logo

Rave Party: వేగంగా బెంగళూరు రేవ్‌ పార్టీ కేసు విచారణ

నగర శివార్లలో ఇటీవల సంచలనానికి కారణమైన రేవ్‌పార్టీలో పాల్గొన్న వారికి మాదక ద్రవ్యాలు సరఫరా చేశాడనే ఆరోపణపై దేవరజీవనహళ్లి నివాసి ఇమ్రా షరీఫ్‌ అనే వ్యక్తిని సీసీబీ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.

Updated : 04 Jun 2024 09:21 IST

నటి హేమాను తరలిస్తున్న పోలీసులు

బెంగళూరు (యలహంక), న్యూస్‌టుడే : నగర శివార్లలో ఇటీవల సంచలనానికి కారణమైన రేవ్‌పార్టీలో పాల్గొన్న వారికి మాదక ద్రవ్యాలు సరఫరా చేశాడనే ఆరోపణపై దేవరజీవనహళ్లి నివాసి ఇమ్రా షరీఫ్‌ అనే వ్యక్తిని సీసీబీ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఈ కేసు విచారణను శరవేగంగా కొనసాగిస్తున్న అధికారులు మరిన్ని ఆధారాల సేకరణలో నిమగ్నమయ్యారు. ఆ యువకుడి నుంచి 40 ఎండీఎంఏ బిళ్లలను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుల సూచనతోనే సరకు సమకూర్చానని చెప్పాడన్నారు. ఈ పార్టీ కోసం ఏకంగా రూ.50 లక్షలు ఖర్చు చేశారని, హైదరాబాద్‌ నివాసి వాసు పుట్టిన రోజు పేరిట పార్టీలో 150 మంది పురుషులు, మహిళలు పాల్గొన్నట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు. ఈ పార్టీకి మాదకద్రవ్యాలు సమకూర్చారనే ఆరోపణపై ఇప్పటికే సిద్ధిక్, రణధీర్, రాజ్‌భావ అనే వ్యక్తులను కటకటాల వెనక్కినెట్టడం గమనార్హం.

మరోవైపు.. ఈ కేసులో తెలుగు సహాయ నటి హేమా ఎట్టకేలకు సోమవారమే సీసీబీ దర్యాప్తు అధికారుల ఎదుట లొంగిపోవడం నాటకీయతను తలపించింది. ఆమె పార్టీలో పాల్గొని, మాదకద్రవ్యాలు తీసుకున్నారనేది అభియోగం. హేమా బుర్కా ధరించి చామరాజపేటలోని సీసీబీ కార్యాలయంలోకి చేరుకున్నాక.. అధికారుల ప్రశ్నల వర్షంలో ఉక్కిరి బిక్కిరయ్యారు. ఆమె నుంచి ఏ ప్రశ్నకూ సరైన సమాధానం లభించకపోవడంతో చివరికి అరెస్టు చేశారు. పార్టీలో నేనేమీ పాల్గొనలేదని, హైదరాబాద్‌లోనే ఉన్నానంటూ తొలుత ఆమె బుకాయించడాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. అప్పట్లో ఆమె తీరుపై నగర పోలీసు కమిషనర్‌ దయానంద్‌ ఓ ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది. ఆమె పాత్రను ధ్రువీకరించారు. ఆపై పలువురి నుంచి ఫోన్లు చేయించి, కేసు నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నం చేయడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా ఫోన్లు చేసే వారిపైనా కేసులు పెడతామనడంతో ఆమె లొంగిపోక తప్పని వాతావరణం తలెత్తింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని