Kurnool: వైకాపా మాజీ ఎమ్మెల్యే వికృత చేష్టలు

కర్నూలు జిల్లా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత డాక్టర్‌ జరదొడ్డి సుధాకర్‌ వికృత చేష్టలు గురువారం వెలుగులోకి వచ్చాయి.

Updated : 05 Jul 2024 06:38 IST

పదిహేడేళ్ల యువతిపై మూడేళ్లుగా అఘాయిత్యం
డాక్టర్‌ సుధాకర్‌పై పోక్సో కేసు నమోదు
అరెస్టు చేసి కోర్టుకు తరలింపు

మాజీ ఎమ్మెల్యే డా.సుధాకర్‌ను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచేందుకు తీసుకెళ్తున్న పోలీసులు

ఈనాడు- కర్నూలు, న్యూస్‌టుడే- కర్నూలు నేర విభాగం, ఓర్వకల్లు: కర్నూలు జిల్లా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత డాక్టర్‌ జరదొడ్డి సుధాకర్‌ వికృత చేష్టలు గురువారం వెలుగులోకి వచ్చాయి. ఆయన ఓ యువతిపై గత మూడేళ్లుగా లైంగిక దాడికి పాల్పడ్డారు. కొద్దిరోజుల కిందటి వరకు ఆయన ఎమ్మెల్యేగా ఉండడంతో బాధితురాలు మౌనంగా భరిస్తూ వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ధైర్యంగా ముందుకొచ్చింది. కర్నూలు రెండో పట్టణ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్‌ చేశారు. 

‘నా తల్లిదండ్రులు సుధాకర్‌ ఇంట్లో పనిచేస్తున్నారు. గత నాలుగేళ్లలో వారు పనికి వెళ్లనప్పుడల్లా నేనే వెళ్లేదాన్ని. ఆ సమయంలో సుధాకర్‌ నన్ను లైంగికంగా వేధించేవారు. ఆయన భార్య ఇంట్లో లేనప్పుడు నన్ను మానసికంగా, శారీరకంగా హింసించేవారు. అశ్లీల చిత్రాలు చూపించేవారు. ఆయన నిజస్వరూపం బయటపెట్టాలన్న ఉద్దేశంతో ఓరోజు నేనే సెల్‌ఫోన్లో ఆ వేధింపులను రహస్యంగా రికార్డు చేశాను. ఎమ్మెల్యే కావడంతో అప్పట్లో ధైర్యం చేసి ఎవరికీ చెప్పలేకపోయాను. గతేడాది నవంబరు నెలాఖరు వరకు దాదాపు మూడేళ్లు ఆయన నన్ను లైంగికంగా వేధించారు’ అని బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో రెండో పట్టణ పోలీసులు నిందితుడిపై బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 376తోపాటు మైనర్‌ కావడంతో పోక్సో చట్టం సెక్షన్‌ 6 రెడ్‌విత్‌ 5(ఎల్‌) కింద కేసు నమోదు చేశారు. ఆయన్ను అదుపులోకి తీసుకుని తొలుత ఓర్వకల్లు పోలీస్‌స్టేషన్‌కు, తర్వాత కర్నూలు డీఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లి విచారించారు. బాధితురాలిని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించి, వైద్య పరీక్షలు చేయించారు. నిందితుణ్ని గురువారం రాత్రి 9 గంటల సమయంలో ప్రొహిబిషన్, ఎక్సైజ్‌ కోర్టులో హాజరుపరిచారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన న్యాయమూర్తి ఎం.సరోజనమ్మ.. ఆయనకు 14 రోజుల రిమాండు విధించారు. దీంతో సుధాకర్‌ను జిల్లా కారాగారానికి తరలించారు. 

నెలన్నర కిందటే వీడియోలు వైరల్‌

డా.సుధాకర్‌ సదరు యువతితో అసభ్యంగా ప్రవర్తించిన దృశ్యాలు సార్వత్రిక ఎన్నికల రోజు సాయంత్రమే వెలుగులోకి వచ్చాయి. అందులో యువతి ఎవరన్నది తెలియకపోవడం, ఫిర్యాదు చేసేందుకు బాధితురాలు ముందుకు రాకపోవడంతో ఆ వ్యవహారం మరుగునపడింది. అప్పట్లో ఎమ్మెల్యేగా తనకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని బాధితురాలిని, ఆమె తల్లిదండ్రులను భయపెట్టి విషయం బయటకు రాకుండా కొందరు పెద్దలతో రాజీ చేయించినట్లు సమాచారం. 

వైకాపా నేతలపై తగ్గని పోలీసుల ప్రేమ 

మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌ అరెస్టు విషయంలో పోలీసు అధికారుల ప్రవర్తన వైకాపాపై వారి విధేయత ఏ మాత్రం తగ్గలేదని చాటింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసిన కర్నూలు రెండో పట్టణ పోలీసులు సుధాకర్‌ను ఇంటికెళ్లి అరెస్టు చేశారు. ఎక్కడా మీడియా కంటపడకుండా రహస్యంగా ఓర్వకల్లు పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. స్టేషన్‌లోకి ఎవర్నీ రానీయలేదు. తర్వాత కర్నూలు డీఎస్పీ కార్యాలయానికి తీసుకొచ్చాక కూడా ప్రహరీ గేటు మూసేసి, లోపలికి ఎవరూ రాకుండా చూశారు. చీకటిపడేవరకు కోర్టుకు తీసుకురాకుండా న్యాయమూర్తి ఇంటికి వెళ్లేవరకు జాప్యం చేశారు. న్యాయమూర్తి రిమాండ్‌ విధించాక కూడా ఎవరి కంటా పడకుండా జిల్లా కారాగారానికి సుధాకర్‌ను తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని