logo

ప్రభంజన కూటమి.. వైకాపా దారుణ ఓటమి!!

విశాఖ జిల్లా ప్రజలు ఇచ్చిన తీర్పు అసామాన్యం!! వారందించిన విజయంతో కూటమి ప్రభంజనం సృష్టించింది ఇన్నాళ్లు అరాచకాలు సృష్టించిన వైకాపా చిరునామా గల్లంతయింది.

Updated : 05 Jun 2024 07:19 IST

జిల్లాలో అన్ని స్థానాలూ దక్కించుకున్న ఉమ్మడి అభ్యర్థులు
భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలు

విశాఖ జిల్లా ప్రజలు ఇచ్చిన తీర్పు అసామాన్యం!! వారందించిన విజయంతో కూటమి ప్రభంజనం సృష్టించింది ఇన్నాళ్లు అరాచకాలు సృష్టించిన వైకాపా చిరునామా గల్లంతయింది. వైకాపా నాయకుల కంబంధ హస్తాల్లో ఉక్కిరిబిక్కిరైన నగరానికి విముక్తి లభించి ఉపశమనం సాధించింది!
విశాఖను రాజధాని చేస్తామంటూ.. పన్నిన కుట్రను వివేకంతో జనంభగ్నం చేశారు ఇక్కడే ప్రమాణ స్వీకారమన్న జగన్‌ను ఉక్కునగరానికి రాకుండా తరిమికొట్టారు!
విశాఖ పరిసరాల్లో భూములు కాజేసే ప్రయత్నాలకు ముందుచూపుతో అడ్డుకట్టేశారుఉద్యోగాలిచ్చే కంపెనీలను తరిమికొట్టిన వారికి ఓటుతో బుద్ధి చెప్పారు గంజాయితో యువత జీవితాలు చిదిమేసిన అధికార పార్టీ నాయకులను చిత్తుగా ఓడించారు మాట్లాడే స్వేచ్ఛను హరించిన అక్రమార్కులకు..  మరోసారి నోరెత్తే అవకాశం లేకుండా చేశారు రుషికొండను బోడిగుండుగా మార్చిఎన్నో నిబంధనలు ఉల్లంఘించిన వారికి కుయుక్తులకు సరైన తీర్పు మంగళవారం వెల్లడయింది.  రాజసౌధంపై తెదేపా జెండాను అభిమానులు రెపరెపలాడించారు!


ఈనాడు, ఈనాడు డిజిటల్‌ - విశాఖపట్నం, న్యూస్‌టుడే-వన్‌టౌన్‌: సార్వత్రిక ఎన్నికల్లో వైకాపాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విశాఖ జిల్లాలో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభంజనంలో వైకాపా కనుమరుగైంది. విశాఖ లోక్‌సభ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలుంటే.. ఏ ఒక్కదాంట్లోనూ కూటమి అభ్యర్థులతో తలపడలేక చతికిలపడింది. అయిదేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలతో వచ్చే సానుకూల ఓటుతో తప్పక విజయం సాధిస్తామనే ఆ పార్టీ అంచనాలు తలకిందులయ్యాయి. ఏ ఒక్క రౌండ్‌లోనూ వైకాపా అభ్యర్థులు మెజారిటీ సాధించలేదంటే.. ప్రజలు ఎంత కసిగా ఓటేసారో అర్థమవుతోంది.
యువ నాయకుడికే పట్టం: విశాఖ ఎంపీగా  ఎం.శ్రీభరత్‌ భారీ మెజార్టీతో విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ఆయన స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందినా నిరాశ పడకుండా నిత్యం ప్రజల్లో ఉంటూ.. నగర సమస్యల పరిష్కారానికి చొరవ చూపారు. వైకాపా నుంచి పొరుగు జిల్లాకు చెందిన మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి ఝాన్సీ పోటీ చేశారు. ఆమె అభ్యర్థిత్వంపై సొంత పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో ఏనాడూ విశాఖ రాజకీయాల్లో కనిపించని ఝాన్సీ... భరత్‌ స్థానికుడు కాదంటూ ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నించారు. విభజన హామీల్లో భాగంగా మంజూరైన ఐఐఎం విశాఖలో స్థాపించేందుకు తామే కారణమని ప్రచారం చేసి.. బోర్లా పడ్డారు.
భీమిలిలో అవంతికి పోటు: భీమిలి నియోజకవర్గ ప్రజలు తెదేపా అభ్యర్థి గంటా శ్రీనివాసరావుకు పట్టం కట్టారు. గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన చేపట్టిన అభివృద్ధిని ప్రజలు గుర్తుపెట్టుకుని మళ్లీ గెలిపించారు. ఆయన అభ్యర్థిత్వం ఖరారైన వెంటనే పాత క్యాడర్‌ తిరిగొచ్చింది. ఇవన్నీ గంటాకు అనుకూలంగా మారాయి. వైకాపా నుంచి రెండో సారి బరిలో నిలిచిన ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు ఓటమి తప్పలేదు. ఆయనపై ముఖ్య నాయకులు, కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ఆయన నోటి దురుసుతో అధికారులు, సామాన్యులపై విరుచుకుపడ్డారు. అక్రమ మైనింగ్, భూముల ఆక్రమణ, గెడ్డల పూడ్చివేత, అన్ని పార్టీల నేతలపై వేధింపులే ఆయన ఓటమికి కారణమయ్యాయి.
‘దక్షిణం’లో జనసేన: వైకాపాలో అవమానాలు తట్టుకోలేక ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి జనసేనలోకి వచ్చిన వంశీకృష్ణ శ్రీనివాస్‌ విశాఖ దక్షిణ నియోజకవర్గంలో విజయం సాధించారు. ఆయనను అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మూడు పార్టీల నాయకులను సమన్వయం చేసుకుని ముందుకెళ్లారు. ఇక్కడ హోరాహోరా పోటీ ఉంటుందని తొలుత భావించినా.. క్రమంగా పరిస్థితులు మారాయి. వైకాపా నుంచి పోటీ చేసిన వాసుపల్లి గణేశ్‌కుమార్‌ గత ఎన్నికల్లో తెదేపా తరఫున గెలిచారు. తర్వాత స్వప్రయోజనాల కోసం పార్టీ మారారనే విషయం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. సేవ ముసుగులో విలువైన భూములను కొట్టేసేందుకు చేసిన ప్రయత్నాలు ప్రతిబంధకాలుగా మారాయి. మత్స్యకారుల సమస్యలు పట్టించుకోకుండా, స్వప్రయోజనాల కోసమే పాటుపడటంతో ఆయనకు ఓటమి తప్పలేదు.
పశ్చిమంలో గణబాబుకు జై: పశ్చిమ నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి పీజీవీఆర్‌ నాయుడు (గణబాబు) హ్యాట్రిక్‌ సాధించారు. స్థానికంగా చేపట్టిన అభివృద్ధి పనులే ఆయనకు విజయం తెచ్చిపెట్టాయి. కూటమి ప్రభంజనానికి వైకాపా అభ్యర్థి ఆడారి ఆనంద్‌ నిలబడలేకపోయారు. స్వయంగా సేవా కార్యక్రమాలు చేపట్టినా ఓటమి పాలయ్యారు. తెదేపా, వైకాపా అభ్యర్థులిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారైనా ఓటర్లు గణబాబుకే పట్టం కట్టారు.
తూర్పులో ఎంవీవీ బోర్లా: తూర్పు నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు వరసగా నాలుగోసారి విజయం సాధించారు. ఎమ్మెల్యేగా నిత్యం ప్రజల్లో తిరుగుతూ.. నేనున్నానంటూ భరోసా కల్పించారు. ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక ముద్ర వేశారు. వైకాపా తరఫున బరిలో నిలిచిన ఎంవీవీ సత్యనారాయణ 2019లో ఎంపీగా విజయం సాధించారు. నాటి నుంచి స్వప్రయోజనాల కోసమే తప్ప నగర అభివృద్ధిపై ఏమాత్రం దృష్టి పెట్టలేదు. విశాఖ పరిధిలోని వివాదాస్పద భూములను చేజిక్కించుకున్నారు. సీబీసీఎన్సీ స్థలంలో చేపడుతున్న భారీ నిర్మాణానికి రోడ్డు పోటుందంటూ.. ఆ కూడలిని మూసివేయించారు. రూ.కోట్ల విలువైన టీడీఆర్‌ బాండ్లను అక్రమంగా హస్తగతం చేసుకున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నోట్ల వర్షం కురిపించినా ప్రయోజనం లేకపోయింది. ఆయన చేసిన అక్రమాలు, అన్యాయాలకు బదులుగా ఓటర్లు బుద్ధి చెప్పారని ప్రతిపక్ష నాయకులు చెబుతున్నారు.
‘ఉత్తరం’లో సునాయాస విజయం: విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి కేకే రాజు.. భాజపా అభ్యర్థి విష్ణుకుమార్‌రాజుకు గట్టి పోటీ ఇస్తారని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా విష్ణుకుమార్‌ రాజు సునాయాసంగా గెలుపొందారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా ప్రజల్లో ‘ఎమ్మెల్యే కేకే రాజుగా’ ముద్రవేసుకున్న ఆయన మరోసారి ఓటమి పాలయ్యారు. రౌడీషీటర్లను బౌన్సర్లుగా పెట్టుకుని హడావుడి చేస్తారనే పేరుండటంతో స్థానికులు భయాందోళనతో ఉన్నారు. ప్రజాచైతన్య యాత్ర కోసం తెదేపా అధినేత చంద్రబాబునాయుడు విశాఖ రాగా.. విమానాశ్రయం వద్ద రౌడీమూకలను మోహరించి ఆటంకాలు కల్పించారు. చంద్రబాబుపై కోడిగుడ్లు, చెప్పులు విసిరేలా కార్యకర్తలను రెచ్చగొట్టారు. జనసేన తలపెట్టిన జనవాణి కార్యక్రమానికి రౌడీమూకల్ని పంపి అల్లర్లు సృష్టించారు. ఆ ఘటనలతోనే కేకే రాజు పతనం ప్రారంభమైందని నియోజకవర్గ ప్రజలు పేర్కొంటున్నారు.
గాజువాక ‘పల్లా’దే: గాజువాకలో తెదేపా అభ్యర్థి పల్లా శ్రీనివాస్‌కు చెందిన షాపింగ్‌ కాంప్లెక్స్‌ కూల్చివేతతోనే వైకాపా పతనం ప్రారంభమైంది. వైకాపాలోకి రావాలని ఆయనపై గతంలో ఒత్తిడి తెచ్చారు. ఆయన సున్నితంగా తిరస్కరించడంతో కక్షగట్టి.. నిర్మాణాలు కూల్చేశారు. అందరూ అనుకున్నట్లుగానే ఆయన భారీ మెజార్టీతో విజయం సాధించారు. అతికష్టం మీద సీటు దక్కించుకున్న వైకాపా అభ్యర్థి గుడివాడ అమర్‌నాథ్‌కు ఓటమి తప్పలేదు. అభ్యర్థిగా ఆయన పేరు ప్రకటించిన నాటి నుంచే పార్టీ శ్రేణుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. మంత్రిగా పరిశ్రమలను తీసుకురావడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడం, పారిశ్రామికవేత్తల సమస్యలను గాలికొదిలేయడం, ప్రతిపక్షనాయకులపై వ్యక్తిగత విమర్శలు చేయడమే ఆయన ఓటమికి ప్రధాన కారణాలని అందరూ భావిస్తున్నారు.
పెందుర్తిలో పంచకర్ల హవా: కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి పోటీ  చేసిన పంచకర్ల రమేశ్‌బాబు తొలి నుంచి విజయంపై ధీమా వ్యక్తం చేశారు. సామాజిక సమీకరణాలూ ఆయనకు కలిసొచ్చాయి. వైకాపా అభ్యర్థి అదీప్‌రాజ్‌ 2019లో ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత కార్యకర్తలు, క్యాడర్‌ను పట్టించుకోలేదు. గత అయిదేళ్లలో మండలానికో నాయకుడు ఇష్టారాజ్యంగా వసూళ్లు  చేపట్టారు. పంచగ్రామాల భూసమస్యను పరిష్కారం చేస్తామనే హామీతో విజయం సాధించిన ఆయన తర్వాత దాని గురించి పట్టించుకోలేదు. పరవాడ ఫార్మా కాలుష్యం వల్ల ఇబ్బంది పడుతున్న తాడి గ్రామాన్ని తరలించేందుకు చర్యలు చేపట్టలేదు. మరోవైపు ఎన్నికలకు ముందు ప్రచారానికి వెళ్లిన ఆయనపై పలు గ్రామాల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని