Road Accident: ఆయువు తీసిన అతివేగం

అతివేగం, నిద్రమత్తుతో అయిదుగురి ప్రాణాలుపోయాయి. మెదక్‌ జిల్లా చేగుంట మండలం వడియారం శివారులోని 44వ జాతీయ రహదారి బైపాస్‌లో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న పది మందిలో అయిదుగురు మృతిచెందారు.

Published : 29 Jun 2024 04:28 IST

ఘోర రోడ్డు ప్రమాదంలో అయిదుగురి మృతి

వడియారం శివారులో ప్రమాదానికి గురైన లారీ

చేగుంట, న్యూస్‌టుడే: అతివేగం, నిద్రమత్తుతో అయిదుగురి ప్రాణాలుపోయాయి. మెదక్‌ జిల్లా చేగుంట మండలం వడియారం శివారులోని 44వ జాతీయ రహదారి బైపాస్‌లో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న పది మందిలో అయిదుగురు మృతిచెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లా చికన్‌తోల గ్రామానికి చెందిన ఎండీ ఇబ్రహీం(21), చిక్యా రాజు(57), చిక్యా మనీశ్‌కుమార్‌(30) మేకల వ్యాపారం... ఎండీ షబ్బీర్‌ఖాన్‌(48), ఎండీ జిసన్‌(21)తో పాటు రమేశ్, మహేశ్, శుక్లాల్, బూటాసింగ్, లాల్‌మని కూలీ పనులు చేస్తుంటారు. వారంతా లారీలో 450 మేకలను తీసుకొని, విక్రయించేందుకు మధ్యప్రదేశ్‌ నుంచి హైదరాబాద్‌కు బుధవారం బయలుదేరారు. లారీ క్యాబిన్‌లో డ్రైవర్‌తో పాటు అయిదుగురు కూర్చున్నారు. వెనకాల మేకలతో పాటు మరో  అయిదుగురు ఉన్నారు. చేగుంట దాటిన తర్వాత డ్రైవర్‌ లారీని అతివేగంగా నడుపుతూ నిద్రమత్తులో ముందు దాణా లోడ్‌తో వెళుతున్న లారీని ఓవర్‌ టేక్‌ చేసేందుకు ప్రయత్నించాడు.

కానీ అదుపుతప్పి లారీని వెనక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్‌లో ఉన్న ఇబ్రహీం, రాజు, మనీశ్‌కుమార్‌.. వెనక కూర్చున్న షబ్బీర్‌ఖాన్, జిసన్‌ అక్కడికక్కడే మృతిచెందారు. డ్రైవర్‌తో పాటు మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్‌ సీటు వెనకాలే కూర్చున్న లాల్‌మని స్వల్పగాయాలతో బయటపడ్డాడు. విషయం తెలిసిన వెంటనే చేగుంట పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని గాయపడ్డ వారిని తూప్రాన్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు. లారీలోని మేకలతో పాటు కూర్చున్న వారి మృతదేహాలను వెలికితీసేందుకు పోలీసులు, స్థానికులు తీవ్రంగా శ్రమించారు. ఈ ప్రమాదంలో సుమారు వంద మేకలు మృతిచెందాయి. జాతీయ రహదారిపై ప్రమాదం జరగడంతో నిజామాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న వాహనాలకు అంతరాయం ఏర్పడింది. సుమారు 4 గంటల పాటు శ్రమించి ప్రమాదం జరిగిన వాహనాన్ని పక్కకు తరలించారు. ఘటనా స్థలిని తూప్రాన్‌ డీఎస్పీ వెంకట్‌రెడ్డి, రామాయంపేట సీఐ నాగరాజుగౌడ్, చేగుంట ఎస్సై బాల్‌రాజు పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని