logo

కుళాయిల్లో కలుషిత నీరు

గుండ్లకమ్మ జలాశయంలో నీటి మట్టం పూర్తిగా పడిపోవడంతో కొరిశపాడు, జె.పంగులూరు మండలాల్లోని 21 గ్రామాలకు తాగు నీరు అందించే రాచపూడి నీటి పథకంపై ఆ ప్రభావం పడింది.

Published : 18 Jun 2024 04:37 IST

 ఫిల్టర్‌బెడ్‌ల నిర్వహణపై అధికారుల నిర్లక్ష్యం

 ఫిల్టర్‌ బెడ్‌లో పాచిపట్టి ఉన్న నీరు

మేదరమెట్ల, న్యూస్‌టుడే: గుండ్లకమ్మ జలాశయంలో నీటి మట్టం పూర్తిగా పడిపోవడంతో కొరిశపాడు, జె.పంగులూరు మండలాల్లోని 21 గ్రామాలకు తాగు నీరు అందించే రాచపూడి నీటి పథకంపై ఆ ప్రభావం పడింది. దీనికి అనుసంధానంగా ఉన్న కుళాయిల నుంచి బురదతో కూడిన కలుషిత నీరు వస్తుండడంతో పది రోజులపాటు పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు డీఈ వేణుగోపాలరావు ఇటీవల ప్రకటించారు. కానీ తిరిగి మేదరమెట్లతో పాటు జె.పంగులూరు మండలంలోని కొన్ని గ్రామాలకు నీటిని విడుదల చేశారు. దీంతో కుళాయిల్లో వస్తున్న రంగు మారిన నీటిని చూసి ప్రజలు అందోళన చెందుతున్నారు. గుండ్లకమ్మ జలాశయం నుంచి వచ్చే నీరు మేదరమెట్లలోని పంప్‌హౌస్‌ వద్ద ఉన్న రెండు ఫిల్టర్‌బెడ్‌లలో శుద్ధి చేయాల్సి ఉంది. వాటిని ఆరు నెలలకు పైగా ఉపయోగించడం లేదు. వీటిలో ఒకటి పాచిపట్టి రంగుమారిన నీటితో ఉండగా ప్రస్తుతం దానినే ఉపయోగిస్తున్నారు. మరొకటి ఇసుక లేకపోవడంతో నిరుపయోగంగా ఉంది. ఈరెండింటికి సంబంధించి మరమ్మతులకు సుమారు రూ.12లక్షలు అవసరం అవుతాయని అర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు అంచనా వేశారు. ఈ నిధులను జడ్పీ నుంచి కేటాయించాల్సి ఉండగా, అంచనాలు వేసి జడ్పీ అధికారులకు అందించినప్పటికీ కేటాయించలేదని చెప్పారు. స్థానిక ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు గట్టిగా ప్రయత్నించి, సమస్యను ఉన్నతాధికారులకు తెలిపిఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. ఇప్పటికే ఫిల్టర్‌బెడ్‌లను బాగుచేయించి వినియోగంలోకి తీసుకొచ్చి ఉంటే గ్రామాలకు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడేది కాదు. ఈ సమస్యపై డీఈ వేణుగోపాలరావును వివరణ కోరగా... త్వరలోనే ఫిల్టర్‌బెడ్‌లను ఉపయోగంలోకి తీసుకువస్తామన్నారు. రంగు మారిన నీటి సరఫరాను వెంటనే నిలిపివేసేలా చర్యలు చేపడతామని తెలిపారు. మంచినీటిని ప్రజలకు అందించేందుకు కృషి చేస్తామన్నారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని