logo

ఉద్యోగుల దెబ్బకు వైకాపా విలవిల

ముందుగా ఊహించినట్లుగానే వైకాపా ప్రభుత్వంపై ఉద్యోగ, ఉపాధ్యాయులు కన్నెర్ర చేశారు. ఐదేళ్ల పాలనలో అష్టకష్టాలు పడ్డారు.

Updated : 05 Jun 2024 10:31 IST

అసెంబ్లీ అభ్యర్థులకు ఉద్యోగ, ఉపాధ్యాయ పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా పడిన ఓట్ల సంఖ్య

మే మొదటి వారంలో ఓటు వేసేందుకు బారులు తీరిన ఉద్యోగ, ఉపాధ్యాయులు

అనంతపురం(శ్రీనివాస్‌నగర్‌), న్యూస్‌టుడే: ముందుగా ఊహించినట్లుగానే వైకాపా ప్రభుత్వంపై ఉద్యోగ, ఉపాధ్యాయులు కన్నెర్ర చేశారు. ఐదేళ్ల పాలనలో అష్టకష్టాలు పడ్డారు. సరికదా... వెంటపడి వేధించిన దానికి ప్రతిఫలంగా ఓటు తీర్పుతో కోలుకోలేని దెబ్బ కొట్టారు. జిల్లాంతటా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెదేపా అభ్యర్థుల వైపే అత్యధిక శాతం మొగ్గు చూపి.. తిరుగులేని ఆధిక్యం చూపారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సత్తా ఏమిటో ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో మరొక్కసారి నిరూపించారు. తమతో పెట్టుకుంటే కూర్చీలనే కదిలిస్తామంటూ ఓటుతో నిగ్గు తేల్చారు. మంగళవారం జరిగిన ఓట్ల లెక్కింపులో అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ అభ్యర్థులకే అధిక ఎక్కువ శాతం మంది ఓటు వేయడం విశేషం. ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో తెదేపా అభ్యర్థులకు 15,058 మంది ఓటు వేయగా... సమీప ప్రత్యర్థి పార్టీ వైకాపా అభ్యర్థులకు మొత్తంగా 7,598 ఓట్లు పడటం ప్రస్తావనార్హం. అనంత నగరంలో తెదేపా అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్‌కు 4,272 మంది ఓటు వేస్తే.. వైకాపా అభ్యర్థి అనంత వెంకటరామిరెడ్డికి 2,038 మంది ఓటేశారు. రాప్తాడులోనూ అంతే. తెదేపా పరిటాల సునీతకు 2,406, వైకాపా ప్రకాశ్‌రెడ్డికి 1,273 ప్రకారం ఓట్లు పడ్డాయి. ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ తెదేపా అభ్యర్థులకే ఎక్కువ ఓట్లు వేసి అధికార వైకాపాకు తగిన గుణపాఠం చెప్పారు.

అణచివేతకు గుణపాఠం

గడిచిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయులకు అనేక ఆర్థిక ప్రయోజనాలు, హక్కులు కల్పిస్తాం.. సమస్యలు తీరుస్తామంటూ వైకాపా అధినేత జగన్‌ ఆర్భాట హామీలతో నిండా మోసం చేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అదేపనిగా వారిని అణచివేతకు గురి చేశారు. కనీసం నిరసన తెలియజేయడానికి వీలులేకుండా తొక్కిపెట్టారు. సస్పెన్షన్లు, తాఖీదులు, జైళ్లకు పంపడం.. వంటి వాటితో బెదిరించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులపై సైతం కేసులు నమోదు చేసి భయపెట్టారు. ఐదేళ్ల కాలంలో ఒకటో తేదీ జీతం వేసిన దాఖలాలు లేవు. ఇక టీఏ, డీఏ, పీఆర్‌సీ, వంటి బకాయిలు ఇవ్వలేదు. డీఏలన్నీ పెండింగే. ఫిట్మెంటు విషయంలోనూ రివర్స్‌ గేర్‌ వేశారు. ఇలా అన్నింటిలోనూ ఉద్యోగ, ఉపాధ్యాయులను మోసం చేశారు. దీంతో వైకాపాపై కసి పెంచుకున్నారు. అవకాశం కోసం నిరీక్షించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసే సమయంలో తమ సత్తా ఏంటో చూపించారు. ఫలితంగా వైకాపాను చిత్తుగా ఓడించడంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు కీలకపాత్ర పోషించారనడంలో సందేహమే లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని