logo

ఇంటర్‌సిటీ రద్దుతో ప్రయాణికుల ఇబ్బందులు

ఆదిలాబాద్‌-నాందేడ్‌ మధ్య ఇంటర్‌సిటీ రైలును దక్షిణ మధ్య రైల్వే అధికారులు సోమవారం రద్దు చేయటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు.

Published : 04 Jun 2024 03:00 IST

ఆదిలాబాద్‌ రైల్వేస్టేషన్‌లో పడిగాపులు కాస్తున్న ప్రయాణికులు 

ఎదులాపురం, న్యూస్‌టుడే: ఆదిలాబాద్‌-నాందేడ్‌ మధ్య ఇంటర్‌సిటీ రైలును దక్షిణ మధ్య రైల్వే అధికారులు సోమవారం రద్దు చేయటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. ఆదిలాబాద్‌ నుంచి కిన్వట్, నాందేడ్‌ తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు, ఆ ప్రాంతాల నుంచి ఆదిలాబాద్‌కు రావాల్సిన ప్రయాణికులు ఇంటర్‌సిటీ రైలు రద్దు చేయటంతో నానాయాతనకు గురయ్యారు. ఇంటర్‌సిటీ రైలు ఉదయం ఎనిమిది గంటలకు ఆదిలాబాద్‌ నుంచి బయలుదేరి నాందేడ్‌ వెళ్తుంది. అక్కడి నుంచి మళ్లీ సాయంత్రం మూడు గంటలకు బయలుదేరి ఆదిలాబాద్‌కు సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో చేరుకుంటుంది. అనంతరం ఇదే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌గా రాత్రి తొమ్మిది గంటలకు బయలుదేరుతుంది. కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ ఉదయం ఏడు గంటల ప్రాంతంలో ఆదిలాబాద్‌కు చేరుకోవాల్సి ఉండగా ఆలస్యం కావటంతో ఇంటర్‌సిటీ రైలును రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఆదిలాబాద్‌కు ఉదయం ఏడు గంటల ప్రాంతంలో చేరుకోవాల్సిన కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ తిరుపతి వైపు ట్రాక్‌ సమస్యల కారణంగా పదకొండు గంటలకు చేరుకుంది. దీంతో ఇంటర్‌సిటీ రైలులో వెళ్లాల్సిన ప్రయాణికులు మధ్యాహ్నం నందిగ్రాం రైలు వచ్చేంత వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే రైళ్ల రద్దును ఒక రోజు ముందుగా ప్రకటించకుండా అదే రోజు ప్రకటిస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురికావటం పరిపాటిగా మారింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని