Dating Apps: వామ్మో.. ఇదేం మోసం.. ‘డేటింగ్‌ యాప్‌’ మాయలో సివిల్స్ అభ్యర్థి

డేటింగ్‌ యాప్‌ మాయలో చిక్కుకొని దిల్లీలో సివిల్‌ సర్వీసెస్‌కు సిద్ధమవుతున్న ఓ యువకుడు రూ.1.2 లక్షలు కోల్పోయాడు.

Updated : 29 Jun 2024 19:10 IST

దిల్లీ: ‘డేటింగ్‌ యాప్‌’ల (Dating app) జోలికి వెళ్లొద్దని ఎంతలా చెబుతున్నా కొందరు పెడచెవిన పెడుతున్నారు. ఆ మాయలో పడి ఆర్థికంగా నష్టపోతున్నారు. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా చాలా మందికి కనువిప్పు కలగడం లేదు. తాజాగా సివిల్‌ సర్వీస్‌ పరీక్షలకు సిద్ధమవుతున్న ఓ యువకుడు మాయగాళ్ల చేతికి చిక్కి రూ.1.2 లక్షలు కోల్పోయాడు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. తీగ లాగితే డొంక కదిలినట్లు దీని వెనక ఉన్న ముఠా ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. దిల్లీలో (Delhi) జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..

ఓ డేటింగ్‌ యాప్‌లో పరిచయమైన వెర్షా అనే యువతి పుట్టినరోజు వేడుకలు నిర్వహించేందుకు ఓ యువకుడు గత ఆదివారం ఈస్ట్‌ దిల్లీ వికాస్‌ మార్గ్‌లోని బ్లాక్‌ మిర్రర్‌ కేఫ్‌కు వెళ్లాడు. ఇద్దరూ కలిసి కొద్దిసేపు మాట్లాడుకున్నారు. స్నాక్స్‌, రెండు కేకులు, నాలుగు కూల్‌ డ్రింక్స్‌ ఆర్డర్‌ చేశాడు. అప్పటి వరకు బాగానే ఉన్న ఆమె.. అత్యవసరంగా ఇంటికి వెళ్లాలంటూ వెళ్లిపోయింది. ఆర్డర్‌ చేసినవన్నీ తినేసిన యువకుడు అక్కడున్న వారిని పిలిచి బిల్లు తీసుకురమ్మన్నాడు. బిల్లు చూసిన అతడికి షాక్‌ కొట్టినట్లయింది. వాటి ధర కనీసం రూ. వెయ్యి కూడా దాటదు. అలాంటి రూ.1,21,917.70 బిల్లు వచ్చింది. 

సహజంగానే అతడు కేఫ్‌ నిర్వాహకులతో గొడవకు దిగాడు. వారు కూడా నోటికొచ్చినట్లు మాట్లాడి నిర్బంధించారు. బిల్లు కట్టకపోతే వదిలే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. తప్పని పరిస్థితుల్లో బిల్లు చెల్లించి.. ఆ యువకుడు నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కోసం ఇన్‌స్పెక్టర్‌ సంజయ్‌ గుప్తా నేతృత్వంలో ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.

ఆమె పేరుతో అతడు..

ఆన్ష్‌ గ్రోవర్‌, వాన్ష్‌ పాహవా అనే ఇద్దరు ఆ కేఫ్‌ను నడిపిస్తున్నారు. అక్షయ్‌, వాన్ష్‌ ఇద్దరూ వరుసకు అన్నదమ్ములు. ఆన్ష్ వారిద్దరికీ స్నేహితుడు. కేఫ్‌లో చాలామంది ‘ టేబుల్‌ మేనేజర్లు’ ఉంటారు. అందులో ఒకడే ఆర్యన్‌. వీరంతా ఓ ముఠా. ఇందులో అఫ్సాన్‌ పర్వీన్‌ అనే 25 ఏళ్ల యువతి కూడా ఉంది. ఆమెను అడ్డం పెట్టుకొనే వీరంతా దోపిడీకి పాల్పడుతున్నారు. వెర్షా అనే డమ్మీ పేరుతో అకౌంట్‌ సృష్టించి.. దానిని ఆర్యన్‌ మేనేజ్‌ చేస్తున్నాడు. యువకుడితో పరిచయం ఏర్పడిన తర్వాత జూన్‌ 23న తన పుట్టిన రోజని.. ఎలాగైనా సెలెబ్రేట్‌ చేయాలని వెర్షా పేరిట ఆర్యన్‌ వల విసిరాడు. అతడికి నమ్మకం కలిగించేందుకు ఆమె ఫొటోలను కూడా పంపాడు. దీంతో నిజమే అనుకున్న యువకుడు బ్లాక్ మిర్రర్‌ కేఫ్‌కు వచ్చాడు. పథకం ప్రకారం ఆ యువతి కూడా అక్కడికి వచ్చింది. ఆర్డర్‌ చేసిన తర్వాత అక్కడినుంచి వెళ్లిపోయింది. 

ఎవరి వాటా వారిది

దర్యాప్తు చేసేందుకు పోలీసులు బ్లాక్‌ మిర్రర్‌ కేఫ్‌కు వెళ్లగా.. పక్కనే ఉన్న మరో హోటల్‌లో ముంబయికు చెందిన వ్యక్తితో ఆమె ఉన్నట్లు తెలిసింది. అతడు కూడా మరో డేటింగ్ యాప్‌లో పరిచయమైనవాడేనని తెలియడంతో పోలీసులకు షాక్‌ కొట్టినట్లయింది. తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపెట్టేసింది. ప్రేమ పేరుతో యువకులను ఆర్యన్‌తో పాటు మరికొందరు టేబుల్‌ మేనేజర్లు కేఫ్‌, హోటల్‌కు తీసుకొస్తారని, వారితో కొద్దిసేపు చనువుగా మాట్లాడితే.. వారు చెల్లించిన బిల్లులో 15శాతం తనకు ఇస్తారని, 40శాతం టేబుల్‌ మేనేజర్లు, కేఫ్ మేనేజర్లు, మిగతా 45 శాతం కేఫ్‌ యజమానులు పంచుకుంటారని చెప్పింది. వారు ఆర్డర్‌ చేసిన ఫుడ్‌తో సంబంధం లేకుండా నచ్చినంత బిల్లు వేస్తారని, చెల్లించకపోతే నిర్బంధించి, శారీరకంగా హింసించి ఎలాగైనా కట్టించుకుంటారని చెప్పింది. అసలు విషయం బయటపడుతుందనే భయంతో దాదాపు అందరూ బిల్లు కట్టేసి వెళ్లిపోతుంటారని నిజం చెప్పేసింది. దీంతో నిందితులందర్నీ పోలీసులు అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని