Kerala: కేరళలోని కలమస్సేరీ కన్వెన్షన్‌ సెంటర్‌లో పేలుళ్లు.. ఒకరి మృతి

కేరళలోని ఓ కన్వెన్షన్‌ సెంటర్‌లో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ ఘటన సమయంలో అక్కడ వేల మంది ఉన్నారు.

Updated : 29 Oct 2023 15:43 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కేరళలోని కలమస్సేరీలో ఆదివారం ఉదయం పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. మరో 23 మంది గాయపడ్డారు. కలమస్సేరీ నెస్ట్‌ సమీపంలోని ఓ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఉదయం 9.30 సమయంలో పేలుడు సంభవించింది. ఈ ఘటన జరిగినప్పుడు అక్కడ వేల మంది ఉన్నట్లు సమచారం.

ప్రత్యక్ష సాక్షులు మాత్రం కన్వెన్షన్‌ హాల్లో మూడు నుంచి నాలుగు పేలుళ్లు జరిగాయని చెబుతున్నారు. కన్వెన్షన్‌ హాలులో దాదాపు 2,500 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడికి చుట్టుపక్కల మండలాలైన వరపుజ, అంగమలి, ఎడపల్లి నుంచి భారీ సంఖ్యలో జనాలు వచ్చారు. ప్రార్థన సమయంలో వీరంతా కళ్లు మూసుకొని ఉండగా.. హాలు మధ్యలో భారీ పేలుడు జరిగింది. అనంతరం మరో రెండు మూడు చిన్న పేలుళ్లు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ కన్వెన్షన్‌ సెంటర్‌ లోపలి వైపు నుంచి తాళం వేసి ఉండటంతో క్షతగాత్రులను తరలించడంలో కొంత జాప్యం చోటు చేసుకొంది. ఈ పేలుళ్లలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

పేలుళ్లలో గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణాజార్జి ఉన్నతాధికారులను ఆదేశించారు. బాధితులను కలమస్సేరీ మెడికల్‌ కాలేజీ, ఎర్నాకులం జనరల్‌ హాస్పిటల్‌, కొట్టాయం మెడికల్‌ కాలేజీలకు తరలిస్తున్నారు.

ఆధారాలు సేకరిస్తున్నాం: కేరళ ముఖ్యమంత్రి

ఈ వరుస పేలుళ్ల ఘటనపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్పందించారు. ‘‘ఇదో దురదృష్టకర ఘటన. దీనిపై పూర్తి వివరాలు సేకరిస్తున్నాం. ఉన్నతాధికారులు మొత్తం ఎర్నాకులంలో ఉన్నారు. డీజీపీ ఘటనా స్థలానికి వెళుతున్నారు. ఈ ఘటనను మేము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. నేను ఇప్పటికే డీజీపీతో మాట్లాడాను. దర్యాప్తులో మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సి ఉంది’’ అని పేర్కొన్నారు.  

ఇది అనాగరిక చర్య : శశిథరూర్‌

కలమస్సేరీలో వరుస పేలుళ్లను మతాలకు అతీతంగా అందరూ ఖండించాలని కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ పిలుపునిచ్చారు. ‘మతపరమైన ప్రార్థనలో బాంబుదాడుల వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యాను. దీనిని నేను ఖండిస్తున్నాను. సత్వరమే పోలీసులు చర్యలు తీసుకోవాలి. మతపెద్దలు అందరు ఏకమై ఈ అనాగరిక చర్యను ఖండించాలి’’ అని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు