logo

చల్లని చూపు.. ఎవరి వైపు..?

శాసనసభ ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యం ప్రదర్శించిన కాంగ్రెస్‌ పార్టీకి లోక్‌సభ ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. పార్టీ అభ్యర్థిగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడు రామసహాయం రఘురాంరెడ్డి తొలిసారి ఎన్నికల బరిలో నిలిచారు

Published : 04 Jun 2024 02:00 IST

ఈటీవీ-ఖమ్మం: సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడికి కౌంట్‌డౌన్‌ మొదలైంది. ఖమ్మం లోక్‌సభ స్థానం ఓట్లను ఖమ్మం గ్రామీణం మండలం పొన్నెకల్లులోని శ్రీచైతన్య ఇంజినీరింగ్‌ కళాశాలలో మంగళవారం ఉదయం 8 గంటల నుంచి లెక్కించనున్నారు. 1,896 పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ 117 టేబుళ్లపై సాగనుంది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్లు, తర్వాత ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు ఏ పార్టీ గెలుస్తుందనే అంశంపై స్పష్టత రానుంది. 21 రౌండ్ల తర్వాత తుది ఫలితం వెల్లడవుతుంది. 52 మంది అభ్యర్థులు బరిలో నిలిచినా ప్రధానంగా కాంగ్రెస్, భారాస, భాజపా అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. 

ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకం 

శాసనసభ ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యం ప్రదర్శించిన కాంగ్రెస్‌ పార్టీకి లోక్‌సభ ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. పార్టీ అభ్యర్థిగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడు రామసహాయం రఘురాంరెడ్డి తొలిసారి ఎన్నికల బరిలో నిలిచారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రచారం సాగించారు. శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో మిత్రపక్షం సీపీఐతో కలిపి హస్తం పార్టీ సుమారు 2.60 లక్షల ఓట్ల ఆధిక్యం సంపాదించింది. లోక్‌సభ ఎన్నికల్లోనూ అదేస్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించాలనే లక్ష్యంతో పార్టీ నేతలు, కార్యకర్తలు శ్రమించారు. సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు భారాస సర్వశక్తులు ఒడ్డింది. 

ఎవరి ధీమా వారిదే..

భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు తరఫున మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర జోరుగా ప్రచారం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి గణనీయమైన ఓట్లు సాధిస్తామన్న ధీమాతో భాజపా ఉంది. పార్టీ అభ్యర్థి తాండ్ర వినోద్‌రావుకు మద్దతుగా కేంద్ర మంత్రి అమిత్‌షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తదితరులు ప్రచారం నిర్వహించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు

https://assets.eenadu.net/eeimages//featureimages/365X255/124124709-365X255.jpg మరిన్ని