logo

భిన్నత్వంలో ఏకత్వం.. ఆదిలాబాద్‌ ప్రత్యేకం

గుజరాతీల దాండియా ఆటలు.. మార్వాడీల పండగలు.. ఆదివాసీల గుస్సాడీ నృత్యాలు.. లంబాడీల తీజ్‌ ఉత్సవాలు.. తెలుగింటి బతుకమ్మ సంబరాలు ఆదిలాబాద్‌లో కనిపిస్తాయి.

Published : 27 Oct 2023 04:56 IST

న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ పట్టణం

గుజరాతీల దాండియా ఆటలు.. మార్వాడీల పండగలు.. ఆదివాసీల గుస్సాడీ నృత్యాలు.. లంబాడీల తీజ్‌ ఉత్సవాలు.. తెలుగింటి బతుకమ్మ సంబరాలు ఆదిలాబాద్‌లో కనిపిస్తాయి. బిహార్‌, అసోం, ఒడిశా రాష్ట్రాలవాసులు ఇక్కడి వారితో కలిసిపోయి పని చేసుకుంటారు. మొత్తానికి మినీ భారత్‌గా ఆదిలాబాద్‌ ప్రసిద్ధికెక్కింది. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతోంది.  నియోజకవర్గం ఆదిలాబాద్‌, బేల, జైనథ్‌, మావల మండలాలు, ఆదిలాబాద్‌ పట్టణ ప్రాంతంతో కలిసి ఉంటుంది.

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన అనంతరం నిజాం ప్రభుత్వం నుంచి విముక్తి పొందాక ఆదిలాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం 1952లో ఆవిర్భవించింది. తొలుత జైనథ్‌, బేల, ఆదిలాబాద్‌ గ్రామీణం, తలమడుగు, తాంసి తదితర అయిదు మండలాలు, ఆదిలాబాద్‌ మున్సిపాల్టీతో ఏర్పడిన ఈ నియోజకవర్గం పునర్విభజనలో భాగంగా కొన్ని మండలాలను కుదించారు. తలమడుగు, తాంసి మండలాలను బోథ్‌ నియోజకవర్గంలో కలపడంతో 2009లో మూడు మండలాలు, ఒక పట్టణంతో నియోజకవర్గ స్వరూపం మారింది. తెలంగాణ వచ్చాక ఆదిలాబాద్‌ గ్రామీణ మండలంలోని కొన్ని గ్రామాలతో మావల మండలం కొత్తగా రూపుదిద్దుకుంది. తాజాగా సాత్నాల, భోరజ్‌ల పేరుతో మరో రెండు మండలాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  

భారీగా సున్నపురాయి నిక్షేపాలు

ఇక్కడ సున్నపురాయి నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. కేంద్రం 1982లో ఆదిలాబాద్‌లో సుమారు 2 వేల ఎకరాలను లీజుకు తీసుకొని సిమెంటు పరిశ్రమను స్థాపించింది. ఈ పరిశ్రమ 1998లో మూతపడింది. ఆదిలాబాద్‌ గ్రామీణ మండలం రామాయి సమీపంలో ప్రైవేటు సిమెంటు పరిశ్రమ ఏర్పాటుకు సైతం సున్నపురాయి నిల్వలు ఉన్న భూములను గుర్తించారు. ఆదిలాబాద్‌ మండలం జందాపూర్‌ ప్రాంతంలో మాంగనీసు నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. వివిధ కంపెనీలు రైతుల భూములను లీజుకు తీసుకొని మాంగనీసును ఇతర రాష్ట్రాలకు తరలించగా ప్రస్తుతానికి దేశంలో డిమాండ్‌ తగ్గడంతో ఈ వ్యాపారం తగ్గుముఖం పట్టింది.


ప్రాచీన ఆలయాలు

జైనథ్‌ మండల కేంద్రంలో 1200 ఏళ్ల కిందట జైనులు నిర్మించినట్లు చెబుతున్న శ్రీ లక్ష్మీనారాయస్వామి ఆలయం ఉంది. బేల మండలంలో సదల్‌పూర్‌ గ్రామంలో ప్రసిద్ధి చెందిన ఆదివాసీల ఆరాధ్య దైవం భైరాందేవ్‌, మహాదేవ్‌ ఆలయం 11వ శతాబ్దంలో నిర్మించినట్లు చెబుతారు.  


తెల్ల బంగారంలో నెంబరు 1

దిలాబాద్‌ చుట్టు పక్కల గ్రామాల్లో పండించిన పత్తిపంటకు ఆసియా ఖండంలో మంచి పేరుంది. వివిధ దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. పత్తి తర్వాత అధికంగా సోయాను పండిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మహారాష్ట్ర సరిహద్దున ఉన్న పెన్‌గంగా నీటిని ఒడిసిపట్టేందుకు రూ.1500 కోట్ల వ్యయంతో చనాఖా-కోర్ట ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ఇటీవలే ట్రయల్‌ రన్‌ ప్రారంభించి జైనథ్‌, బేల మండలాల్లోని గ్రామాలకు నిర్మించిన కాలువలోకి నీళ్లు వదిలారు. ఇది పూర్తిగా వినియోగంలోకి రాలేదు.


తొలినాళ్లలో ఎర్రజెండాకు పట్టం

జాకర్లకు వ్యతిరేకంగా పోరాడిన కమ్యూనిస్టులపై నిషేధం ఉండటంతో తొలినాళ్లలో పీడీఎఫ్‌ గుర్తుమీద పోటీ చేశారు. వరుసగా రెండుమార్లు ప్రజలు వారికి పట్టం కట్టారు. నిషేధం ఎత్తివేశాక ఒకసారి సీపీఐని గెలిపించారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు నిర్వహించగా అందులో ఒకసారి మాత్రమే ఉప ఎన్నికలు వచ్చాయి. 2009లో తెదేపా నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన జోగు రామన్న 2012లో తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఉప ఎన్నికల్లో తెరాస తరఫున పోటీచేసి విజయం సాధించారు. స్వతంత్రులకు నాలుగు మార్లు పట్టం కట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని