logo

సైకిల్‌ జోరు..! ఫ్యాన్‌ బేజారు?

జిల్లాలోని 13,62,008 మంది ఓటర్లు సైకిల్‌కు మద్దతుగా నిలిచారా? ఫ్యాను పంచన చేరారా? అన్నది మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది. మొత్తంగా ఏడు నియోజకవర్గాలకుగాను కుప్పం, పలమనేరు, నగరిలో తెదేపా గెలుపును ఎవరూ ఆపలేరని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Updated : 04 Jun 2024 04:21 IST

మూడు నియోజకవర్గాల్లో తెదేపా..  
ఒకచోట మాత్రమే వైకాపా ధీమా
చిత్తూరు పార్లమెంటుపైనా గట్టి నమ్మకం పెట్టుకున్న తెలుగుదేశం  
ఈనాడు, చిత్తూరు

జిల్లాలోని 13,62,008 మంది ఓటర్లు సైకిల్‌కు మద్దతుగా నిలిచారా? ఫ్యాను పంచన చేరారా? అన్నది మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది. మొత్తంగా ఏడు నియోజకవర్గాలకుగాను కుప్పం, పలమనేరు, నగరిలో తెదేపా గెలుపును ఎవరూ ఆపలేరని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒక్క పుంగనూరును మాత్రమే వైకాపా కైవసం చేసుకుంటుందని అంటున్నారు. అక్కడ కూడా సిట్టింగ్‌ ఎమ్మెల్యే, మంత్రి పెద్దిరెడ్డి చివరి రౌండ్‌ వరకు చెమటోడాల్సి ఉంటుందని చెబుతున్నారు. ప్రభుత్వం, అమాత్యుడిపై వ్యతిరేకత తీవ్రంగా ఉన్నందున తెలుగుదేశం సంచలన విజయం సాధించినా ఆశ్చర్యం లేదు. మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్, వైకాపా జెండానే ఎగురుతున్న గంగాధరనెల్లూరులో ఈసారి చరిత్ర తిరగరాస్తామని తెదేపా కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు ఉంటుందని భావిస్తున్నా.. సైకిల్‌ పార్టీనే గెలుపొందుతుందని లెక్కలు వేస్తున్నారు. చిత్తూరు లోక్‌సభ స్థానంలో తెదేపా అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు విజయం లాంఛనమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కుప్పంలో ఆధిక్యంపైనే అందరి దృష్టి 

తెదేపా అధినేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గం నుంచి వరుసగా ఏడుసార్లు గెలుపొందారు. ఎనిమిదోసారీ ఆయన విజయం సాధించడం ఖాయం. 2019 ఎన్నికల కంటే ఎక్కువ ఆధిక్యం వస్తుందనేది కూడా స్పష్టం. తెలుగుదేశం శ్రేణులు లక్ష ఆధిక్యం సాధించి చంద్రబాబుకు బహుమతిగా ఇవ్వాలనుకున్నారు. 40-50 వేలు ఆధిక్యం రావచ్చని అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. 

పలమనేరులో మాజీ మంత్రి గెలుపు నల్లేరుపై నడకే

పలమనేరులో తెదేపా అభ్యర్థి, మాజీ మంత్రి అమరనాథరెడ్డికి గెలుపు నల్లేరుపై నడకే. గత ఎన్నికల్లో వైకాపా నుంచి పోటీ చేసి 31,616 ఓట్ల ఆధిక్యంతో అమరనాథరెడ్డిపై విజయం సాధించిన వెంకటేగౌడకు ఈసారి భంగపాటు తప్పదని ఆ పార్టీ వర్గాలే విశ్లేషిస్తున్నాయి. మైనార్టీల ఓట్లు గంపగుత్తగా ఫ్యాను గుర్తుపై పడ్డాయని సిట్టింగ్‌ ఎమ్మెల్యే భావిస్తున్నారు. ఇది తనకు కలిసొచ్చే అంశమని ఆయన అంటున్నారు.

పుంగనూరుపైనే ఆశలు 

తక్కువ ఆధిక్యంతోనైనా సీనియర్‌ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నుంచి గెలుస్తారని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. జిల్లాలో ఈ ఒక్క సీటుపైనే వైకాపా నేతలు గంపెడాశలు పెట్టుకున్నారు. ప్రతిసారీ పుంగనూరు, పులిచెర్లలో అత్యధికంగా, మిగతా మండలాల్లో తక్కువ మెజార్టీ వస్తోంది. పాడి, మామిడి రైతులు మంత్రిని ఓడించాలనే కసితో ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో రొంపిచెర్ల, పులిచెర్ల, సోమల, చౌడేపల్లె ఓటర్లు తెలుగుదేశం అభ్యర్థి చల్లా బాబుకు పట్టం కట్టవచ్చు. సదుం, పుంగనూరులో మాత్రం పెద్దిరెడ్డికి కాస్త అధికంగా ఓట్లు రావచ్చు. పోలింగ్‌కు ముందు రోజు పకడ్బందీగా డబ్బులు పంపిణీ చేశామని, తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువగా ఇచ్చినందున ఓటర్లు కరుణిస్తారనే విశ్వాసంతో ఉన్నారు.

జీడీ నెల్లూరులో ఫలించిన థామస్‌ వ్యూహం?

గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో 30 ఏళ్లుగా కొన్ని వర్గాలు సాంప్రదాయంగా కాంగ్రెస్, వైకాపా వైపు ఉన్నాయి. 2024 ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి థామస్‌కు వీరు మద్దతు ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. వైకాపా నుంచి పోటీ చేసిన ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి కుమార్తె కృపాలక్ష్మి ప్రచారం నుంచి పోల్‌ మేనేజ్‌మెంట్‌ వరకూ ప్రతి అంశంలోనూ విఫలమయ్యారు. తెదేపా అభ్యర్థి థామస్‌ ప్రణాళికలను పకడ్బందీగా అమలు చేశారు. ఈనేపథ్యంలో తెదేపా గెలుపు ఖాయమని ఆ పార్టీ శ్రేణులు ధీమాగా ఉన్నారు.

పూతలపట్టులోనే ఉత్కంఠ

పూతలపట్టు నియోజకవర్గంలో ఈసారి ఎవరు గెలుస్తారనేది ఆసక్తిగా ఉంది. తెదేపా అభ్యర్థి మురళీమోహన్, వైకాపా అభ్యర్థి సునీల్‌ మధ్య హోరాహోరీగా పోటీ జరిగింది. వైకాపాలోని అసమ్మతి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు కాంగ్రెస్‌ నుంచి పోటీ చేయడం తమకు లాభించే అంశాలని సైకిల్‌ పార్టీ నాయకుల ధీమా. ఇక్కడ రౌండ్‌ రౌండ్‌కు ఆధిక్యాలు మారినా ఆశ్చర్యం లేదు.

రోజాకు ఓటమి తప్పదా? 

నగరి ఎమ్మెల్యే రోజాపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉన్నా వైకాపా అధిష్ఠానం ఆమెకే టికెట్‌ కేటాయించింది. దీంతో వ్యతిరేకవర్గంలోని కొందరు తెదేపా గూటికి చేరారు. మరికొందరు తెదేపా అభ్యర్థి గాలి భానుప్రకాష్‌కు మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికితోడు నియోజకవర్గంలో మంత్రి సోదరులు, భర్త పెత్తనం ఎక్కువైంది. ప్రతి పనికీ డబ్బులు తీసుకున్నారనే అపఖ్యాతి మూటగట్టుకున్నారు. దీంతో ఈసారి ఓటర్లు ఆమెకు షాక్‌ ఇచ్చే అవకాశాలే ఎక్కువ.

చిత్తూరులో రసవత్తరంగా పోరు 

చిత్తూరు నియోజకవర్గంలో ఈసారి తెదేపా నుంచి గురజాల జగన్మోహన్, వైకాపా నుంచి విజయానందరెడ్డి బరిలోకి దిగారు. ఈ ఇద్దరూ కొత్త అభ్యర్థులే. ఎన్నికల్లో పోటాపోటీగా ఖర్చు చేశారు. దీంతో పోరు రసవత్తరంగా సాగింది. చిత్తూరు గ్రామీణ, గుడిపాల మండలాల్లో తెలుగుదేశానికి, చిత్తూరు నగరంలో వైకాపాకు కొంత ఎక్కువ రావచ్చని అంచనా వేస్తున్నారు. పోలింగ్‌ నాడు విజయానందరెడ్డి వర్గీయులు తరచూ గొడవలకు దిగడంతో తటస్థులు తెలుగుదేశానికి ఓటు వేశారని ఆ పార్టీ నేతలు అనుకుంటున్నారు. తక్కువ ఓట్ల తేడాతో గురజాల విజయబావుటా ఎగురవేస్తారని కూటమి నాయకులు నమ్ముతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు