మందుగోలీల మధ్య సిమ్‌కార్డులు

ఒక్క సిమ్‌కార్డును ఉపయోగించి వేయి మందిని బురిడీ కొట్టించిన సైబర్‌ నేరగాళ్లకు వేల నంబర్లు చిక్కితే... వారి ఆగడాలకు ఇక అంతే ఉండదు. ఇప్పుడదే జరుగుతోంది. విదేశీ సైబర్‌ ముఠాలు ఇక్కడి యువతకు కాసుల ఎరవేసి...

Published : 02 Jul 2024 06:09 IST

టెలిగ్రామ్‌ యాప్‌ సాయంతో విక్రయాలు 
దుబాయిలో దాక్కున్న హైదరాబాద్‌ కేటుగాడు 

ఈనాడు, హైదరాబాద్‌: ఒక్క సిమ్‌కార్డును ఉపయోగించి వేయి మందిని బురిడీ కొట్టించిన సైబర్‌ నేరగాళ్లకు వేల నంబర్లు చిక్కితే... వారి ఆగడాలకు ఇక అంతే ఉండదు. ఇప్పుడదే జరుగుతోంది. విదేశీ సైబర్‌ ముఠాలు ఇక్కడి యువతకు కాసుల ఎరవేసి... టెలిగ్రామ్‌ యాప్‌ వేదికగా సిమ్‌కార్డులు, బ్యాంకు ఖాతాల లావాదేవీలు నిర్వహిస్తున్నాయి. టీజీ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో పోలీసుల దర్యాప్తులోనూ ఇవే విషయాలు వెలుగుచూశాయి. సైబర్‌ ముఠాలకు సహకరిస్తున్న జగద్గిరిగుట్టకు చెందిన సుభానీ, నవీన్, ప్రేమ్‌కుమార్‌లను పోలీసులు పట్టుకుని, 113 సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు. టెలిగ్రామ్‌ యాప్‌లో ‘ఇండియన్‌ బ్యాంక్‌ అకౌంట్స్‌ అండ్‌ సిమ్‌కార్డ్స్‌ సేల్‌’ అనే గ్రూప్‌ను ఈ ముఠా ఏర్పాటు చేసిందని, దాని ద్వారానే తాము బ్యాంకు ఖాతాలు, సిమ్‌కార్డులను విక్రయిస్తున్నట్లు నిందితులు తెలిపారు. ఈ కేసులో హైదరాబాద్‌కే చెందిన విజయ్‌ ప్రధాన నిందితుడు. పదోతరగతి చదివిన అతను, కొలువు కోసం దుబాయి వెళ్లి... అక్కడ చైనా వాళ్లు నిర్వహించే కాల్‌సెంటర్‌లో చేరాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కొన్ని ముఠాలతో పరిచయాలు పెంచుకొని... అక్కడి నుంచి సిమ్‌కార్డులను కొరియర్‌ ద్వారా దుబాయికి తెప్పించుకుంటున్నాడు. వీరికి ఒక్కో సిమ్‌కార్డుకు రూ.500 చొప్పున చెల్లిస్తాడు. చైనీయుల కాల్‌సెంటర్‌కు ఒక్కోటి రూ.1500-3000లకు విక్రయిస్తుంటాడు. ఈ వ్యవహారంలో తొలుత సిమ్‌ కార్డులు కావాలని విజయ్‌కి సమాచారం చేరుతుంది. ఒప్పందం కుదిరాక విజయ్‌ తన సోదరుడు అనిల్‌కు విషయం చేరవేస్తాడు. అతడు సబ్‌ ఏజెంట్ల నుంచి సేకరించిన సిమ్‌ కార్డులను మందుగోలీల రూపంలో పార్సిల్‌ చేయించి కొరియర్‌ ద్వారా దుబాయికి చేరవేస్తాడు. విజయ్‌ నుంచి కొనుగోలు చేశాక... చైనీయులు వాటిని దుబాయితోపాటు థాయ్‌లాండ్, కంబోడియాల్లోని సైబర్‌ కాల్‌సెంటర్లలో వినియోగిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. 

హైదరాబాద్‌లో గుట్టు బయటపడిందిలా... 

పలు కేసుల్లో వాడిన సిమ్‌ కార్డులు, బ్యాంకుల ఖాతాలు హైదరాబాద్‌కు చెందినవిగా తేలడంతో... సైబర్‌క్రైమ్‌ ఠాణా హెడ్‌ క్వార్టర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌ బృందం దర్యాప్తు చేపట్టింది. డెకాయ్‌ ఆపరేషన్‌ ద్వారా పోలీసులు టెలిగ్రామ్‌ యాప్‌లోని ‘ఇండియన్‌ బ్యాంక్‌ అకౌంట్స్‌ అండ్‌ సిమ్‌ కార్డ్స్‌ సేల్‌’ గ్రూప్‌లో చేరారు. విజయ్‌ అందుబాటులోకి రాగానే 2000 సిమ్‌ కార్డులు కావాలని కోరారు. తొలుత 200 ఇస్తామని, డీల్‌ సజావుగా సాగితే అడిగినంత అందజేస్తామని సైబర్‌ నేరగాళ్లు మాటిచ్చారు. సిమ్‌ కార్డులు తీసుకునేందుకు కూకట్‌పల్లిలో తాము చెప్పిన ప్రాంతానికి రావాలని సూచించారు. అక్కడికి వెళ్లిన పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిచ్చిన సమాచారంతో మరో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. విజయ్‌ దొరికితే కీలక సమాచారం వెల్లడయ్యే అవకాశముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని