logo

ఈ విజయం ఆ‘చంద్రా’ర్కం

నేను విన్నాను.. నేను ఉన్నాను.. ఇంతకీ నేనెవరో తెలుసా..? నా భక్తులను లెక్కచేయని వారిపై కఠినంగా సాగిపోయే కాలాన్ని. అహంకార హరుణ్ని. లోకసంరక్షున్ని.. ధర్మపక్షపాతిని.. మీ కలియుగ దైవాన్ని..

Published : 05 Jun 2024 03:18 IST

నేను విన్నాను.. నేను ఉన్నాను.. ఇంతకీ నేనెవరో తెలుసా..? నా భక్తులను లెక్కచేయని వారిపై కఠినంగా సాగిపోయే కాలాన్ని. అహంకార హరుణ్ని. లోకసంరక్షున్ని.. ధర్మపక్షపాతిని.. మీ కలియుగ దైవాన్ని.. అభయాన్ని.. అరాచకాలను చూస్తూ ఊరుకుంటానా.. అక్రమాలను సహిస్తానా.. మౌనపాత్ర వహిస్తానా..? అందుకే ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పక తప్పలేదు. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లు.. వైకాపా ఓటమికీ ఎన్నో కారణాలు.. దారుణాలు.. ఇదిగో తిరునగరిలోని ఈయణ్ను చూడండి.. నమ్మి ఎన్నుకున్న జనంపై కాస్తయినా ‘కరుణ’ చూపవయ్యా.. అంటే లేనిపోని ‘అభి’మానం ఒలకబోస్తివి. తిరుధామానికి నామాలు పెట్టాలని చూస్తివి. ఇప్పుడు చూడు.. ఫలితం అనుభవిస్తివి. మరో ఆయన అరాచకాలపై భగవం‘తుడా’ నీవే రక్షించు.. అని ప్రజలు వేడుకున్నా ‘చెవి’కెక్కించుకున్న పాపానపోలేదు. ఓటమి తప్పలేదు. శ్రీకాళహస్తి చెంత భక్తులకు ‘మధు’ర క్షణాలు లేకుండా చేశావు.. అధికార ‘మదం’తోటి.. అహకారం తోటి.. ముక్కంటినే లెక్కచేయను పొమ్మంటివి.. తగినశాస్తి కంటివి.. ‘రోజమ్మా’ ఏ రోజమ్మా నీవు ప్రజల గురించి ఆలోచించింది.. మేలు ఆకాంక్షించింది. చాలమ్మా వంచించింది.. ఇప్పుడు చూడు తలదించితివి. ఎక్కడ ‘పెద్ద’రికం తప్పటడుగులు వేస్తుందో.. అక్కడ ‘సత్య’మేవ జయతే అని నిరూపితవుతుంది. ‘ఆదిమూలా’ల్లోకి వెళ్లాల్సి వచ్చింది. గెలుపు తలుపు తెరిచింది. కిలివేటి.. నోరు మెదపవేంటి... ఫలితాలు చూసి మూర్చబోయావా ఏంటి..? గ్రావెల్‌ అల్పాహారాలుగా తింటివి.. నీ ఓటమికి ‘సంజీవ’ సాక్ష్యమిది.. నేదురుమల్లి.. నాకు ఎదురులేదు.. న్యాయానికి ఎదురెళ్లి.. విర్రవీగుతా అంటే.. కర్రుకాల్చి వాత పెట్టారు.. అక్రమాలపై సునీల్‌కుమార్‌.. ‘పాశం’ విసిరారు.. ప్రజల గుండెల్లో ‘గూడు’కట్టుకున్నారు.. ఎవరిని మార్చినా.. నా ‘గీత’ మార్చలేరు కదా.. అందుకే ఇప్పుడు పూ‘తలపట్టు’కునే దుస్థితి వచ్చింది. ‘నారాయణ’ ‘నారాయణ..’ అవేం దూషణలు, దుర్భాషలు తట్టుకోలేక ‘కృపా’ కటాక్షం నీకు కలుగలేదు.  స్మగ్లర్లను అసెంబ్లీకి పంపాలని చూస్తే చిత్తూరులో ‘చిత్తు’గా ఓడించారు. వెంకటేగౌడ.. కూలిందా నీ దౌర్జన్యాల గోడ. కుప్పంలో గెలుపంటే హనుమంతుడి ముందు కుప్పిగంతులేయడమే. అక్కడంతా అభిమాన ‘చంద్ర’మే. అసాధ్యమే. దుర్భేధ్యమే.. ఎందుకంటే అక్కడ ఉంది అధినేత.. ప్రజానేత.. అభివృద్ధి, సంక్షేమాల కలబోత. మొత్తంగా ఎంతో సంతృప్తిగా ఉన్నాను.. సంతోషంగా వెళ్లొస్తాను. చివరగా ఒక్కమాట.. ఎక్కడ అక్రమాలు పెచ్చుమీరుతాయో.. ఎక్కడ అన్యాయం రొమ్మువిరుస్తుందో.. ఎక్కడ సామాన్యుడు కన్నీరుపెడతాడో.. అక్కడ నేను ఉంటాను.. వారి బాధ వింటాను. ఆపదమొక్కులవాడిగా ఆదుకుంటాను. ధర్మో రక్షతి రక్షితః

 న్యూస్‌టుడే బృందం

పుత్తూరులో ఆరేటమ్మ ఆలయం వద్ద టెంకాయలు కొడుతున్న తెదేపా శ్రేణులు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని