Crime News: మద్యం మత్తులో యువకుడిని కారుతో ఢీకొట్టిన వైకాపా ఎంపీ కుమార్తె!

ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న యువకుడిని కారుతో ఢీకొట్టి అతని మృతికి కారణమైన ఆంధ్రప్రదేశ్‌ వైకాపా ఎంపీ బీద మస్తాన్‌రావు కుమార్తెను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. చెన్నై బెసంట్‌నగర్‌కు చెందిన సూర్య (22) పెయింటర్‌.

Updated : 19 Jun 2024 02:41 IST

అరెస్టు చేసిన చెన్నై పోలీసులు

చెన్నై (ప్యారిస్‌), న్యూస్‌టుడే: ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న యువకుడిని కారుతో ఢీకొట్టి అతని మృతికి కారణమైన ఆంధ్రప్రదేశ్‌ వైకాపా ఎంపీ బీద మస్తాన్‌రావు కుమార్తెను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. చెన్నై బెసంట్‌నగర్‌కు చెందిన సూర్య (22) పెయింటర్‌. సోమవారం మధ్యాహ్నం మద్యం మత్తులో బెసంట్‌నగర్‌ కళాక్షేత్రకాలనీ వరదరాజసాలైలో ఫుట్‌పాత్‌పై నిద్రపోయాడు. ఆ సమయంలో ఓ కారు ఫుట్‌పాత్‌పైకి దూసుకొచ్చి సూర్యపై ఎక్కింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతణ్ని స్థానికులు ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన కారులో ఇద్దరు మహిళలున్నట్లు తెలిసింది. వాహనం నడిపిన మహిళ అక్కడి నుంచి కారుతో పాటు పరారయింది. మరో మహిళ ప్రమాదం గురించి ప్రశ్నించిన ప్రజలతో వాగ్వాదానికి దిగి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ ఇద్దరు మహిళలూ మద్యం మత్తులో ఉన్నట్లు సూర్య బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి సీసీ కెమెరా దృశ్యాలు, కారు రిజిస్ట్రేషన్‌ నెంబరు, పారిపోయిన మహిళల ఫొటోలున్నా వారిని అరెస్టు చేయలేదని వారు సోమవారం రాత్రి బెసంట్‌నగర్‌ పోలీసుస్టేషన్‌ను ముట్టడించారు. ప్రమాద సమయంలో కారు నడిపింది ఆంధ్రప్రదేశ్‌లో వైకాపాకు చెందిన రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్‌రావు కుమార్తె బీద మాధురిగా గుర్తించారు. ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని