మా భూమిని కబ్జా చేశారు..!

తమ పేరిట ఉన్న భూమిని ఓ పార్టీ నాయకుడు కబ్జా చేసి.. బెదిరింపులకు పాల్పడుతున్నారని, తాను ఎక్కడికెళ్లినా న్యాయం జరగకుండా చేస్తున్నారని ఆరోపిస్తూ ఓ మహిళ సోమవారం జనగామ కలెక్టరేట్‌ వద్ద ఆత్మహత్యకు యత్నించారు.

Published : 02 Jul 2024 06:46 IST

సంతకం పెట్టాలని బెదిరిస్తున్నారు
జనగామ కలెక్టరేట్‌ వద్ద మహిళ ఆత్మహత్యాయత్నం

అపస్మారక స్థితిలో ఉన్న జ్యోతికి సపర్యలు చేస్తున్న కలెక్టరేట్‌ సిబ్బంది

జనగామ అర్బన్, న్యూస్‌టుడే: తమ పేరిట ఉన్న భూమిని ఓ పార్టీ నాయకుడు కబ్జా చేసి.. బెదిరింపులకు పాల్పడుతున్నారని, తాను ఎక్కడికెళ్లినా న్యాయం జరగకుండా చేస్తున్నారని ఆరోపిస్తూ ఓ మహిళ సోమవారం జనగామ కలెక్టరేట్‌ వద్ద ఆత్మహత్యకు యత్నించారు. బాధితురాలు దేవులపల్లి జ్యోతి తెలిపిన వివరాల ప్రకారం.. నర్మెట్ట మండలకేంద్రానికి చెందిన దేవులపల్లి లక్ష్మయ్యకు సర్వే నం.201/జీ/1లో 1.04 ఎకరాల భూమి ఉంది. ఆయన కుమారుడు (బాధితురాలి తండ్రి) శ్రీహరి మద్యానికి బానిస కావడంతో ఆ భూమిని అతని పేరిట కాకుండా మనుమరాళ్లు జ్యోతి, స్వప్నలకు చెరో 22 గుంటల చొప్పున 1995లో పట్టా చేశారు. ఇప్పుడా భూమిలో అదే మండల కేంద్రానికి చెందిన ఓ పార్టీ నాయకుడితో పాటు మరొకరు కబ్జాకు పాల్పడ్డారు. శ్రీహరి 2020లో తమకు విక్రయించారంటూ.. పట్టా చేయించేందుకు సంతకాలకు వచ్చామని వారు తెలపడంతో, దానికి ఆమె ససేమిరా అన్నారు. దీంతో ఎలా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలో తమకు తెలుసునని బెదిరించారని, ఈ విషయమై పోలీసులకు తెలిపినా తమకు న్యాయం జరగడం లేదని ఆరోపించారు. ఈ క్రమంలో ఆమె ఇంటివద్దే గడువుతీరిన మాత్రలు మింగి, తనకు న్యాయం చేయాలంటూ కలెక్టరేట్‌లో ప్రజావాణి ప్రారంభమయ్యే సమయంలో పెట్రోలుతో వచ్చి ఆత్మహత్యకు యత్నించగా.. అప్రమత్తమైన పోలీసులు సీసాను లాక్కున్నారు. అయితే గడువు తీరిన మాత్రలు మింగడంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఆమెను హుటాహుటిన స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ విషయమై కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా స్పందిస్తూ.. ఈ సమస్య స్థానిక సివిల్‌ కోర్టులో ఉందని, రెవెన్యూ శాఖ పరిధిలో లేదని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని