logo

అందరి చూపూ అటువైపే

ఓటరు నిర్ణయం-2024 ఎలా ఉండబోతుందో తేలే రోజు దగ్గరకొచ్చింది. సార్వత్రిక సమరంలో ఓటరు తీర్పు వెల్లడికి ఒక్కరోజే గడువు ఉండడంతో అటు అభ్యర్థులు, ఇటు ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.   ఓట్ల లెక్కింపు ప్రక్రియ సమర్థంగా నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated : 03 Jun 2024 04:55 IST

ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ
కౌంటింగ్‌ కేంద్రాల్లో చకచకా ఏర్పాట్లు 

ఓటరు నిర్ణయం-2024 ఎలా ఉండబోతుందో తేలే రోజు దగ్గరకొచ్చింది. సార్వత్రిక సమరంలో ఓటరు తీర్పు వెల్లడికి ఒక్కరోజే గడువు ఉండడంతో అటు అభ్యర్థులు, ఇటు ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.   ఓట్ల లెక్కింపు ప్రక్రియ సమర్థంగా నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మూడంచెల భద్రత నడుమ.. ఉమ్మడి జిల్లాలో మూడు లోక్‌సభ, 21 అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు వెల్లడించనున్నారు. రాష్ట్రంలో అధికార పీఠం ఎక్కబోయేది కూటమి అన్నది మెజార్టీ ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు స్పష్టం చేసినా.. అధికారికంగా లెక్క తేల్చాల్సింది ఓటరు మారాజు తీర్పే కావడంతో ఫలితం కోసం అంతా ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.  

తొలి.. చివరి ఫలితాలు ఈ నియోజకవర్గాలవే 

ఈనాడు, కాకినాడ: తొలి ఫలితం కాకినాడ జిల్లాలో జగ్గంపేట, తూ.గో.జిల్లాలో కొవ్వూరు, కోనసీమ జిల్లాలో రాజోలు నియోజకవర్గాల నుంచి వెల్లడి కానుంది. చివరి ఫలితం ఉమ్మడి జిల్లాలో కాకినాడ గ్రామీణం, రాజమహేంద్రవరం గ్రామీణం, కొత్తపేట  నియోజకవర్గాలది కావడంతో సాయంత్రం వరకు ఆయా నేతలకు ఉత్కంఠ తప్పని పరిస్థితి కనిపిస్తోంది.

ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై సూచనలిస్తున్న కలెక్టర్‌ మాధవీలత

సర్వ సన్నద్ధం..

కాకినాడ, తూర్పుగోదావరి, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఎన్నికల అధికారుల పర్యవేక్షణలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌ల  ప్రాంగణాల్లోనే గదుల్లో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే టేబుళ్లు, రౌండ్లు నిర్ణయించిన అధికారులు.. అందుకు అవసరమైన సిబ్బందిని నియమించారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభిస్తారు. తొలుత సైనిక దళాల్లో పనిచేసే సర్వీసు ఓటర్లకు సంబంధించి ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్‌మిటెడ్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ (ఈటీపీబీ) సిస్టమ్‌లో వచ్చిన ఓట్లు, ఆ తర్వాత పోస్టల్‌ బ్యాలెట్‌ (పీబీ) ఓట్లు లెక్కిస్తారు. దీనికి అరగంట సమయం పడుతుందని అంచనా. ఒకవేళ అరగంటలో లెక్కింపు పూర్తవ్వకపోతే వీటిని లెక్కిస్తూనే ఉదయం 8.30 గంటలకు ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. తొలి రెండు రౌండ్లకు అరగంట చొప్పున సమయం పడితే.. మిగిలిన రౌండ్ల ఫలితాలు 20 నిమిషాల్లో వెల్లడయ్యే అవకాశం ఉందన్నది అధికారుల అంచనా. 11 గంటలకల్లా ఫలితాలపై కొంత స్పష్టత రానుండగా.. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటలకల్లా మొత్తం లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. వీవీ ప్యాట్‌ చీటీల లెక్కింపు పూర్తయ్యాకే తుది ఫలితాలు వెల్లడిస్తారు. మొత్తం మీద స్పష్టతకు సాయంత్రం వరకు సమయం తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది. మూడు జిల్లాల కలెక్టర్లు లెక్కింపు ప్రక్రియ పూర్తికి పట్టే సమయాన్ని నిర్దేశించుకున్నారు. అంతకంటే ముందే ప్రక్రియ కొలిక్కిరావచ్చనే అంచనాతో యంత్రాంగాన్ని సన్నద్ధం చేశారు.

నాడి మారింది.. వేడి పెరిగింది..

ఈసారి ఎన్నికల్లో ఓటరు తీర్పు భిన్నం కానుంది. ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలట్‌ ఓట్లు ఎక్కువగా వేశారు. అపరిష్కృత సమస్యలపై వైకాపా ప్రభుత్వంతో పోరాడి విసిగి వేసారిన వీరి తీర్పు ఈసారి విలక్షణంగా ఉంటుందనే చర్చ సాగుతోంది. సైనిక దళాల ఓట్లు కాకినాడ జిల్లాలో 799, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 600, తూర్పుగోదావరి జిల్లాలో 405 పోలయ్యాయి. ఇతర ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలట్‌ ఓట్లు కాకినాడ జిల్లాలో 18,532... అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 17 వేలు.. తూర్పు గోదావరి జిల్లాలో 15,383 చొప్పున పోలయ్యాయి. ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓటరు తీర్పు సైతం విలక్షణంగా.. వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటుందన్నది విశ్లేషకుల అంచనా. ముందెన్నడూ లేని ఓటు చైతన్యం ఈ ఎన్నికల్లో వెల్లివిరిసింది. కోనసీమ జిల్లాలో 83.84 శాతం పోలింగ్‌ అత్యధికంగా నమోదైతే.. తూర్పుగోదావరి జిల్లాలో 80.93 శాతం.. కాకినాడ జిల్లాలో 80.30 శాతం పోలింగ్‌తో ఓటర్లు చైతన్యం చాటారు. యువత, మహిళలు, వృద్ధులు పోలింగ్‌లో ఎక్కువగా పాల్గొన్నారు. వీరి తీర్పుపైనే పార్టీలు, నాయకుల భవిష్యత్తు ఆధారపడి ఉండడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని