ఇంటి పైకప్పు కూలి.. ఒకే కుటుంబంలో నలుగురి మృతి

మట్టి ఇంటి పైకప్పు కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో నాగర్‌కర్నూల్‌ జిల్లా నాగర్‌కర్నూల్‌ మండలం వనపట్ల గ్రామంలో చోటుచేసుకుంది.

Published : 02 Jul 2024 06:46 IST

ఒకరికి తీవ్ర గాయాలు 

భాస్కర్‌తో భార్య పద్మ, పిల్లలు తేజస్విని, వసంత, రిత్విక్‌

నాగర్‌కర్నూల్, న్యూస్‌టుడే: మట్టి ఇంటి పైకప్పు కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో నాగర్‌కర్నూల్‌ జిల్లా నాగర్‌కర్నూల్‌ మండలం వనపట్ల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గొడుగు భాస్కర్‌ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. రెండు గదుల మట్టి ఇంట్లో భాస్కర్, ఆయన భార్య పద్మ(26), కుమార్తెలు తేజస్విని(7), వసంత(5), కుమారుడు రిత్విక్‌ (10 నెలలు), భాస్కర్‌ తల్లిదండ్రులు బాలస్వామి, చిట్టెమ్మ నివాసం ఉంటున్నారు. ఆదివారం రాత్రి భోజనాలయ్యాక అందరూ నిద్రకు ఉపక్రమించారు. ఇంటి ముందు భాగంలో ఉన్న రేకుల వరండాలో భాస్కర్‌ తల్లిదండ్రులు.. మట్టి కప్పు ఉన్న గదిలో భాస్కర్, పద్మ, ముగ్గురు పిల్లలు పడుకున్నారు. రాత్రి గంటపాటు వర్షం కురవడంతో ఇంటి గోడలు, పైకప్పు తడిశాయి. దూలం చెదలు పట్టి ఉండటంతో.. విరిగిపోయింది. మట్టి పైకప్పు అకస్మాత్తుగా కూలి.. కింద పడుకున్న భాస్కర్‌ దంపతులు, పిల్లలపై పడింది. ఘటనతో మేలుకున్న భాస్కర్‌ తల్లిదండ్రులు కేకలు వేయటంతో చుట్టుపక్కలవారు వచ్చి.. మట్టిని తొలగించి భాస్కర్‌ను కాపాడారు. మట్టి తొలగించేలోపే పద్మ, ముగ్గురు పిల్లలు అసువులు బాశారు. తీవ్ర గాయాలైన భాస్కర్‌ను చికిత్స నిమిత్తం నాగర్‌కర్నూల్‌ జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తామని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ తెలిపారు. 

జాగ్రత్తపడేలోపే ప్రమాదం..

తాము ఉంటున్న మట్టి ఇంటిని కూల్చివేసి.. రెండు రేకుల గదులు వేసుకుంటామని స్నేహితులతో భాస్కర్‌ ఇటీవలే చెప్పారు. 3 రోజుల క్రితమే దూలానికి చెదలు పట్టిన విషయం గుర్తించి.. సపోర్టుగా పెట్టేందుకు కర్రలను తెచ్చిపెట్టారు. వాటిని ఇంకా అమర్చలేదు. ఇంతలోనే ఘోరం జరిగింది. కర్రలను దూలానికి ఆధారంగా పెట్టి ఉంటే ప్రమాదం తప్పేదని గ్రామస్థులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని