logo

సైకిల్‌ సవారి.. పంకా విరిగి

సైకిల్‌ స్పీడుకు పంకా రెక్కలు ఊడింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో తెదేపా ఘన విజయం సాధించింది. సైకిల్‌ వేగం తట్టుకోలేక వైకాపా అభ్యర్థులు బోర్లా పడ్డారు. ఓటు అనే ఆయుధంతో ప్రజలు వైకాపాను తరిమితరిమి కొట్టారు. జనం.. ఐదేళ్లపాటు వైకాపా నాయకుల ఆగడాలు భరించారు. ధరలు విపరీతంగా పెంచేసినా ఓర్పు వహించారు.

Published : 05 Jun 2024 01:47 IST

కర్నూలు, పాణ్యం, కోడుమూరులో తెదేపా అభ్యర్థుల విజయం

గౌరు చరితారెడ్డి దరహాసం , విజయచిహ్నం చూపుతున్న టీజీ భరత్‌

సైకిల్‌ స్పీడుకు పంకా రెక్కలు ఊడింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో తెదేపా ఘన విజయం సాధించింది. సైకిల్‌ వేగం తట్టుకోలేక వైకాపా అభ్యర్థులు బోర్లా పడ్డారు. ఓటు అనే ఆయుధంతో ప్రజలు వైకాపాను తరిమితరిమి కొట్టారు. జనం.. ఐదేళ్లపాటు వైకాపా నాయకుల ఆగడాలు భరించారు. ధరలు విపరీతంగా పెంచేసినా ఓర్పు వహించారు. సమయం రాగానే ఓటుతో దిమ్మదిరిగే తీర్పు ఇచ్చారు.. కర్నూలు నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన టీజీ భరత్‌ తన సమీప వైకాపా ప్రత్యర్థి ఏఎండీ ఇంతియాజ్‌పై విజయం సాధించారు. పాణ్యం నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తన సమీప ప్రత్యర్థి.. వైకాపాకు చెందిన కాటసాని రాంభూపాల్‌రెడ్డిపై తిరుగులేని ఆధిపత్యం సాధించారు. కోడుమూరు తెదేపా అభ్యర్థిగా బరిలో దిగిన బొగ్గుల దస్తగిరి.. వైకాపాకు చెందిన సతీశ్‌పై గెలుపొందారు.


విజయ చరితం

పాణ్యం గడ్డపై ఎగిరిన తెదేపా జెండా
కాటసాని అక్రమాలతో విసిగిపోయిన జనం

జేసీ మౌర్య చేతులమీదుగా ధ్రువీకరణ పత్రం   అందుకుంటున్న గౌరు చరితారెడ్డి

కల్లూరు గ్రామీణ, న్యూస్‌టుడే : పాణ్యం గడ్డపై తెదేపా జెండా సగౌరవంగా ఎగిరింది. నియోజకవర్గ ప్రజలు భారీ మెజార్టీతో గౌరు చరితారెడ్డిని గెలిపించారు. వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కాటసాని రాంభూపాల్‌రెడ్డి అరాచకాలతో విసిగిపోయిన ప్రజలు తమ ఓటుతో తగిన బుద్ధి చెప్పారు. ప్రతి రౌండులోనూ తెదేపా  అభ్యర్థికి స్పష్టమైన మెజార్టీ లభించింది.

గౌరు.. ఎమ్మెల్యేగా మూడోసారి

పాణ్యం నియోజకవర్గం 1967లో ఏర్పడింది. అప్పట్లో కల్లూరు ప్రాంతం పాణ్యంలో లేదు. 1967 నుంచి 2004 వరకు ఐదుసార్లు కాంగ్రెస్, ఒకసారి కాంగ్రెస్‌ ఐ, స్వతంత్ర అభ్యర్థి ఒకసారి, జనతా పార్టీ ఒకసారి, 1983, 1999లో తెదేపా గెలుపొందింది. 2009లో పాణ్యం నియోజకవర్గాన్ని పునర్విభజన చేశారు. కల్లూరు, ఓర్వకల్లు, పాణ్యం, గడివేముల మండలాలతోపాటు కల్లూరు వార్డులను కలిపి నియోజకవర్గంగా చేశారు. 2009లో కాంగ్రెస్, 2014, 2019లో వైకాపా గెలుపొందింది.   కాటసాని రాంభూపాల్‌రెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా  గెలిచారు. వైకాపా తరఫున 2014లో గౌరు చరితారెడ్డి విజయం సాధించారు. ప్రస్తుతం మూడోసారి ఎమ్మెల్యేగా విజయం కైవసం చేసుకున్నారు. 2004, 2014లో గౌరు చరితారెడ్డి విజయాలు నమోదు చేసుకున్నారు. 2019లో తెదేపా తరఫున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం మరోసారి తెదేపా తరఫున బరిలో దిగి భారీ మెజార్టీతో గెలుపొందారు. అంతకుముందు 2004లో నందికొట్కూరు ఎమ్మెల్యేగా గౌరు చరితారెడ్డి విజయం సాధించారు.

ప్రతి గడప తొక్కి..

2019లో గౌరు చరితారెడ్డి ఓటమి పాలైనప్పటికీ ఏమాత్రం నిరుత్సాహ పడలేదు. నిరంతం ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యలు తెలుసుకున్నారు. అధికార పార్టీ అక్రమాలపై పోరాటం చేశారు. నిత్యం గళమెత్తి ఉద్యమించారు. ఐదేళ్ల కాలంలో ప్రతి గడప తొక్కి ఓట్లు అభ్యర్థించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా తెదేపా నాయకులు, కార్యకర్తలకు అండగా ఉన్నారు. తెదేపా మ్యానిఫెస్టోను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారు. వైకాపా ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై తెదేపా పిలుపునిచ్చిన ప్రతి ఉద్యమంలో ఆమె కీలకపాత్ర పోషించారు. నియోజకవర్గంలో ‘బాబు స్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ’ కార్యక్రమాలను నిరంతరం నిర్వహించారు. ఎన్నికల నేపథ్యంలో సుడిగాలి పర్యటనలు జరిపారు. ఎమ్మెల్యే కాటసాని అక్రమాలపై ఎలుగెత్తి చాటారు. వీటిని ప్రజలకు వివరించడంలో సఫలీకృతులయ్యారు. 

రెపరెపలాడిన పసుపు జెండా

పాణ్యం నియోజకవర్గంలో తెదేపా జెండా రెపరెపలాడుతోంది. గడిచిన ఐదేళ్ల కాలంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు నిరుత్సాహ పడకుండా పనిచేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పార్టీ గెలుపే ధ్యేయంగా ముందుకు కదిలారు. పార్టీ గెలుపు కోసం కృషి చేశారు. కూటమి ఏర్పడిన నేపథ్యంలో జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలను కలుపుకొని సమన్వయంగా పనిచేస్తూ పార్టీ విజయానికి కీలక పాత్ర పోషించారు. పాణ్యం నియోజకవర్గంలో తెదేపా జెండా ఎగరడంతో శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచిపెట్టారు. బాణాసంచా కాల్చారు. ఆనందోత్సాహాలతో మునిగితేలారు. 


భరత్‌వ్యూహం.. సఫలీకృతం


ఆర్వో భార్గవ్‌తేజ చేతులమీదుగా ధ్రువీకరణ పత్రం అందుకుంటున్న టీజీ భరత్‌ 

కర్నూలు గాయత్రీ ఎస్టేట్, కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : ఓటమిని అనుభవంగా మలుచుకోవడమేకాదు.. వ్యూహాలు రచించి విజయం అందుకోవడంలో టీజీ భరత్‌ సఫలీకృతులయ్యారు. మాజీ మంత్రి టీజీ వెంకటేశ్‌ తనయుడిగా.. టీజీ భరత్‌ అపురూపమైన విజయం అందుకున్నారు. కుటుంబ వారసత్వంగా వ్యాపారాల్లో రాణించిన టీజీ భరత్‌.. తన తండ్రి వారసత్వంగా సేవా కార్యక్రమాలు కొనసాగించారు. అనంతరం 2019లో రాజకీయ ప్రవేశం చేశారు. తెదేపా తరఫున కర్నూలు అసెంబ్లీ బరిలో దిగి కేవలం 5,353 ఓట్లతో ఓడిపోయారు. అయినా నిరాశకు గురికాకుండా పట్టుదలతో ఓటమికి కారణాలు విశ్లేషించుకుని వ్యూహాత్మకంగా అడుగులేశారు. 

ప్రత్యేకమైన మ్యానిఫెస్టో రూపొందించుకుని..

తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించిన మ్యానిఫెస్టోకు అనుబంధంగా తన వ్యక్తిగత ఆరు భరోసాలతో ప్రత్యేక మ్యానిఫెస్టో రూపొందించారు. కర్నూలు స్మార్ట్‌ సిటీ, మహిళలకు స్వయం ఉపాధికి ఆర్థిక భరోసా, కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు, అందరికీ ఆరోగ్యం, కర్నూలుకు హైకోర్టు బెంచి ఏర్పాటు తన లక్ష్యమంటూ ప్రతి పోలింగ్‌ బూత్‌కు ముగ్గురిని నియమించుకుని ప్రతి కుటుంబానికి తన వ్యక్తిగత హామీలను వివరించారు. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండంటూ ప్రతి ఇంటికెళ్లి అభ్యర్థించారు. 

పాతబస్తీవాసుల మనసు చూరగొని..

అత్యధిక జనాభా ఉండే పాతబస్తీ ముస్లింలలో కూటమిపై ఉన్న అపోహలు తొలగించి వారి నమ్మకం పొందారు. తన గెలుపును ఆకాంక్షించే మిత్రులు, సన్నిహితులను జత చేసుకుని వైకాపా వ్యూహాలను పసిగట్టి ప్రతి వ్యూహాలు రచించారు. తన ఎన్నికల సమయంలో తన ముగ్గురు అనుచరులను పోలీసులు విచక్షణారహితంగా కొట్టిన సమయంలో భరత్‌ తనదైన శైలిలో ప్రతిఘటించి వారికి అండగా నిలిచారు. ఐదేళ్లలో తన కోసం పనిచేసిన అనుచరులు, తెదేపా నాయకులు, కార్యకర్తలను ప్రతిపక్ష పార్టీ నాయకులు ఇబ్బందులు పెట్టిన ప్రతి సందర్భంలో వారికి అండగా నిలిచి ధైర్యం నింపి కాపాడుకున్నారు. ఎన్నికల ప్రచారంలో పొరపాటున కూడా వ్యక్తిగత విమర్శలు చేయకుండా అధికార పార్టీ లోపాలు ఎత్తిచూపి హుందాగా వ్యవహరించారు. ఎన్నికల రోజన ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు కవ్వింపు చర్యలకు పాల్పడినా సహనం ప్రదర్శించారు. గతంలో ఎంతో మెజార్టీతో ఓడిపోయారో అంతకు నాలుగు రెట్లు మెజార్టీతో గెలుపొంది కర్నూలు అసెంబ్లీ స్థానం కైవసం చేసుకున్నారు. ప్రసుత్తం టీజీ భరత్‌ 20 వేలకుపైగా మెజార్టీ సాధించడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని