చెప్పారు. డిజిటల్‌ తరగతులు ఉన్నాయన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని