logo

AP Assembly Elections 2024: అందరి చూపు.. ఆరింటి వైపు: ఉమ్మడి కృష్ణా జిల్లా ఫలితాలపై ఉత్కంఠ

ఉమ్మడి జిల్లాలో ఆ నియోజకవర్గాల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Updated : 04 Jun 2024 07:13 IST

ఇక్కడ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి
గెలుపు ధీమాలో కూటమి శ్రేణులు

ఈనాడు, అమరావతి: ఉమ్మడి జిల్లాలో ఆ నియోజకవర్గాల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఎగ్జిట్‌ పోల్స్‌ ఎలా ఉన్నా.. గెలుపు అవకాశాలపై అంచనాలు ఉన్నా.. ఆధిక్యాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. రెండు జిల్లాల పరిధిలో ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లపై అన్ని వర్గాలు ఆసక్తిగా చూస్తున్నారు. విజయవాడ లోక్‌సభ ఫలితంపై మరింత ఉత్సుకతతో ఉన్నారు. ఎన్నికల ముందు.. అంతకు ముందు జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ నియోజకవర్గాలలో ఓటర్ల తీరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గెలుపుపై కూటమి అభ్యర్థుల్లో ధీమా వ్యక్తం అవుతుండగా.. తమదే గెలుపు అని వైకాపా వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. పందేలకు సై అంటున్నా.. నోనో అని వెనుకంజ వేస్తున్నారు. 

కేశినేని పోరు...

విజయవాడ లోక్‌సభ ఫలితంపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది. సొంత సోదరులు అయిన కేశినేని బ్రదర్స్‌ మధ్య పోటీయే దీనికి కారణం. గత రెండు ఎన్నికల్లో తెదేపా తరపున పోటీ చేసి గెలుపొందిన కేశినేని శ్రీనివాస్‌ ఎన్నికల ముందు పార్టీ మారి వైకాపా గూటిలో సీఎం జగన్‌ పంచన చేశారు. ఆయన సోదరుడు కేశినేని శివనాథ్‌ (చిన్ని) తెదేపా తరపున పోటీ చేశారు. దీంతో గెలుపుపై ఆసక్తి నెలకొంది. రెండు శిబిరాల్లో ఆశలు నెలకొన్నా.. తెదేపాలో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. ప్రస్తుతం 80.39 శాతం పోలింగ్‌ జరిగింది. మరో 17 వేల మంది పోస్టల్‌ బ్యాలట్‌లు వినియోగించుకున్నారు. ఆధిక్యతపైనే తెదేపా అంచనా వేస్తోంది. 


గుడివాడలో మరో చరిత్ర..!

రుసగా నాలుగుసార్లు విజయం సాధించి అయిదోసారి ఆశపడుతున్న కొడాలి శ్రీవేంకటేశ్వరరావు(నాని)కి ఈసారి భవిష్యత్తు ఎలా ఉంటుందనేది ఆసక్తి. ఇక్కడ ప్రధాన పోటీ వైకాపా, తెదేపా మధ్యనే. గుడివాడలో ఈసారి రికార్డులు నమోదు అవుతాయని అంచనా. కొడాలి నాని తొలి రెండు పర్యాయాలు తెదేపా తరపున గెలిచి తర్వాత... 2014, 2019లో వైకాపా తరపున విజయం సాధించారు. ఈసారి నోరు విప్పితే.. చంద్రబాబుపై అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. ఆయన వైఖరి ప్రజలకు నచ్చలేదనే వాదన ఉంది. తెదేపా తరపున ఎన్నారై వెనిగండ్ల రాము పోటీపడ్డారు. అన్నివర్గాల నుంచి ఆదరణ పొందారనే వాదన ఉంది. తెదేపాలో ఐక్యత చాటారు. గుడివాడ చరిత్ర ఈసారి మారబోతోందని తెదేపా ధీమా వ్యక్తం చేస్తోంది. ఈసారి 82.51 శాతం పోలింగ్‌ జరిగింది. 


గన్నవరంలో తగిన శాస్తే..?!

త ఎన్నికల్లో పోటీపడిన అభ్యర్థులే ఈసారి తిరిగి గన్నవరంలో పోటీపడ్డారు. కాకపోతే.. పార్టీలు మారారు. గత ఎన్నికల్లో తెదేపా తరపున సుమారు 840 ఓట్లతో గెలుపొందిన వల్లభనేని వంశీమోహన్‌ తర్వాత జగన్‌కు జైకొట్టారు. గతంలో వైకాపాలో ఉన్న యార్లగడ్డ వెంకట్రావు సైకిల్‌ ఎక్కారు. వంశీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను మహిళా లోకం నిరసించింది. రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. దీంతో గన్నవరం ఎన్నికలు తెదేపా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇక్కడ పోలింగ్‌ 84.88 శాతం నమోదైంది. మహిళలు ఇతర వర్గాల తీర్పు ఎలా ఉండబోతోందనేని ఆసక్తికరం. 


మార్పు అంతే మరి..!

జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు తమ స్థానాలను మారారు. ఒకరు మంత్రి జోగి రమేష్‌ కాగా.. మరొకరు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌. వారికి అదృష్టం కలిసి వస్తుందా అనే సందేహం నెలకొంది. పెడన నుంచి పెనమలూరుకు మారిన జోగి రమేష్‌ ప్రచారంలోనే ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సగం వైకాపా ఇక్కడ ఖాళీ అయింది. స్థానికంగా సహకారం కొరవడింది. ఆయనకు పోటీగా తెదేపా నుంచి బోడే ప్రసాద్‌ నిలబడ్డారు. ఇక్కడ సైకిల్‌ పరుగులే కనిపిస్తున్నాయని తెదేపా ధీమా వ్యక్తం చేస్తోంది. గతంలోనూ పెడన నుంచి మైలవరం మారినప్పుడు జోగికి ఓటమి ఎదురైంది. జిల్లాకు చెందిన మంత్రులు రెండోసారి గెలుపొందిన చరిత్ర లేదని చెబుతున్నారు. రి విజయవాడ సెంట్రల్‌లో మల్లాది విష్ణును కాదని పశ్చిమ నుంచి వైకాపా ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌ను దిగుమతి చేసింది. గులకరాయి వంటి డ్రామాలు పూర్తిగా రక్తికట్టించలేకపోయాయి. వైకాపా నుంచి ఇతర సామాజిక వర్గాల సహకారం కొరవడింది. ఇక్కడ తెదేపా తరపున బోండా ఉమా పోటీ చేశారు. తెదేపా నేతల్లో ఆధిక్యంపై చర్చ జరుగుతోంది. 


మైలవరంలో పారేనా..?

మైలవరం రాజకీయ సమీకరణాల నేపథ్యంలో తెదేపా ఓటమిని... వైకాపా గట్టిగా కోరుకుంది. వైకాపా ముఖ్య నేతలను రంగంలోకి దించి ఎన్నికల పోల్‌ మేనేజ్‌మెంట్‌ పకడ్బందీగా చేశారు. ఒక బీసీ అభ్యర్థిని నిలిపి సామాజిక వర్గ విభేదాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. వైకాపా నుంచి పార్టీ మారి... తెదేపా తరపున పోటీచేసి మైలవరం ఎమ్మెల్యే వసంతకు గట్టిపోటీ ఎదురైంది. తెదేపాతో అన్ని వర్గాలు కలిసి వచ్చాయని ఆధిక్యం ఎంత అనేది చర్చ అంటున్నారు.

  • ఇక పశ్చిమలోనూ కాషాయం జెండా జిల్లాలో ఎగరబోతోందని భాజపా సంబరాల్లో ఉంది. ఇక్కడ సుజనాచౌదరి పోటీ చేశారు. వైకాపా నుంచి మైనార్టీ అభ్యర్థి ఆసిఫ్‌ పోటీలో ఉన్నారు.  
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని