TG News: మధుకాన్‌ సంస్థలో కోల్‌కతా పోలీసుల సోదాలు

సబ్‌కాంట్రాక్టు ఇచ్చి పనులు చేయించుకుని డబ్బులు చెల్లించకుండా మోసం చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో జూబ్లీహిల్స్‌లోని మధుకాన్‌ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కార్యాలయంలో బుధవారం కోల్‌కతా పోలీసులు సోదాలు నిర్వహించారు.

Published : 04 Jul 2024 03:48 IST

ఈనాడు, హైదరాబాద్‌: సబ్‌కాంట్రాక్టు ఇచ్చి పనులు చేయించుకుని డబ్బులు చెల్లించకుండా మోసం చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో జూబ్లీహిల్స్‌లోని మధుకాన్‌ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కార్యాలయంలో బుధవారం కోల్‌కతా పోలీసులు సోదాలు నిర్వహించారు. పశ్చిమబెంగాల్‌ కిషన్‌గంజ్‌ డివిజన్‌లోని బరాసత్, కృష్ణనగర్‌ సెక్షన్ల పరిధిలో నాలుగు వరుసల జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా పాత విద్యుత్తు లైన్లను తొలగించి కొత్తవి నిర్మించేందుకు మధుకాన్‌ సంస్థ 2012లో కోల్‌కతాకు చెందిన మెట్రోపాలిటన్‌ కోఆపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌ సంస్థకు రూ.19.19 కోట్లు, రూ.13.32 కోట్లతో రెండు వేర్వేరు పనులను సబ్‌కాంట్రాక్టు ఇచ్చింది. ఈ మేరకు ఆ సంస్థ పనులు పూర్తిచేసింది. అయితే ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం మధుకాన్‌ సంస్థ బిల్లులు చెల్లించలేదు. ఆ తర్వాత కొద్ది రోజులకే అవకతవకలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై మధుకాన్‌ సంస్థను భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) సస్పెండ్‌ చేసింది. అప్పగించిన ప్రాజెక్టులనూ వెనక్కు తీసుకుంది. ఇదిలా ఉండగా తాము చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని మెట్రోపాలిటన్‌ కోఆపరేటివ్‌ సొసైటీ సంస్థ పలుమార్లు మధుకాన్‌ ప్రతినిధులను కోరుతూ వస్తోంది. అయినా ప్రయోజనం లేకపోవడంతో 2022 జులై 27న కోల్‌కతాలోని బౌబజార్‌ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో భాగంగా కోల్‌కతా పోలీసులు మధుకాన్‌ కార్యాలయంలో సోదాలు నిర్వహించి పలుపత్రాలు, హార్డ్‌డిస్కులు స్వాధీనం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని