logo

‘చంద్ర’కాంతి... వైకాపాకు విశ్రాంతి

ఐదేళ్లూ ఏన్నో అవమానాలు. అందరి కంటా కన్నీళ్లు. ప్రతిపక్షాలు, ఓట్లేసిన ప్రజలపై అధికార పక్షం అరాచకాలు. అభివృద్ధి, సంక్షేమానికి సంకెళ్లేశారు. ప్రశ్నించే నోటికి తాళం వేశారు. దమనకాండ సాగించారు.

Updated : 05 Jun 2024 09:01 IST

ఐదేళ్లూ ఏన్నో అవమానాలు. అందరి కంటా కన్నీళ్లు. ప్రతిపక్షాలు, ఓట్లేసిన ప్రజలపై అధికార పక్షం అరాచకాలు. అభివృద్ధి, సంక్షేమానికి సంకెళ్లేశారు. ప్రశ్నించే నోటికి తాళం వేశారు. దమనకాండ సాగించారు. దౌర్జన్యకాండకు అర్థం వివరించారు. అప్పుడే కూటమి ఉద్భవించింది. ఎన్నికల సంగ్రామంలో నలుదిశలా.. నిర్విరామంగా శ్రమించింది. జనంలో చైతన్యం తెచ్చింది. అండగా.. డండుగా ఉంటామని ధైర్యం నింపింది. ఓటర్లు తర్కంతో..   ఆ‘చంద్రా’ర్కం నిలిచిపోయే విజయాన్ని అందించారు. చీకటి బతుకులపై ‘చంద్ర’కాంతి ప్రసరించింది. పంకా రెక్కలు విరిచారు.. సైకిల్‌ విజయఢంకా మోగించారు.  వైకాపాకు విశ్రాంతినిచ్చారు. 

న్యూస్‌టుడే బృందం


నమ్మకాన్ని వమ్ము చేయను 

నియోజకవర్గ ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయను. చంద్రబాబు నాపై నమ్మకంతో టికెట్‌ ఇచ్చినందుకు కృతజ్ఞతలు. తల్లిదండ్రులతోపాటు కుటుంబ సభ్యులు, అనతికాలంలోనే తెదేపా, జనసేన, భాజపా నేతలు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు, నా వెంట నడిచి విజయానికి కృషి చేశారు. వారికి రుణపడి ఉంటా.

విజయశ్రీ, సూళ్లూరుపేట, తెదేపా అభ్యర్థి 


విజ్ఞతతో గెలిపించారు 

డబ్బులిస్తే ఏదైనా చేయొచ్చన్న వైకాపా అహంకారపూరిత వ్యవహారశైలికి ఓటర్లందరూ విజ్ఞతతో ఓట్లు వేసి వాళ్లను ఇళ్లకు పంపేశారు. రాష్ట్రంలో గజదొంగ, ఇక్కడున్న పిల్లదొంగల నుంచి ప్రజలకు విముక్తి లభించింది. శ్రీకాళహస్తి నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆధిక్యాన్ని ఇచ్చిన ఓటర్లందరికీ పాదాభివందనం చేస్తున్నా.

బొజ్జల సుధీర్‌రెడ్డి, శ్రీకాళహస్తి, తెదేపా అభ్యర్థి


ప్రజలకు పాదాభివందనాలు

నన్ను మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు పాదాభివందనాలు. వారికి రుణపడి ఉంటా. అనూహ్యంగా కూటమికి ఇన్ని సీట్లు రావడం సంతోషంగా ఉంది. ప్రజలకు మెరుగైన సేవ చేసి మంచి పేరు తెచ్చుకుంటా. కూటమి హామీలను అమలు చేసి ప్రజలకు చేరువ చేస్తాం. నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెట్టిస్తాం.

కురుగొండ్ల రామకృష్ణ, వెంకటగిరి, తెదేపా అభ్యర్థి


పెత్తందారులపై  ప్రజాస్వామ్య విజయం

ఇసుక, గ్రావెల్‌లతో పాటు శాంతిభద్రతలను అపహాస్యం చేసిన వైకాపా నేతలకు ప్రజలు సరైన సమయంలో సరైన రీతిలో గుణపాఠం చెప్పారు.  సత్యవేడులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సాగించిన మాఫియా దారుణమైంది. నియోజకవర్గంలో రహదారులు, అరణియార్, ఉబ్బలమడుగు, కాళంగి ప్రాజెక్టుల ఆధునికీకరణతోపాటు పర్యాటకంగా అభివృద్ధి చేస్తా.

కోనేటి ఆదిమూలం, సత్యవేడు తెదేపా అభ్యర్థి 


ఇది ప్రజా విజయం

తిరుపతిలో నన్ను గెలిపించిన ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటా. శ్రీవారి పాదాల చెంత ప్రజలకు సేవచేసే అవకాశం కల్పించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు. ప్రజలు న్యాయాన్ని ధర్మాన్ని గెలిపించారు. అరాచక వైకాపాను భరించే పరిస్థితుల్లో ప్రజలు లేరు. 

ఆరణి శ్రీనివాసులు, తిరుపతి తెదేపా అభ్యర్థి 


ప్రజలకు అంకితం 

నా గెలుపు చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు అంకితం. 30 ఏళ్ల తరువాత చరిత్ర తిరగరాశాం. 43వేల ఓట్లకు పైగా మెజార్టీ అందించిన ప్రజలకు కృతజ్ఞతలు. కూటమి సహకారం, కార్యకర్తల కృషి ఫలితం. ఈ విజయం చంద్రబాబుకు కానుకగా అందిస్తున్నాం. నా వెన్నంటి ఉన్న ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు.   నియోజకవర్గ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషిచేస్తా.  

పులివర్తి నాని, చంద్రగిరి తెదేపా అభ్యర్థి


మరువలేని సహకారం 

-  పాశిం సునీల్, గూడూరు తెదేపా అభ్యర్థి

గూడూరు నియోజకవర్గంలో నన్ను ఆదరించి అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు ప్రజలకు రుణపడి ఉంటా. కష్టపడి పని చేసిన తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. వైకాపా నాయకులు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ప్రజలు తెదేపా ఆదరించారు. నా గెలుపునకు సహకరించిన చంద్రబాబు, పవన్‌కల్యాణ్, లోకేశ్‌బాబు, భువనేశ్వరమ్మ, గంగాప్రసాద్‌ల సహకారం జీవితాంతం  మరవలేను.

తిరుపతిలోని తెదేపా పార్లమెంట్‌ కార్యాలయంలో కేక్‌ కోస్తున్న నరసింహయాదవ్, పనబాకలక్ష్మి తదితరులు


తిరుపతి పరపతి తెదేపాకే

జిల్లాలో ఏకపక్షంగా ప్రజాభిప్రాయం
దయనీయంగా వైకాపా పరిస్థితి

 

తిరుమల అఖిలాండం వద్ద మొక్కులు తీర్చుకుంటున్న తెదేపా శ్రేణులు 

ఎన్నికల్లో జిల్లాలోని అసెంబ్లీ స్థానాల్లో వైకాపా పరిస్థితి మరింత దిగజారింది. గత ఎన్నికల్లో అన్నిచోట్లా విజయం సాధించిన వైకాపా ఈ ఎన్నికల్లో తుడుచుపెట్టుకుపోయింది. ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఎక్కడా బోణీ కాలేదు. దాదాపు అన్నిచోట్లా వైకాపా ఎమ్మెల్యేలే ఉన్నా జనం వారిపై నమ్మకాన్ని ఉంచలేదు. గెలిచింది మొదలు వ్యవస్థలను సర్వనాశనం చేయడం.. వనరుల దోపిడీ వెరసి అనేక అక్రమాలు వారిపై తీవ్ర వ్యతిరేకతను తీసుకొచ్చాయి.

 ఈనాడు-తిరుపతి, న్యూస్‌టుడే, గూడూరు 

ఆధ్మాత్మిక నగరిలో 

సమష్టి కృషి.. తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పార్టీ కార్యక్రమాల్లో చొరవ, ప్రతిపక్ష నేతల అక్రమాలు వెలుగులోకి తీసుకురావడంతో పార్టీ పటిష్ఠంగా నిలిచింది. తక్కువ సమయంలో అభ్యర్థిని మార్చినా కూటమి నేతలు ఏకమై ఆరణి శ్రీనివాసులను గెలిపించుకున్నారు.
తండ్రీకుమారులకు భంగపాటు.. ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి తనయుడి కోసం అనేక అడ్డదారులకు తెరతీశారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో దొంగ ఓట్ల సంస్కృతికి తెరతీసి అబాసుపాలయ్యారు. ఇదే తీరుగా నరగపాలక సంస్థ, తితిదేనూ సొంతానికి వాడుకోవడంపై జనం తిరగబడ్డారు.
కేసులకు వెరవని పులివర్తి కుటుంబం.. చంద్రగిరిలో అనేక కేసులు పెట్టినా భయపడని పులివర్తి నాని, భార్య సుధారెడ్డిలు తెదేపాను ఇంటింటికీ తీసుకెళ్లారు. ప్రత్యర్థి రూ.వందల కోట్లు వెచ్చించినా ప్రజలు నానిపై ప్రేమ చూపించారు. ఏకంగా అభ్యర్థిని చంపేయాలని అధికారపక్ష నేతలు దిగినా పట్టుసడలించలేదు.

అంతులేని అక్రమాలతో విసిగి.. చెవిరెడ్డి ఏకంగా ఓ సామంత రాజ్యాన్నే ఏర్పాటు చేసుకున్నారు. ఎవరూ తనకు ఎదురు రావొద్దన్న పంతంతో ప్రజలు విసిగిపోయారు. రూ.వేల కోట్లు వెనకేసుకోవడంతో కొడుకుపైనా వ్యతిరేకత వచ్చింది.

తండ్రిబాటలో తనయుడు.. శ్రీకాళహస్తిలో తండ్రి బాటలోనే తనయుడు సుధీర్‌రెడ్డి గ్రామగ్రామానికి పార్టీని తీసుకెళ్లారు. తల్లి, భార్య చొరవతో కార్యకర్తలకు అండగా నిలవడంతో పార్టీ విజయం సాధించినట్లయ్యింది. 

అడ్డాగా చెలరేగిన మధు.. శ్రీకాళహస్తి ఆలయ ప్రతిష్ఠ దిగజార్చింది మొదలు వనరులు, స్థిరాస్తి వ్యాపారుల నుంచి వసూళ్లు వెరసి ప్రజలను పట్టి పీడించారు. సొంత పార్టీ నేతలనూ వదల్లేదు. 

మమేకం కాలేని నేదురుమల్లి.. నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి వారసుడిగా వచ్చిన రామ్‌కుమార్‌రెడ్డి సత్తా చాటలేకపోయారు. ప్రజలను దగ్గరకు చేర్చుకోవడం, ముఖం మీద మాట్లాడేయడం వంటి వాటి వల్ల ఆయన ప్రజల నుంచి వ్యతిరేకత మూటగట్టుకున్నారు.

పాశిం పక్కా ప్రణాళిక.. గూడూరు తెదేపాలో చురుకైన కార్యకర్తగా పేరున్న పాశిం సునీల్‌కుమార్‌ 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత తనదైన ముద్ర వేశారు. శ్రేణుల్లో విశ్వాసం నింపి ప్రతిపక్షపాత్ర పోషించారు. 

పనులు చేయలేని మేరిగ.. మేరిగ మురళీధర్‌ గత ఎన్నికల ముందు నుంచి గూడూరు నియోజకవర్గంలో పోటీ చేయడానికి ఏర్పాట్లు చేశారు. టికెట్‌ రాకున్నా రాష్ట్ర ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా పనిచేసినా పార్టీ అధికారంలోకి వచ్చాక ఒక్క హామీ నెరవేర్చకపోవడంతో ఓటమి చెందారు.

‘విజయ’నారి.. సూళ్లూరుపేటలో డాక్టర్‌ విజయశ్రీ ఎన్నికల ప్రచారంలో ఎక్కడా సడలింపు ఇవ్వలేదు. తండ్రికి తగ్గ తనయగా పార్టీ శ్రేణులతో కలిసి ముందుకెళ్లారు. నెలన్నరలో 304 బూత్‌లలో పర్యటించి పార్టీ కేడర్‌లో పట్టు సాధించారు. తండ్రి నెలవల సుబ్రహ్మణ్యం అండదండలతో పార్టీని విజయం వైపు నడిపించారు.

కిలివేటి.. వ్యతిరేకత మూటగట్టుకుని.. గతంలో ఎన్నడూ లేనంత వ్యతిరేకత మూటగట్టుకున్న కిలివేటి సంజీవయ్య ఏడాదిగా టికెట్‌ వేటలో ఉన్నారు. టికెట్‌ దక్కించుకున్నాక ఎక్కువ గ్రామాల్లోకి ప్రచారానికి వెళ్లలేని దుస్థితి. సొంత పార్టీలో పాత, కొత్త నేతల మధ్య వైరం పెట్టిన ఆయన లాభపడాలని చూసి తిరస్కరణకు గురయ్యారు.

ముక్కుసూటి తనం ఆదిమూలం.. రోజుల వ్యవధిలోనే తెదేపా టికెట్‌ దక్కించుకున్న ఆదిమూలం విజయం సాధించారు. గత ఎన్నికల్లో వైకాపా నుంచి గెలిచినా ప్రజాప్రతినిధిగా స్వేచ్ఛ ఇవ్వని వైనంపై పెద్దల అక్రమాలు ఎండగట్టారు. ప్రజల్లో మనిషిగా పేరు తెచ్చుకుని దూసుకెళ్లారు.

పెద్దిరెడ్డి అనుచరుడిగా ముద్ర.. నూకతోటి రాజేష్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడిగా పేరు తెచ్చుకోవడంతో వ్యతిరేకత వ్యక్తమైంది. ఆయన స్థానికేతరుడన్న ప్రచారం సాగింది. వైకాపాలో వర్గపోరు ఓటమికి కారణంగా చెబుతున్నారు.

ప్రజలకు చేరువుగా కురుగొండ్ల.. వెంకటగిరి నియోజకవర్గాన్ని తన వైపు తిప్పుకోవడంలో కురుగొండ్ల రామకృష్ణ చొరవ తీసుకున్నారు. ఇక్కడ రాజా కుటుంబం ఎటువైపు ఉంటే అటు గెలుపు ప్రభావం ఉంటోందన్న భ్రమ తొలగించారు. అటు నెల్లూరు జిల్లాలోని మూడు మండలాల్లో ఆనం రామనారాయణరెడ్డి అనుచరగణం బలంగా పనిచేయడం కలిసొచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని