రూ.2 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టివేత

వైఎస్సార్‌ జిల్లా పోలీసులు భారీస్థాయిలో ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.2 కోట్ల వరకు ఉంటుందని ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ తెలిపారు. కడపలో బుధవారం ఆయన వివరాలు వెల్లడించారు.

Published : 04 Jul 2024 04:31 IST

వైఎస్సార్‌ జిల్లాలో ఘటన

స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలను పరిశీలిస్తున్న ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్, పోలీసు అధికారులు

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే: వైఎస్సార్‌ జిల్లా పోలీసులు భారీస్థాయిలో ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.2 కోట్ల వరకు ఉంటుందని ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ తెలిపారు. కడపలో బుధవారం ఆయన వివరాలు వెల్లడించారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై అందిన ముందస్తు సమాచారంతో జమ్మలమడుగు డీఎస్పీ యశ్వంత్, సీఐ ఈశ్వరయ్య, సిబ్బంది ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామం వద్ద కాపు కాశారు. అక్కడ నిలిపి ఉన్న ఓ మినీ లారీని అనుమానంతో పరిశీలిస్తుండగా, అందులో ఉన్న స్మగ్లర్లు పారిపోయేందుకు యత్నించారు. వారిని పోలీసులు పట్టుకున్నారు. ఆ వాహనంలో 44 ఎర్రచందనం దుంగలున్నాయి. అక్కడికి సమీపంలోని జగనన్న కాలనీ వైపు నుంచి మరికొంతమంది ఓ ద్విచక్ర వాహనంపై, ట్రాక్టరులో వస్తూ పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించారు. వారిని పట్టుకొని, ట్రాక్టరును పరిశీలించగా.. అందులో 40 ఎర్రచందనం దుంగలున్నాయి. స్థానిక కాలనీకి చెందిన దూదేకుల బాషా ఇంట్లో నిల్వ చేసిన 74 దుంగలను గుర్తించారు. మొత్తం 158 దుంగలు, ఒక మినీలారీ, ఒక ట్రాక్టరు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకొని.. నలుగురిని అరెస్టు చేశామని ఎస్పీ తెలిపారు. అరెస్టైన వారిలో ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తికి చెందిన దూదేకుల బాషా, పింజరి మహమ్మద్‌ రఫి, అరవోళ్ల రఫి, చెల్లుబోయిన శివసాయిలు ఉన్నారు. పోరుమామిళ్ల, బద్వేలు పరిధి నల్లమల అటవీ ప్రాంతంలో చెట్లను నరికి, వాటిని చెన్నైకి తరలించే సమయంలో నిందితులను పట్టుకున్నామని పేర్కొన్నారు. వీరి వెనక ఉన్న వారి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయని అధికారులు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని