జిగానా తుపాకులు.. రూ.25 లక్షల సుపారీ

బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ ఇంటిపై కాల్పుల కేసు దర్యాప్తులో కీలక విషయాలు బయటపడ్డాయి. సల్మాన్‌ హత్యకు బిష్ణోయ్‌ గ్యాంగ్‌ పన్నిన భారీ కుట్ర వెలుగులోకి వచ్చింది.

Published : 03 Jul 2024 03:02 IST

కారులోనే సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర

ముంబయి: బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ ఇంటిపై కాల్పుల కేసు దర్యాప్తులో కీలక విషయాలు బయటపడ్డాయి. సల్మాన్‌ హత్యకు బిష్ణోయ్‌ గ్యాంగ్‌ పన్నిన భారీ కుట్ర వెలుగులోకి వచ్చింది. నవీ ముంబయి పోలీసులు ఈ మేరకు దాఖలు చేసిన 350 పేజీల ఛార్జిషీట్‌లో కీలక అంశాలు ప్రస్తావించారు. పంజాబీ సింగర్‌ సిద్ధూ మూసేవాలాను చంపిన తరహాలోనే కారులోనే సల్మాన్‌నూ హత్య చేయాలని నిర్ణయించినట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకోసం మైనర్లను షార్ప్‌ షూటర్లుగా వాడేందుకు బిష్ణోయ్‌ గ్యాంగ్‌ ఏర్పాట్లు చేసింది. ఈ హత్యకు రూ.25 లక్షల సుపారీ కూడా ఇచ్చింది. 2023 ఆగస్టు నుంచి 2024 ఏప్రిల్‌ మధ్య ఈ ప్రణాళికను రూపొందించింది. తుర్కియే నుంచి జిగానా పిస్తోళ్లను తెప్పించేందుకు పథకం సిద్ధం చేసింది. తుర్కియేకు చెందిన ‘టిసాస్‌’ కంపెనీ ఈ సెమీ-ఆటోమేటిక్‌ ఆయుధాన్ని తయారుచేస్తోంది. ఈ ఆయుధం ఖరీదు ఒక్కోటీ రూ.ఆరు లక్షలకు పైనే. భారత్‌లో వీటిపై నిషేధం ఉంది.  

70 మందితో భారీ నెట్‌వర్క్‌..

ఈ మొత్తం కుట్ర అమలు కోసం లారెన్స్‌ బిష్ణోయ్‌-సంపత్‌ నెహ్రా గ్యాంగ్‌లకు చెందిన 60-70 మందితో ఓ భారీ నెట్‌వర్క్‌ ఏర్పాటుచేశారు. వీరు సల్మాన్‌ కదలికలపై నిఘా పెట్టారు. పథకాన్ని అమలు చేసేందుకు 18ఏళ్ల లోపు మైనర్లను సిద్ధం చేసినట్లు ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. హత్య తర్వాత కన్యాకుమారి మీదుగా శ్రీలంకకు పారిపోయేలా ప్రణాళిక కూడా సిద్ధమైంది. ఛార్జిషీట్లో ధనుంజయ్‌ తాప్‌సింగ్, అజయ్‌ కశ్యప్, గౌతమ్‌ వినోద్‌ భాటియా, వాస్పి మహమ్మద్‌ ఖాన్‌ అలియాస్‌ చైనా, రిజ్వాన్‌ హసన్‌ అలియాస్‌ జావెద్‌ ఖాన్, దీపక్‌ హవా సింగ్‌ పేర్లను ప్రస్తావించింది. మొత్తం 25 మంది వరకు ఈ పథకంలో భాగమైనట్లు వెల్లడించారు. వీరందరినీ అజయ్‌ కశ్యప్‌ సమన్వయం చేసినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని