అనిశా వలలో డీసీఎంఎస్‌ మేనేజర్‌

వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించిన కమీషన్‌ డబ్బుల చెల్లింపునకు రూ.లక్ష లంచం తీసుకుంటుండగా కరీంనగర్‌ డీసీఎంఎస్‌(జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ) మేనేజర్‌ రేగులపాటి వెంకటేశ్వరావును అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులు గురువారం పట్టుకున్నారు.

Published : 05 Jul 2024 05:12 IST

రూ.లక్ష లంచం తీసుకుంటుండగా క్యాషియర్‌ సహా పట్టివేత

లంచం తీసుకుంటూ పట్టుబడిన డీసీఎంఎస్‌ క్యాషియర్‌ కుమారస్వామిగౌడ్, మేనేజర్‌ వెంకటేశ్వరరావు

కరీంనగర్‌ పట్టణం, కరీంనగర్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించిన కమీషన్‌ డబ్బుల చెల్లింపునకు రూ.లక్ష లంచం తీసుకుంటుండగా కరీంనగర్‌ డీసీఎంఎస్‌(జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ) మేనేజర్‌ రేగులపాటి వెంకటేశ్వరావును అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులు గురువారం పట్టుకున్నారు. ఆయనకు సహకరించిన క్యాషియర్‌ సుదగోని కుమారస్వామిగౌడ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. అనిశా కరీంనగర్‌ రేంజ్‌ డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని డీసీఎంఎస్‌ తన సొంత కేంద్రాలతోపాటు కమీషన్‌ కేంద్రాల ద్వారా వరిధాన్యం కొనుగోలు చేస్తుంటుంది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన కావేటి రాజు 2018-23 మధ్య కమీషన్‌ కేంద్రాన్ని ఏర్పాటుచేసి వరిధాన్యం కొనుగోలు చేశారు. అందుకు సంబంధించి డీసీఎంఎస్‌ నుంచి కమీషన్‌ రూపేణా రూ.90 లక్షల మేరకు రావాల్సి ఉండగా.. అందులో రూ.20.91 లక్షల విలువైన ఎరువులను సొసైటీ సరఫరా చేసింది. మరో రూ.69.25 లక్షలు చెల్లించాల్సి ఉంది. ఈ డబ్బు కోసం రాజు కొన్నిరోజులుగా డీసీఎంఎస్‌ మేనేజర్‌ చుట్టూ తిరుగుతున్నారు. రూ.15 లక్షలను లంచంగా ఇస్తేనే ఎరువుల రూపంలో కమీషన్‌ ఇస్తానని వెంకటేశ్వరావు తేల్చిచెప్పారు. తాను అంత ఇచ్చుకోలేనని చెప్పినా వినలేదు. విసుగు చెందిన రాజు కరీంనగర్‌ అనిశా అధికారులను ఆశ్రయించారు. వారి సూచనల మేరకు బాధితుడు గురువారం మేనేజర్‌ వెంకటేశ్వరరావుకు కరీంనగర్‌లోని ఆయన ఛాంబర్‌లో మొదటి విడతగా రూ.లక్ష లంచం ఇస్తుండగా దాడి చేశారు. రాజు నుంచి కుమారస్వామిగౌడ్‌ డబ్బులు తీసుకుని వెంకటేశ్వరరావుకు ఇస్తున్న క్రమంలో అనిశా అధికారులు వారిద్దరిని పట్టుకున్నారు. వెంకటేశ్వరరావు, కుమారస్వామిగౌడ్‌లను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని