logo

ప్రతిష్ఠాత్మకం.. కంటోన్మెంట్‌ విజయం

లోక్‌సభ ఎన్నికలతో పాటు జరిగిన కంటోన్మెంట్‌ శాసనసభ నియోజకవర్గ  ఉప ఎన్నిక ఫలితం మంగళవారం వెల్లడి కానుంది.

Updated : 04 Jun 2024 03:36 IST

ఈనాడు, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికలతో పాటు జరిగిన కంటోన్మెంట్‌ శాసనసభ నియోజకవర్గ  ఉప ఎన్నిక ఫలితం మంగళవారం వెల్లడి కానుంది. నియోజకవర్గంలో  2,53,706 మంది ఓటర్లుండగా..1,30,929 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గంలో 47.85 శాతం ఓట్లు పోలవగా.. ఈసారి 51.61 శాతం నమోదైంది. మొత్తం 17 రౌండ్ల ఓట్ల లెక్కింపులో భాగంగా 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపుతో ప్రక్రియ మొదలు కానుంది. లోక్‌సభ ఫలితాలకంటే ముందే ఫలితం వెల్లడి కానుంది.

15 మంది అభ్యర్థులు.. కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న మృతితో 2023లో జరిగిన ఎన్నికల్లో ఆయన కుమార్తె లాస్య నందిత పోటీ చేసి విజయం సాధించారు. కొన్ని నెలలకే రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందడంతో ఉప ఎన్నిక జరిగింది. భారాస తరఫున సాయన్న చిన్న కుమార్తె నివేదిత బరిలో నిలవగా.. అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన శ్రీగణేష్‌ ఈ సారి కాంగ్రెస్‌ నుంచి రంగంలోకి దిగగా.. భాజపా తరఫున వంశతిలక్‌ పోటీ పడ్డారు.15 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

నగరంలో పాగా వేసేందుకు.. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన వారిలో ఒక్కరూ గెలవలేదు. కంటోన్మెంట్‌ ఉప ఎన్నికల్లో విజయం సాధించి బోణీ కొట్టాలని కాంగ్రెస్‌ ప్రచారం చేయగా..  పట్టు కోల్పోరాదని భారాస తీవ్రంగా ప్రయత్నించింది. దేశవ్యాప్తంగా భాజపా గాలి వీస్తుందనే సంకేతాలతో ఆ పార్టీ  విస్తృతంగా ప్రచారం చేసింది. కాంగ్రెస్‌ తరఫున సీఎంరేవంత్‌రెడ్డి సుడిగాలి పర్యటనలు చేశారు. అనేక హామీలు గుప్పించారు. పార్టీ తరఫున ప్రచార బాధ్యతలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో పాటు.. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి, రాజ్యసభ సభ్యుడు అనిల్‌ కుమార్‌ యాదవ్‌ నిర్వర్తించారు. భారాస తరఫున  వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌  ప్రచారం చేశారు. మాజీ మంత్రి, సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్‌ నివేదితకు మద్దతుగా పాల్గొన్నారు. భాజపా నుంచి  రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పలుమార్లు వచ్చి పలు వర్గాల ప్రజానీకంతో సమావేశాలు నిర్వహించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని