logo

చారిత్రక కోట.. బోథ్‌ అడ్డా!

బోథ్‌ అసెంబ్లీ నియోజకవర్గం 1962లో ఏర్పడింది. ఇప్పటి వరకు 13 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. మొదట్లో జనరల్‌గా ఉన్న ఈ స్థానాన్ని 1967 నుంచి గిరిజనులకు(ఎస్టీ) రిజర్వ్‌ చేశారు.

Published : 27 Oct 2023 04:56 IST

న్యూస్‌టుడే, ఇచ్చోడ : బోథ్‌ అసెంబ్లీ నియోజకవర్గం 1962లో ఏర్పడింది. ఇప్పటి వరకు 13 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. మొదట్లో జనరల్‌గా ఉన్న ఈ స్థానాన్ని 1967 నుంచి గిరిజనులకు(ఎస్టీ) రిజర్వ్‌ చేశారు. నియోజకవర్గంలో బోథ్‌, నేరడిగొండ, బజార్‌హత్నూర్‌, ఇచ్చోడ, గుడిహత్నూర్‌, తాంసి, తలమడుగు, సిరికొండ, భీంపూర్‌ మండలాలు ఉన్నాయి. ఇటీవల సొనాలను నూతన మండలంగా ఏర్పాటు చేశారు. 2009 ఎన్నికలకు ముందు నియోజకవర్గాల పునర్విభజన నిర్వహించగా ఆదిలాబాద్‌ నియోజకవర్గంలోని తాంసి, తలమడుగు మండలాలను బోథ్‌లో కలిపారు. అంతకు ముందు బోథ్‌ నియోజకవర్గంలో నార్నూర్‌, ఇంద్రవెల్లి మండలాలు ఉండగా ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలో నార్నూర్‌ను, ఖానాపూర్‌ నియోజకవర్గంలో ఇంద్రవెల్లి మండలాన్ని కలిపారు. నియోజకవర్గంలో గిరిజనులకు రిజర్వ్‌డ్‌ అయినా గిరిజనేతర ఓట్లే ఇక్కడ కీలకం.

బోథ్‌ నియోజకవర్గంలో వ్యవసాయమే ఆధారం. ఇక్కడ జలవనరులు ఉన్నా ప్రాజెక్టుల నిర్మాణం లేక రైతులు వర్షాధారిత పంటలపైనే ఆధారపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న చిన్న తరహా ప్రాజెక్టులు తాంసి మండలం మత్తడివాగు, సిరికొండ మండలం చిక్‌మాన్‌ ప్రాజెక్ట్‌, బోథ్‌ మండలం కరత్వాడ ప్రాజెక్ట్‌లే దిక్కు. నేరడిగొండలో కుప్టి వంతెన నిర్మాణం చేపడతామని ప్రభుత్వం చెప్పినా ఏళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైంది. పత్తి, సోయా, టమాట పంటలు సాగు చేస్తారు.


నాటి ఆనవాళ్లు..

బోథ్‌ నియోజకవర్గంలో చారిత్రక ఆనవాళ్లకు కొదువలేదు. కాకతీయులు, ఇక్ష్వాకులు ఈ ప్రాంతాన్ని పాలించిన ఆనవాళ్లు కనిపిస్తాయి. ఇచ్చోడ మండలం సిరిచెల్మ మల్లికార్జున ఆలయం, నేరడిగొండ మండలం వడూర్‌, ఇచ్చోడ మండలం కామగిరిలో ఇక్ష్వాకుల కాలం నాటి శిలాశాసనాలు, గుడిహత్నూర్‌ మండలం రామాలయం, బజార్‌హత్నూర్‌ మండలం కనకాయి, నేరడిగొండ మండలం కుంటాల జలపాతంలో సోమేశ్వర స్వామి, సిరికొండ, సొనాల, దర్బా గ్రామాలు ప్రాచీన చరిత్రకు నిలయాలు.  


పర్యాటక ప్రదేశాలు

బోథ్‌ నియోజకవర్గం పర్యాటక కేంద్రాలకు నెలవు. రాష్ట్రంలో ఎత్తయిన జలపాతం కుంటాల ఈ నియోజకవర్గంలోనే ఉంది. బోథ్‌ మండలం పొచ్చెర, ఇచ్చోడ మండలం గాయత్రి జలపాతాలు  ఆకట్టుకుంటాయి.


పరిశ్రమల జాడ లేదు

ఇప్పటి వరకు పరిశ్రమల స్థాపన జరగలేదు. పత్తి, సోయాతో పాటు టమాట సాగు ఎక్కువగా ఉంటుంది. గతంలో కాంగ్రెస్‌ హయాంలో టమాట జ్యూస్‌ పరిశ్రమ ఏర్పాటుకు హామీ ఇచ్చిన నేటికీ నెరవేరలేదు. నిరుద్యోగ యువతకు సరైన ఉపాధి అవకాశాలు లేక ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది.


ఆ మూడు పార్టీలే

  • ఇప్పటి వరకు 13 సార్లు ఎన్నికలు జరగగా, కాంగ్రెస్‌, తెదేపా, తెరాస పార్టీ గెలుపొందాయి. 1962లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి మాధవరెడ్డి గెలుపొందారు. 1967, 1972, 1978, 1983లో వరుసగా హస్తం పార్టీ పాగా వేసింది.
  • 1985లో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న గోడం రామారావు తెదేపా నుంచి పోటీ చేసి గెలుపొందారు. 1989లోనూ ఆయనే విజయం సాధించారు. 1994లో ఆయన తనయుడు నగేశ్‌ ఉపాధ్యాయ వృత్తి నుంచి రాజకీయ రంగంలోకి రాగా, తెదేపా నుంచి గెలుపొందారు. 1999లోనూ విజయం సాధించారు.
  •  ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న సోయం బాపురావు 2004లో తెరాస నుంచి పోటీ చేసి విజయం సాధించారు.  
  • 2009లో గోడం నగేశ్‌ తెదేపా నుంచి పోటీ చేసి గెలుపొందారు.
  • ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో తెరాస నుంచి పోటీ చేసిన రాఠోడ్‌ బాపురావు 2014, 2018లో గెలుపొందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని