logo

Hyd Metro : విమానాశ్రయానికి దగ్గరి దారేది?..‘మెట్రో’ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి

శంషాబాద్‌ విమానాశ్రయానికి ప్రత్యామ్నాయ మార్గాల్లో మెట్రో అలైన్‌మెంట్లను త్వరగా సిద్ధం చేయాలని కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం ఆదేశించడంతో మెట్రో అధికారులు క్షేత్రస్థాయిలో అధ్యయనానికి సన్నద్ధం అవుతున్నారు.

Updated : 15 Dec 2023 09:36 IST

ఈనాడు, హైదరాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయానికి ప్రత్యామ్నాయ మార్గాల్లో మెట్రో అలైన్‌మెంట్లను త్వరగా సిద్ధం చేయాలని కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం ఆదేశించడంతో మెట్రో అధికారులు క్షేత్రస్థాయిలో అధ్యయనానికి సన్నద్ధం అవుతున్నారు. ప్రధానంగా సీఎం రేవంత్‌రెడ్డి సూచించిన రెండు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టారు. దూరం, నిర్మాణానికి అయ్యే వ్యయం, సేకరించాల్సిన ఆస్తుల వివరాలపై ప్రాథమిక నివేదిక రూపొందించి సర్కారుకు అందజేయనున్నట్లు హెచ్‌ఎంఆర్‌ వర్గాలు తెలిపాయి.

మెట్రోరైలు మొదటి దశలో మూడు మార్గాల్లో 69.2 కి.మీ.మార్గం పూర్తయి ప్రయాణికులకు సేవలందిస్తోంది. మలిదశలో విమానాశ్రయానికి తొలుత కారిడార్‌-2లోని ఫలక్‌నుమా నుంచి కొనసాగింపుగా మెట్రో మార్గాన్ని ప్రతిపాదించారు. అయితే  కారిడార్‌-3 రాయదుర్గం నుంచి కొనసాగింపుగా విమానాశ్రయానికి మార్గం వేయాలని గత ప్రభుత్వం సూచించింది. టెండర్లు కూడా పూర్తయ్యాయి. 31 కి.మీ. దూరానికి రూ.6,250 కోట్లు అవుతుందని అంచనా వేశారు. దీన్ని కొత్త సర్కారు నిలిపేయమంది.

 మైలార్‌దేవ్‌పల్లి నుంచి  పీ7 రోడ్డు..

 ఫలక్‌నుమా నుంచి చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, పీ7 రోడ్‌ మీదుగా విమానాశ్రయానికి 13.7 కి.మీ. అవుతుందని అధికారులు అంటున్నారు. సగానికి పైగా దూరం కలిసొస్తుంది. ఫలక్‌నుమా నుంచి చాంద్రాయణగుట్ట, పహాడిషరిఫ్‌ మీదుగా శ్రీశైలం రోడ్డు వైపు నుంచి విమానాశ్రయానికి 17 కి.మీ. దూరం అవుతుంది. నిర్మాణ వ్యయం తగ్గుతుంది.
విమానాశ్రయ మెట్రోకి ఎల్బీనగర్‌ నుంచి చాంద్రాయణగుట్ట 11 కి.మీ.మార్గాన్ని సైతం అనసంధానం చేయాలని కొత్త సర్కారు భావిస్తోంది. అంతకంటే ముందు నాగోల్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు మధ్యలో మిగిలిన 5 కి.మీ. దూరాన్ని మెట్రో మార్గంతో కలపాల్సి ఉంది.

సాధ్యాసాధ్యాల పరిశీలన..

మెట్రో ప్రాజెక్ట్‌ చేపట్టేటప్పుడు ఆర్థికంగా సాధ్యాసాధ్యాలు కూడా ప్రధానంగా చూస్తారు. దూరం, అందుకయ్యే వ్యయం, సేకరించాల్సిన ఆస్తులు, ఎక్కే ప్రయాణికుల సంఖ్య, వచ్చే ఆదాయం వంటివన్ని పరిగణనలోకి తీసుకుంటారు. వీటన్నింటిని పరిశీలించిన తర్వాత ప్రభుత్వం  సాధ్యమయ్యే మార్గాన్ని ఎంపిక చేయనుందని అధికారులు అంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని