భారీగా చౌక బియ్యం పట్టివేత

ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు రాజుపేటలోని రైస్‌మిల్లు కేంద్రంగా వైకాపా నాయకుల అండతో గత ఐదేళ్లుగా యథేచ్ఛగా సాగుతున్న రేషన్‌ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడింది.

Published : 04 Jul 2024 04:33 IST

రైస్‌మిల్లులో పౌరసరఫరాల శాఖ అధికారుల సోదాలు

బియ్యం బస్తాలతో ఉన్న లారీ

తిరువూరు, న్యూస్‌టుడే:  ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు రాజుపేటలోని రైస్‌మిల్లు కేంద్రంగా వైకాపా నాయకుల అండతో గత ఐదేళ్లుగా యథేచ్ఛగా సాగుతున్న రేషన్‌ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడింది. అనకాపల్లి జిల్లా ఎస్‌.రాయవరం గ్రామానికి చెందిన బొజ్జా చంద్రశేఖర్‌ (చంద్ర) మునుకుళ్ల, ముష్టికుంట్లకు చెందిన మరో ఇద్దరితో కలిసి రాజుపేటలోని రైస్‌మిల్లు లీజుకు తీసుకుని కాకినాడ పోర్టుకు చౌక బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారు. వైకాపాకు చెందిన ఓ మాజీ ఎంపీ, స్థానిక నాయకుల సహకారంతో తిరువూరు, మైలవరం నియోజకవర్గాల్లోని ఎండీయూ వాహనాల నుంచి బియ్యాన్ని సేకరించి రాజుపేటలోని రైస్‌మిల్లుతో పాటు వీరికి చెందిన గోదాముల్లో నిల్వ చేసి ఎగుమతి చేస్తున్నారు. రైస్‌మిల్లులో చౌకబియ్యం అక్రమంగా నిల్వ చేశారనే సమాచారం మేరకు పౌరసరఫరాలశాఖ ఏఎస్‌వో లక్ష్మీనారాయణ, డీటీ కె.శ్వేత బుధవారం సోదాలు చేశారు. ఎగుమతి చేయడానికి రెండు లారీల్లో సిద్ధం చేసిన రేషన్‌ బియ్యాన్ని బస్తాలతో పాటు, రైస్‌మిల్లులో విడిగా ఉన్న బియ్యాన్ని గుర్తించారు. విడిగా ఉన్న బియ్యాన్ని తూకం వేసేందుకు వచ్చిన హమాలీలను వ్యాపారి చంద్రశేఖర్‌ బెదిరించడంతో మధ్యాహ్నం నుంచి వారు వెళ్లిపోయారు. దీంతో మరో ముఠాకు చెందిన హమాలీలను పిలిపించి బియ్యం తూకం వేసి బస్తాలను లెక్కిస్తున్నారు. రాత్రి 8 గంటల వరకు బస్తాలను లెక్కించగా 32.5 టన్నుల రేషన్‌ బియ్యం తూగింది. పూర్తి వివరాలను గురువారం వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

1,482 టన్నుల బియ్యం స్వాధీనం

కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌టుడే: కాకినాడ, పరిసర ప్రాంతాల్లోని గోదాములపై కొద్ది రోజులుగా జరుగుతున్న దాడుల్లో భారీ ఎత్తున రేషన్‌ బియ్యం బయటపడుతూనే ఉంది. రెవెన్యూ, పౌరసరఫరాలు, తూనికలు, కొలతల శాఖ అధికారుల బృందం బుధవారం తనిఖీలు నిర్వహించింది. పోర్టు సమీపంలోని సాయితేజ షిప్పింగ్‌ సర్వీసెస్‌ గోదాముల నుంచి రూ.3.54 కోట్ల విలువైన 1,482 టన్నుల బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గోదాములపై దాడులు కొనసాగుతాయని జిల్లా పౌరసరఫరాల అధికారి ఎంవీ ప్రసాద్‌ తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని