Crime News: కానిస్టేబుల్‌పై ఇసుక మాఫియా హత్యాయత్నం!

ఇసుక మాఫియా బరితెగించింది. అక్రమ రవాణాను అడ్డుకొని, ఇసుక ట్రాక్టర్‌కు బందోబస్తుగా ఉండి స్టేషన్‌కు తరలిస్తున్న కానిస్టేబుల్‌పై హత్యాయత్నానికి తెగబడింది.

Updated : 26 Jun 2024 06:48 IST

ట్రాక్టర్‌ను చెరువులోకి నడిపి.. దూకేసిన వ్యాపారి
వాహనంపై బందోబస్తుగా ఉన్న కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు
పరారీలో నిందితుడు

నామాపూర్‌ మేళ్లచెరువులో మునిగిన ఇసుక ట్రాక్టర్‌

ముస్తాబాద్, న్యూస్‌టుడే: ఇసుక మాఫియా బరితెగించింది. అక్రమ రవాణాను అడ్డుకొని, ఇసుక ట్రాక్టర్‌కు బందోబస్తుగా ఉండి స్టేషన్‌కు తరలిస్తున్న కానిస్టేబుల్‌పై హత్యాయత్నానికి తెగబడింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలంలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. సిరిసిల్ల గ్రామీణ సీఐ సదన్‌కుమార్‌ మంగళవారం ముస్తాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఈ వివరాలు వెల్లడించారు. మండలంలోని గోపాల్‌పల్లె తండాకు చెందిన భూక్య గురుబాబు ఎనిమిదేళ్లుగా ఇసుక వ్యాపారం చేస్తున్నాడు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో మానేరు వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారన్న సమాచారంతో ఎస్సై శేఖర్‌రెడ్డితోపాటు పోలీసు సిబ్బంది వెళ్లి నామాపూర్‌ శివారులో అయిదు ట్రాక్టర్లను పట్టుకున్నారు. ఒక్కో ట్రాక్టర్‌పై ఒక్కో పోలీసును బందోబస్తుగా పెట్టి ఠాణాకు తరలించే ప్రయత్నం చేశారు. చివరి ట్రాక్టర్‌పై కానిస్టేబుల్‌ సత్యనారాయణ కూర్చుని వస్తున్నారు. ఆ ట్రాక్టర్‌ నడుపుతున్న గురుబాబు.. ఠాణాకు తీసుకెళ్లవద్దంటూ కానిస్టేబుల్‌తో వాగ్వాదం చేసుకుంటూ వస్తున్నాడు. మేళ్లచెరువు కట్టపైకి రాగానే నడుస్తున్న ట్రాక్టర్‌ను చెరువులోకి తిప్పి.. గురుబాబు దూకి పరారయ్యాడు. ట్రాక్టర్‌ చెరువులోకి దూసుకుపోయి నీటిలో తలకిందులైంది. కానిస్టేబుల్‌ చెరువులో పడగా నడుము కింద భాగంలో తీవ్రగాయాలయ్యాయి. ఈ ట్రాక్టర్‌ ఎంతకీ రాకపోవడంతో ఎస్సైతోపాటు సిబ్బంది వెనక్కివచ్చి చూడగా.. చెరువులో కానిస్టేబుల్‌ ఆర్తనాదాలు వినిపించాయి. వెంటనే ఆయనను బయటకు తీసి 108 వాహనంలో సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌కు, అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. ఈ ఘటనలో గురుబాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశామని, అతడిని పట్టుకోవడానికి పోలీసు బృందాలు గాలిస్తున్నాయని సీఐ తెలిపారు. ఇప్పటికే ఓ హత్య కేసులో నిందితుడైన గురుబాబుపై రౌడీషీట్‌తో పాటు 13కుపైగా ఇసుక అక్రమ రవాణా కేసులు ఉన్నాయని వెల్లడించారు. మిగతా నలుగురు డ్రైవర్లను రిమాండ్‌కు తరలించనున్నట్లు వెల్లడించారు.

ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న సీఐ సదన్‌కుమార్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని