logo

భూమి పత్రాలు.. వాహనాలు..

జిల్లాలో గతసారి ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడు.. అన్న దానిపైనే పందేలు జరిగేవి. ప్రస్తుతం తీరు పూర్తిగా భిన్నం. ఐపీఎల్‌లో ఒక ఓవర్‌ ఎన్ని ఫోర్లు, సిక్సులు కొడతారు..

Published : 04 Jun 2024 05:58 IST

ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు

  • ఉమ్మడి జిల్లాలో మూడు సీట్లే వైకాపాకు వస్తాయి.. మిగిలినవన్నీ కూటమికే. ఇలా జరిగితే నాకు పాతిక.. లేకపోతే నీకు లక్ష.. ఇదీ రాజానగరం నియోజకవర్గంలోని ఓ దుకాణం వద్ద ఎన్నికల ఫలితాలపై పందెం.

  • రాష్ట్రస్థాయిలో 130కి పైగా సీట్లు కూటమికే వస్తాయి.. కూటమిదే సీఎం పీఠం. కాదు జగనే సీఎం అవుతారు.. కావాలంటే రూ.లక్ష పందెం కాస్కో.. ఇదీ నగరంలోని ఓ రైతు బజారు వద్ద హడావుడి.

  • మా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థికి కచ్చితంగా 15 వేలకు పైగా మెజార్టీ వస్తుంది. కావాలంటే నా ఎకరం పొలానికి సంబంధించిన కాగితాలు పెట్టుకోండి. 

  • ఇదీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై జిల్లాలో పందేల తీరు. క్రికెట్‌ బెట్టింగులను మించి అయిదేళ్లకోసారి వచ్చే సార్వత్రిక ఫలితాలపై జిల్లాలో పందేల జోరు గట్టిగా కనిపిస్తోంది. కూలి పనులు చేసుకునే వారి దగ్గర నుంచి కోటీశ్వరుడి వరకు తమ అభిమాన నాయకులు, పార్టీపైన పందేలు కడుతున్నారు. రూ.25 వేలకు తక్కువ కాకుండా రూ.లక్షల్లో పందేలపై సొమ్ములు పెడుతున్నట్లు సమాచారం. మధ్యవర్తుల వద్ద డబ్బు కలపలేని వారు భూముల కాగితాలు, వాహనాలను సైతం హామీకి పెట్టి పందేలు కడుతున్న తీరు జిల్లాలో ఎక్కువగా కనిపిస్తోంది.

న్యూస్‌టుడే, కంబాలచెరువు, శ్యామలాసెంటర్‌ (రాజమహేంద్రవరం): జిల్లాలో గతసారి ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడు.. అన్న దానిపైనే పందేలు జరిగేవి. ప్రస్తుతం తీరు పూర్తిగా భిన్నం. ఐపీఎల్‌లో ఒక ఓవర్‌ ఎన్ని ఫోర్లు, సిక్సులు కొడతారు.. పవర్‌ ప్లేలో ఎంత స్కోరు చేస్తుంది.. అనే చిన్న పందేలు ఎక్కువగా కాస్తుంటారు. అదే విధానం ఎన్నికల ఫలితాలపై అమలు చేస్తున్నారు. సీఎం పీఠం, జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, అభ్యర్థికి వచ్చే మెజార్టీలు, ఓట్ల శాతం, రౌండ్ల వారీ కూడా ఓట్లపై పందేలు కడుతున్నట్లు సమాచారం.

కోసు పందేల హవా..

ఎగ్జిట్‌ పోల్స్‌ వచ్చే ముందు వరకు పందేలు సాధారణ రీతిలో జరిగాయి. ఎంత పందెం కాస్తే అంతే సొమ్ము వచ్చేలా ఉండేవి. ఎగ్జిట్‌ పోల్స్‌ తర్వాత పందేలు మరోస్థాయికి చేరాయి. కోసు పందేల హవా మొదలైంది. పోతే రూ.50 వేలు.. వస్తే రూ.లక్ష అన్న చందంగా మారి పందేలు జరుగుతున్నాయి. 

గ్రామీణ నియోజకవర్గాల్లో ఇలా..

జిల్లాలోని రాజానగరం, రాజమహేంద్రవరం గ్రామీణం, నగరం, అనపర్తి తదితర ప్రాంతాల్లో పందేల తీరు మరోస్థాయికి వెళ్లింది. పందేలు కాయడానికి డబ్బు మధ్యవర్తి దగ్గర పెట్టకుంటే పొలాల రిజిస్ట్రేషన్‌ పత్రాలు, ద్విచక్ర వాహనాలు, కార్లను పందేలకు హామీ పెడుతున్నారు. పందెం గెలిస్తే డబ్బు తీసుకుంటారు.. లేకుంటే డబ్బు కట్టి వాటిని విడిపించుకునేలా ముందే ఒప్పందం కుదుర్చుకుంటున్న పరిస్థితులున్నాయి.

రూ.100 కోట్ల పైమాటే..

జిల్లా వ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా పందేలు జరుగుతున్నట్లు అంచనా. కిళ్లీ దుకాణాల దగ్గర నుంచి హోటళ్లు, బార్లు, పొలాలు.. ఇలా అన్నీ పందేలకు వేదికలే. రూ.10 వేల దగ్గర నుంచి రూ.10 లక్షల వరకు చాలా సులభంగా మాటల్లోనే జరిగిపోతున్నాయి. ఆపై రూ.కోటి వరకు కాగితాలపై రాతలు, మధ్యవర్తుల వద్ద హామీలు పెట్టి మరీ అభిమాన నేతలపై ఆస్తులు పెడుతున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని