ఘోరం.. సెల్‌ఫోన్‌ టార్చ్‌లైట్‌ వెలుగులో ప్రసవం.. తల్లీబిడ్డ మృతి

ముంబయి మహానగరంలో కనీస సదుపాయాలు అందక ఓ నిండు గర్భిణీ ప్రాణాలు విడిచింది. ఆసుపత్రి తీవ్ర నిర్లక్ష్యం ఓ కుటుంబానికి తీరని నష్టాన్ని మిగిల్చింది.

Updated : 03 May 2024 12:01 IST

ముంబయి: ఒక ఆసుపత్రి నిర్లక్ష్యం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. చిమ్మ చీకట్లో సెల్‌ఫోన్‌ టార్చ్‌లైట్‌(cellphone torch) వెలుగులో వైద్యులు చేసిన సిజేరియన్ (Caesarian).. తీవ్ర వేదన మిగిల్చింది. కాసులు గలగలలాడే బృహన్‌ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)(BMC) పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఖస్రుద్దీన్ అన్సారీ అనే వ్యక్తి ఇటీవల నిండు గర్భిణీగా ఉన్న తన భార్యను సుష్మా స్వరాజ్ మెటర్నిటీ హోంలో చేర్పించారు. కరెంట్‌ పోయినా.. ఇతర ఏర్పాట్లు చేయకుండానే టార్చ్‌లైట్‌ వేసి, వైద్యులు ఆపరేషన్ చేశారని, దాంతో తల్లీబిడ్డ మృతి చెందారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. ‘‘ఆసుపత్రికి తీసుకువచ్చేప్పుడు నా కోడలికి ఎలాటి ఆరోగ్య సమస్యలు లేవు. ఏప్రిల్‌ 29న ఉదయం ఏడుగంటలకు డెలివరీ వార్డుకు తరలించారు. రాత్రి 8 గంటల వరకు అక్కడే ఉంచారు. అంతా బాగానే ఉందని, సహజ కాన్పు అవుతుందని వైద్యులు చెప్పారు. అప్పుడు ఆమెను చూడటానికి వెళ్తే.. రక్తపు మడుగులో కనిపించింది. తర్వాత కొద్దిసేపటికి ఆమెకు ఫిట్స్ వచ్చాయని, వెంటనే సి-సెక్షన్ (C-section) చేయాలని మా దగ్గర సంతకాలు చేయించుకున్నారు. ఆ సమయంలోనే కరెంట్‌ పోయింది. ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు సరికదా.. మమ్మల్ని వేరే ఆసుపత్రికి కూడా పంపలేదు. అలాగే ఆపరేషన్ థియేటర్‌కు తరలించి, టార్చ్‌ లైటింగ్‌లో డెలివరీ చేశారు. తొలుత బిడ్డ చనిపోయిందని, తల్లికి ప్రమాదం లేదని చెప్పారు. మెరుగైన వైద్యం కోసం సియోన్ ఆసుపత్రికి వెళ్లమని సూచించారు. అప్పటికే నా కోడలు కూడా ప్రాణాలు కోల్పోయింది’’ అని అన్సారీ తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఆసుపత్రిలో కనీసం ఆక్సిజన్ కూడా అందుబాటులో లేదని చెప్పారు.

గుంటూరులో రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్‌

ప్రత్యేక అవసరాలున్న అన్సారీకి ఏడాది కిందటే వివాహం జరిగింది. ఇంతలోనే తన భార్య, బిడ్డను కోల్పోవడంతో కన్నీరుమున్నీరయ్యారు. తన జీవితాన్ని నాశనం చేసిన ఆసుపత్రి సిబ్బందికి శిక్ష పడాలని, తనకు న్యాయం కావాలని డిమాండ్ చేశారు. అన్సారీ భార్య డెలివరీ తర్వాత మరో గర్భిణీకి కూడా అదే థియేటర్‌లో టార్చ్‌లైట్‌ కిందే సి-సెక్షన్‌ చేసిన దృశ్యాలను వారు బయటపెట్టారు. ఈ ఘటన వివాదాస్పదం కావడంతో బీఎంసీ విచారణకు ఆదేశించింది. అత్యంత ధనిక స్థానిక సంస్థగా పేరుగాంచిన బీఎంసీ బడ్జెట్ రూ.52 వేల కోట్లు. అందులో 12 శాతం అంటే రూ. 6,250 కోట్లు వైద్యారోగ్య విభాగానికి కేటాయించారు. అయినా సరే, కనీస సదుపాయాలు అందక ఓ కుటుంబానికి జరిగిన తీరని నష్టంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని