TDP leader murder: తెదేపా నాయకురాలి దారుణహత్య

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో తెదేపా నాయకురాలు అట్ల శ్రీదేవి (55) మంగళవారం హత్యకు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన అట్ల భాస్కర్‌రెడ్డి, అతని తమ్ముడు అట్ల గోపాల్‌రెడ్డికి గత కొన్నేళ్లుగా ఆస్తి తగాదాలున్నాయి.

Published : 26 Jun 2024 05:16 IST

ఆళ్లగడ్డ పట్టణంలో ఘటన
ఆస్తి గొడవలే హత్యకు కారణమంటున్న పోలీసులు

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో తెదేపా నాయకురాలు అట్ల శ్రీదేవి (55) మంగళవారం హత్యకు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన అట్ల భాస్కర్‌రెడ్డి, అతని తమ్ముడు అట్ల గోపాల్‌రెడ్డికి గత కొన్నేళ్లుగా ఆస్తి తగాదాలున్నాయి. పలుమార్లు ఒకరిపై ఒకరు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. మంగళవారం సాయంత్రం అట్ల భాస్కర్‌రెడ్డి, ఆయన భార్య శ్రీదేవి శివాలయం సమీపంలో పాతూరులోని వారి ఇంట్లో ఉండగా అట్ల గోపాల్‌రెడ్డి, ఆమె భార్య శిరీష మరికొందరు రాడ్లతో వారి ఇంట్లోకి వెళ్లి దాడి చేశారు. శ్రీదేవి తలపై ఇనుప రాడ్డుతో కొట్టడంతో తీవ్ర గాయాలతో అపస్మారక స్థితికి చేరుకున్నారు. భాస్కర్‌రెడ్డి సైతం తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి శ్రీదేవి మృతిచెందినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, భూమా విఖ్యాత్‌రెడ్డి ఆసుపత్రికి చేరుకుని పరామర్శించారు. ఈ ఘటనపై సీఐ రమేష్‌బాబు మాట్లాడుతూ ఆస్తి గొడవలే హత్యకు కారణమని, ఇందులో రాజకీయ కోణం లేదని చెప్పారు.

పరామర్శిస్తున్న భూమా అఖిలప్రియ, విఖ్యాత్‌రెడ్డి

పలుకుబడి పెరుగుతోందని..: హత్యకు గురైన శ్రీదేవి ఈ మధ్య జరిగిన ఎన్నికల ప్రచారంలో తెదేపాకు మద్దతుగా చురుగ్గా ప్రచారం నిర్వహించారు. పట్టణం అంతటా భూమా అఖిలప్రియ వెంట తిరిగి ప్రచారం చేశారు. రాజకీయంగా శ్రీదేవి చురుగ్గా మారడం, అఖిలప్రియ ఎమ్మెల్యేగా గెలవడంతో శ్రీదేవి పలుకుబడి పెరుగుతుందని, ఇది రానున్న రోజుల్లో తమకు ఇబ్బందికరంగా మారుతుందని భావించి ప్రత్యర్థులు ఈమెను అంతమొందించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. రద్దీగా ఉండే మెయిన్‌ బజారుకు, పోలీసు పికెట్‌కు 100 అడుగుల దూరంలోనే వారి ఇల్లు ఉన్నా నిందితులు హత్యకు పూనుకోవడం గమనార్హం. హత్యలో పాల్గొన్న ఇద్దరు నిందితులూ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. హత్యను ఇద్దరే చేశారా.. మరికొందరు సహకరించారా అన్నకోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని