పొలాన్ని ధ్వంసం చేశారని రైతు బలవన్మరణం

గ్రామానికి చెందిన పలువురు కక్ష కట్టి తన భూమిని యంత్రాలతో ధ్వంసం చేశారనే ఆవేదనతో ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరులో సోమవారం బోజడ్ల ప్రభాకర్‌ (42) అనే రైతు బలవన్మరణానికి పాల్పడ్డారు.

Published : 02 Jul 2024 06:03 IST

తన కుటుంబాన్ని సీఎం, ఉపముఖ్యమంత్రి ఆదుకోవాలని సెల్ఫీ వీడియో

చింతకాని, న్యూస్‌టుడే: గ్రామానికి చెందిన పలువురు కక్ష కట్టి తన భూమిని యంత్రాలతో ధ్వంసం చేశారనే ఆవేదనతో ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరులో సోమవారం బోజడ్ల ప్రభాకర్‌ (42) అనే రైతు బలవన్మరణానికి పాల్పడ్డారు. తనకు జరిగిన అన్యాయాన్ని సెల్ఫీవీడియోలో చిత్రీకరించి అంతకుముందు స్నేహితులకు పంపారు. దీనిపై కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలివీ..

ప్రభాకర్, ఆయన తండ్రి వీరభద్రానికి గ్రామ చెరువు సమీపంలో 7.10 ఎకరాల భూమి ఉంది. దీనికితోడు కొంత చెరువు శిఖం భూమిని ప్రభాకర్‌ కుటుంబీకులు సాగు చేస్తున్నట్లు సమాచారం. వేసవిలో మొత్తం భూమిలో ప్రభాకర్‌ చెరువు మట్టి తోలించారు. దీనిపై మత్స్యసహకార సంఘం సభ్యులు, ప్రభాకర్‌ కుటుంబానికి మధ్య వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల కిందట సంఘం సభ్యులు పొక్లెయిన్లతో మూడెకరాల భూమిలో పెద్దపెద్ద గోతులు తీశారు. దీంతో తన పట్టా భూమిని ధ్వంసం చేశారని తహసీల్దార్, ఎస్సైకు ప్రభాకర్‌ ఫిర్యాదు చేశారు. మరోవైపు ఆదివారం ప్రభాకర్‌పై మత్స్య సంఘం సభ్యులు దాడి చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

కలెక్టరేట్‌కు వచ్చినా..

ఈ క్రమంలో సోమవారం ఉదయం ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు ప్రభాకర్, వీరభద్రంలు ఖమ్మం వెళ్లారు. కలెక్టర్‌ కలవకపోవటంతో మధ్యాహ్నం ప్రభాకర్‌ ఖమ్మం సమీపంలోని ఓ మామిడితోట దగ్గరకు చేరుకొని పురుగుమందు డబ్బా చేతిలో పట్టుకొని సెల్ఫీ వీడియో తీసుకున్నారు. గ్రామంలోని కొందరు నాయకుల ప్రోద్బలంతో మత్స్య సహకార సంఘం సభ్యులు తన భూమిని ధ్వంసం చేశారని, తన కుటుంబానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సాయం చేయాలని వీడియోలో కోరి తన సన్నిహితుల వాట్సప్‌ గ్రూపులకు పంపి ఫోన్‌ స్విచాఫ్‌ చేశారు. వెంటనే ఆయన మిత్రులు మామిడితోట సమీపంలో అపస్మారక స్థితిలో ఉన్న ప్రభాకర్‌ను గుర్తించి 108 వాహనంలో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందారు. ప్రభాకర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీనిపై కేసు నమోదు కాలేదని చింతకాని పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని