logo

కౌంటింగ్‌ కేంద్రానికి దూరంగా పిన్నెల్లి

చేసుకున్నోళ్లకు చేసుకున్నంత మహదేవ అన్నట్లు ఉంది మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరిస్థితి.

Published : 04 Jun 2024 03:36 IST

ఈనాడు డిజిటల్, నరసరావుపేట

చేసుకున్నోళ్లకు చేసుకున్నంత మహదేవ అన్నట్లు ఉంది మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరిస్థితి. తన నియోజకవర్గంలో అరాచకం సృష్టించడమే కాకుండా యావత్‌ దేశాన్ని పల్నాడు వైపు చూసేలా చేశారు. పోలింగ్‌ రోజున, మరుసటి రోజున పిన్నెల్లి సోదరులు జరిపిన విధ్వంసం చివరకు ఆయనకే చేటు తెచ్చింది. లెక్కింపు కేంద్రంలోకి వెళ్లలేని పరిస్థితి తెచ్చుకున్నారు. ఇది ఎందరో నాయకులకు హెచ్చరిక. పిన్నెల్లిని చూసి మిగతా వారు జాగ్రత్తపడాల్సిన అవసరం ఉంది. అధికారం అడ్డుపెట్టుకుని విర్రవీగితే చివరకు ఇలాంటి గతే పడుతుంది. 20 ఏళ్లుగా మాచర్ల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ అభివృద్ధి మచ్చుకైనా చేయకుండా అలజడులు, దాడులు, ఘర్షణ వాతావరణంతో మాచర్ల అంటేనే అరాచకరాజ్యం అనేలా మార్చారు. చివరకు చంబల్‌లోయను గుర్తు చేసుకునేలా ప్రవర్తించారు. ప్రజలు వరుసగా నాలుగు పర్యాయాలు గెలిపించినప్పుడు వారి రుణం తీర్చుకోవాల్సింది పోయి ప్రత్యర్థులపై దాడులకే ప్రాధాన్యమిచ్చారు. పోలింగ్‌ రోజున అధికారం ఉంది అని పదులసంఖ్యలో వాహనాల్లో తిరుగుతూ భయభ్రాంతులకు గురిచేస్తూ దాడులకు పాల్పడ్డారు. ఏకంగా ఈవీఎం యంత్రాన్నే ధ్వంసం చేశారు. సీసీ ఫుటేజీలో అడ్డంగా దొరికిపోయారు. చివరకు కౌంటింగ్‌ కేంద్రంలోకి అడుగుపెట్టలేని దుస్థితిని తెచ్చుకున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పతనం అడుగడుగునా కనిపిస్తోంది. ఆయన నరసరావుపేటలో ఉన్నా బయటకు రాలేని పరిస్థితి. తమ్ముడు వెంకట్రామిరెడ్డి రాష్ట్రంలోనే లేడు. సుప్రీంకోర్టు ఆదేశం జిల్లాలో మిగతా అభ్యర్థులకు కూడా ఓ హెచ్చరిక లాంటిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని