logo

బుగ్గన అహంకారానికి... అరాచకాలకు అంతం

రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన తెరవెనుక చేసిన అరాచకాలకు ప్రజలు అంతం పలికారు. సౌమ్యుడిగా ఉంటారనుకుని రెండుసార్లు డోన్‌ నియోజకవర్గంలో అధికారం కట్టబెట్టిన ప్రజలు మూడోసారి ఆయనకు ఓటమి రుచిని చూపించారు. ఒకవైపు అభివృద్ధి ముసుగులో డోన్‌లో ఆయన అనుచరవర్గం భూకబ్జాలు, అక్రమమద్యం, మట్కా దోపిడీలకు పాల్పడింది.

Published : 05 Jun 2024 07:25 IST

ఈనాడు, డోన్, న్యూస్‌టుడే: రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన తెరవెనుక చేసిన అరాచకాలకు ప్రజలు అంతం పలికారు. సౌమ్యుడిగా ఉంటారనుకుని రెండుసార్లు డోన్‌ నియోజకవర్గంలో అధికారం కట్టబెట్టిన ప్రజలు మూడోసారి ఆయనకు ఓటమి రుచిని చూపించారు. ఒకవైపు అభివృద్ధి ముసుగులో డోన్‌లో ఆయన అనుచరవర్గం భూకబ్జాలు, అక్రమమద్యం, మట్కా దోపిడీలకు పాల్పడింది. వాటి గురించి పట్టించుకోని బుగ్గన ఎవరైనా సమస్యలపై ప్రశ్నించినా, ఎదురునిలిచి మాట్లాడినా తట్టుకోలేకపోయేవారు. అటువంటి వారిని లక్ష్యంగా చేసుకుని అధికార దర్పాన్ని ఉపయోగించి కేసులు పెట్టించి వేధించారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. అవకాశం కోసం చూద్దాం అనే రీతిలో ఎదురుచూసిన ప్రజలు అభివృద్ధిమంత్రాన్ని తిప్పికొట్టి అరాచకపాలనను వ్యతిరేకిస్తామని ఓటుతో బుద్ధి చెప్పారు. ప్రతిపక్ష తెదేపా నాయకులను లక్ష్యంగా చేసుకుని బుగ్గన ఎంతో మందిపై కేసులు పెట్టించారు. దీన్ని జీర్ణించుకోలేక ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వారంతా కలసి ఓటమిని అందించారు.

బుగ్గన ఓటమికి గట్టిగా కృషి

సొంత మండలం బేతంచెర్లలోని ఆయన సొంత బంధువర్గమంతా బుగ్గన ఓటమికి గట్టిగానే పని చేశారు. పదవుల ఆశజూపి గెలుపొందాక అసలు పట్టించుకోకపోవటమూ, అసలు సొంతబంధువర్గాన్ని పట్టించుకోకుండా అహంకారపూరితంగా వ్యవహరించారనే ఆరోపణలతో బుగ్గన ప్రభాకర్‌రెడ్డి, బుగ్గన ప్రసన్నలక్ష్మి, బుగ్గన మాధవిలతారెడ్డి బేతంచెర్ల పట్టణంలోనూ, మండలంలోనూ కోట్ల కుటుంబం వెంట నిలిచి గట్టిగా బుగ్గన ఓటమికి కృషి చేశారు.

మైనింగ్‌ వ్యాపారులపై కేసులు..పరిశ్రమల కుదేలు

మైనింగ్‌ వ్యాపారులపై అధికారుల దాడులు, బేతంచెర్ల, డోన్‌ ప్రాంతాల్లో విజిలెన్సు కేసుల నమోదుతో వేధించారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. బేతంచెర్ల మండలంలో బుగ్గన ఓటమికి మైనింగ్‌ వ్యాపారులు గట్టిగా పనిచేశారు. వందలాది పరిశ్రమలు కుదేలయ్యేలా బుగ్గన చేశారని, విద్యుత్తుఛార్జీల పెంపుతో వందలాది గ్రానైట్, పౌడర్‌ పరిశ్రమలు మూతపడటంతో ఇటు పరిశ్రమల యజమానుల్లోనూ తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఎక్కువైంది.

సొంత పార్టీ వారే పట్టించుకోకపోవడంతో...

సొంతపార్టీలోని నాయకులను రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన విస్మరించడం వల్ల ఆయన కొంప మునిగిందంటున్నారు. గత రెండు ఎన్నికల్లో ఆయన గెలుపునకు పనిచేసిన కార్యకర్తలను పట్టించుకోలేదని, వారి సమస్యలను పరిష్కరించకపోవడంతో వారంతా గట్టిగా పనిచేయకపోవడంతో కోట్ల గెలుపు సునాయసమైంది. పార్టీలో అక్రమాలకు, కబ్జాలకు పాల్పడిన నాయకులకే బుగ్గన ప్రాధాన్యమిచ్చారని, నిజమైన పార్టీ నాయకులు, కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయారనే విమర్శలు ఎక్కువవుతున్నాయి.

అభివృద్ధి మాటున.. పనులన్నీ కొత్త వారికే కేటాయించడం...

డోన్‌ నియోజకవర్గంలో పెద్దఎత్తున అభివృద్ధి చేస్తున్నామని చెప్పినా ఆయన పెద్దపెద్ద కాంట్రాక్టులన్నీ ఇతర ప్రాంతాల నాయకులకే కట్టబెట్టడం, స్థానిక నాయకులకు మొండిచేయి చూపటం కూడా చాలామందిలో అసంతృప్తికి కారణమైంది. ఇలాంటివన్నీ ఆయన ఓటమికి కారణలయ్యాయి.


కబ్జా కోరలు పీకిన జనం

కాటసానిని వెంటాడిన ఆరోపణలు  
వెంట నడిచిన వారే ఇంటికి సాగనంపారు

కర్నూలు, న్యూస్‌టుడే : నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కాటసాని రాంభూపాల్‌రెడ్డి.. ఈసారి తీవ్ర ప్రజావ్యతిరేకతతో పరాజయాన్ని మూటగట్టుకున్నారు. బలమైన నాయకత్వం, కార్యకర్తల బలం ఉంది. నిత్యం ప్రజల్లోనే ఉంటారు. ఎనిమిది సార్లు ఎన్నికల్లో పోటీచేస్తే ఆరుసార్లు విజయం సాధించారు. ఈసారి తొమ్మిదోసారి బరిలో దిగారు. తెదేపా అభ్యర్థి గౌరు చరితారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. బలమైన వ్యక్తిగా ముద్రపడిన కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. గత ఐదేళ్లలో కాటసాని రాంభూపాల్‌రెడ్డిపై భూకబ్జా ఆరోపణలు పెద్దఎత్తున వచ్చాయి. కల్లూరు పట్టణంలోని పార్కు స్థలాలు ఆక్రమించి ఆయన అనుచరులు పాగా వేశారు. ఖాళీ స్థలాలపై వివాదం సృష్టించి వాటిని కొందరు అనుచరులు కాజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇళ్ల స్థలాలు, పట్టణ పరిధిలో భూములు ఉన్న వారు కాటసాని వెంట తిరిగినా ఎన్నికల్లో మాత్రం తెదేపాకే ఓటు వేసినట్లు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. మా భూములు, స్థలాలు కాపాడుకునేందుకు అతని వెంట తిరుగుతున్నామని, అతన్ని సాగనంపకుంటే మా ఆస్తులు మాకు దక్కవని పలువురు అన్నట్లు చర్చ సాగుతోంది. భూ వివాదాల్లో వైకాపా నాయకులు తలదూర్చి భారీగా డబ్బులు తీసుకొని పనులు చేయించినట్లు ఆరోపణలున్నాయి. రెవెన్యూ, పోలీసు స్టేషన్లను తమ కనుసన్నల్లో పెట్టుకొని ప్రతిపనికీ కమీషన్లు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

భారీగా ఓట్ల తొలగింపు 

కల్లూరు పట్టణంలో నివాసం లేని ఓటర్లను భారీగా తొలగించారు. గతంలో బనగానపల్లి నియోజకవర్గానికి చెందిన అనేక మందికి కల్లూరు పట్టణంలో ఓట్లు ఉండేవి. ఓటర్ల జాబితా ప్రక్షాళన జరగడంతో ఈసారి దొంగ ఓట్లకు అడ్డుకట్ట పడింది.

‘ఈనాడు’ కార్యాలయంపై దాడితో మార్పు

తమ అవినీతి, అక్రమాలను వెలుగులోకి తెచ్చిందన్న అక్కసుతో ‘ఈనాడు’ కార్యాలయంపై దాడి చేయడం ప్రజల్లో చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో అత్యధిక పాఠకాదరణ కలిగిన పత్రిక కార్యాలయంపైనే దాడి చేస్తే సామాన్యులమైన మా పరిస్థితేంటని చాలామందిలో ఆలోచన మొదలైంది. ఇది కూడా ఓటర్లలో మార్పునకు కారణమైంది. కాటసానిని ఇంటికి పంపిస్తేనే తమకు రక్షణ ఉంటుందని ప్రజలు భావించారు.

అక్రమ కేసులతో బెదిరింపులు

గ్రామాల్లో వైకాపా నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడినా, అవినీతి అక్రమాలను ప్రశ్నించిన వారిపై అక్రమంగా కేసులు బనాయించారు. బెదిరింపులకు పాల్పడ్డారు. దాడులు చేసి గాయపర్చారు. ప్రజల్లో భయోత్పాతం సృష్టించారు. ఇటువంటి నాయకులను ఇంటికి పంపితేనే రక్షణ ఉంటుందని ప్రజల్లో చర్చ సాగింది. 

దెబ్బతీసిన వర్గపోరు

నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో వైకాపాలో రెండువర్గాలు ఉన్నాయి. రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరే ఎన్నికల్లో దెబ్బతీసిందన్న చర్చ సాగుతోంది. రెండింట్లో ఒక వర్గానికే ఎమ్మెల్యే మద్దతు ఇవ్వడంతో మరో వర్గం వారిలో అసంతృప్తి పెరిగిపోయింది. వారు ఎమ్మెల్యే వెంట ఉన్నా ఎన్నికల్లో మాత్రం పనిచేయలేదని తెలిసింది. అంతేగాక గ్రామాల్లో తమ పార్టీలోని వైరి వర్గం ఆధిపత్యాన్ని తగ్గించేందుకు తెదేపా నాయకులకు ఆర్థిక సాయం చేసినట్లు కూడా చర్చ సాగుతోంది.

బైరెడ్డి రాకతో మార్పు 

బైరెడ్డి శబరి తెదేపాలో చేరి ఎంపీ అభ్యర్థిగా పోటీకి దిగడంతో తెదేపాకు జోష్‌ వచ్చింది. అప్పటి వరకు స్తబ్దుగా ఉన్న బైరెడ్డి వర్గం ఉత్సాహంగా ఎన్నికల్లో పాల్గొన్నారు. బైరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి ఓర్వకల్లు, కల్లూరు పట్టణంపై ప్రధానంగా దృష్టిసారించారు. ప్రత్యర్థి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడకుండా కట్టడి చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని