Vijayawada: విజయవాడలో అదృశ్యమైన ముగ్గురు విద్యార్థులు.. సికింద్రాబాద్‌లో ప్రత్యక్షం

పిల్లలు చదువుపై శ్రద్ధ పెట్టకుండా తరచూ సెల్‌ఫోన్‌ వాడుతున్నారని మందలించిన తల్లి దండ్రులకు ముగ్గురు విద్యార్థులు షాక్‌ ఇచ్చారు.

Published : 05 Jul 2024 22:27 IST

 

హైదరాబాద్‌: పిల్లలు చదువుపై శ్రద్ధ పెట్టకుండా తరచూ సెల్‌ఫోన్‌ వాడుతున్నారని మందలించిన తల్లిదండ్రులకు ముగ్గురు విద్యార్థులు షాక్‌ ఇచ్చారు. సెల్‌ఫోన్‌ వాడకం విషయంలో తల్లిదండ్రులు నియంత్రించడాన్ని తట్టుకోలేక విజయవాడకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఇంట్లో ఉన్న బంగారం, వెండి అపహరించి రైలెక్కారు. తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంట్లో ఉన్న 9 తులాల బంగారం, 15 తులాల వెండి ఆభరణాలతో ముగ్గురూ విజయవాడలో రైలు ఎక్కి సికింద్రాబాద్‌లో ప్రత్యక్షమయ్యారు. 

జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ రైలులో విజయవాడ నుంచి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. స్టేషన్‌లో ప్లాట్‌ ఫాం 8 వద్ద తనిఖీలు చేస్తున్న రైల్వే పోలీసులకు ఇద్దరు విద్యార్థినులు, ఒక విద్యార్థిని అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. విజయవాడ హౌసింగ్‌బోర్డు కాలనీలో నివాసముంటున్న 9వ తరగతి చదువుతున్న సాహితి, ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థిని హాసిని, 8వ తరగతి విద్యార్థి యశ్వంత్‌లు స్నేహితులని పోలీసులు తెలిపారు. సెల్‌ఫోన్‌ వాడకుండా వారి తల్లిదండ్రులు నియంత్రించడంతో పక్కా ప్రణాళిక ప్రకారం ఇంట్లో దొంగతనం చేసి రైలెక్కి పరారైనట్టు తెలిపారు. తమ పిల్లలు కనిపించట్లేదని తల్లిదండ్రులు భవానీ నగర్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో రైల్వే పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని భవానీనగర్ పోలీసులకు అప్పగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని