బాలురపై లైంగిక దాడి కూడా శిక్షార్హమే

బ్రిటిష్‌ కాలంనాటి భారత శిక్షా స్మృతి (ఐపీసీ) స్థానంలో కొత్తగా అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌) లైంగిక నేరాల విషయంలో లింగ భేదాలకు స్వస్తి పలికింది.

Published : 04 Jul 2024 03:47 IST

బాధితులు, నేరస్థుల విషయంలో లింగబేధాలకు చోటు లేదు
భారతీయ న్యాయ సంహితలో నిర్వచిస్తున్న క్లాజులు

దిల్లీ: బ్రిటిష్‌ కాలంనాటి భారత శిక్షా స్మృతి (ఐపీసీ) స్థానంలో కొత్తగా అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌) లైంగిక నేరాల విషయంలో లింగ భేదాలకు స్వస్తి పలికింది. ఐపీసీలో మైనర్లకు సంబంధించి బాలికలపై జరిగే లైంగిక నేరాలను మాత్రమే శిక్షార్హంగా పరిగణించగా, బీఎన్‌ఎస్‌ మాత్రం బాలురపై జరిగే నేరాలనూ శిక్షార్హంగా ప్రకటిస్తోంది. బాధితులతోపాటు నేరస్థుల విషయంలోనూ లింగ భేదాన్ని పక్కన పెట్టింది. ఐపీసీ సెక్షన్‌ ‘336ఏ’లోని ‘మైనర్‌ గర్ల్‌’ అనే పదానికి బదులు ‘చైల్డ్‌’ అనే పదాన్ని బీఎన్‌ఎస్‌ క్లాజ్‌ 96లో చేర్చారు. దీని ప్రకారం 21 ఏళ్లలోపు అమ్మాయిలు, అబ్బాయిలపై జరిగే లైంగిక దాడులను నేరంగా పరిగణిస్తారు. ఐపీసీలోని సెక్షన్‌ 366బి విదేశాల నుంచి బాలికలను లైంగిక దోపిడీ కోసం దిగుమతి చేసుకోవడాన్ని నేరంగా పరిగణిస్తే, దాని స్థానంలో ప్రవేశపెట్టిన బీఎన్‌ఎస్‌లోని 141వ క్లాజు 21 ఏళ్లలోపు బాలికలను, 18 ఏళ్లలోపు బాలురను విదేశాల నుంచి అక్రమంగా దిగుమతి చేసుకోవడాన్ని నేరంగా ప్రకటిస్తోంది. దీంతోపాటు 18, 16, 12 ఏళ్లలోపు మైనర్లపై లైంగిక అత్యాచారాలకు బీఎన్‌ఎస్‌ వేర్వేరు శిక్షలను నిర్దేశిస్తోంది. ఐపీసీ, పోక్సో చట్టాలు విధించే శిక్షలనే బీఎన్‌ఎస్‌లోనూ కొనసాగిస్తున్నప్పటికీ.. 18 ఏళ్లలోపు బాలికలపై సామూహిక అత్యాచారం కేసులకు సంబంధించి కొత్త క్లాజ్‌ను చేర్చారు. ఐపీసీ 12 ఏళ్లలోపు బాలికలపై సామూహిక అత్యాచారాలను మాత్రమే తీవ్ర నేరంగా పరిగణించేది. అయితే 18 ఏళ్లలోపు బాలికలపై సామూహిక అత్యాచారాలనూ తీవ్రంగా పరిగణించి నేరస్థులకు మరణ శిక్ష కానీ, మరణించేవరకూ యావజ్జీవ కారాగార శిక్ష కానీ విధించాలని బీఎన్‌ఎస్‌ నిర్దేశిస్తోంది. శృంగారానికి సంబంధించి భార్య వయసు విషయంలోనూ బీఎన్‌ఎస్‌ కీలక మార్పు తీసుకొచ్చింది. భార్య వయసు 15 ఏళ్లకు పైన ఉంటే భర్త ఆమెతో శృంగారంలో పాల్గొనడం అత్యాచారం కిందకు రాదని ఐపీసీ పేర్కొనేది. బీఎన్‌ఎస్‌ ఈ విషయంలో భార్య వయసును 15 నుంచి 18 ఏళ్లకు పెంచింది. 18 ఏళ్లలోపు బాలికలను, 16 ఏళ్లలోపు బాలురను అపహరించడం నేరమని ఐపీసీ పేర్కొనగా, 18 ఏళ్లలోపు బాలబాలికల అపహరణలు శిక్షార్హమని బీఎన్‌ఎస్‌ నిర్దేశిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని