ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ

ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించబోయిన లారీ దూసుకెళ్లి రహదారి పక్కనున్న ఇంటిని ధ్వంసం చేసింది. ఈ ఘటన శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు పంచాయతీ పరాకువాండ్లపల్లి వద్ద 42వ జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగింది.

Published : 02 Jul 2024 05:05 IST

ఇల్లు నేలమట్టం కావడంతో విలపిస్తున్న సలీంబాషా భార్య నూర్జహాన్‌

తనకల్లు, న్యూస్‌టుడే : ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించబోయిన లారీ దూసుకెళ్లి రహదారి పక్కనున్న ఇంటిని ధ్వంసం చేసింది. ఈ ఘటన శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు పంచాయతీ పరాకువాండ్లపల్లి వద్ద 42వ జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పరాకువాండ్లపల్లి వద్ద మలుపులో కదిరి వైపు నుంచి సిమెంట్‌లోడ్‌తో వెళ్తున్న లారీని ఎదురుగా వచ్చిన మరో లారీ ఢీకొంటూ ముందుకెళ్లింది. దానిని తప్పించే ప్రయత్నంలో సిమెంట్‌ లారీ అదుపుతప్పి రహదారి పక్కనున్న సలీంబాషా ఇంటిపైకి దూసుకెళ్లింది. ఒక గది పూర్తిగా నేలమట్టమైంది. రామచంద్రారెడ్డికి చెందిన ఇల్లు స్వల్పంగా దెబ్బతింది. సలీంబాషా..తన ముగ్గురు పిల్లలు ఆ సమయంలో ఇంటిలో లేరు. భార్య నూర్జహాన్‌ ఇంటిలోని మరొక గదిలో నిద్రిస్తుండటంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో అన్నమయ్య జిల్లా కొత్తకోటకు చెందిన.. సిమెంట్‌ లారీ డ్రైవర్‌ మహమ్మద్‌ సుహైల్‌ వాహనంలో ఇరుక్కుపోవడంతో పోలీసులు పొక్లెయిన్‌ సాయంతో బయటకు తీశారు. కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తరలించిగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మరో లారీ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. సలీంబాషా ఇంటిలోని వస్తువులు పాడైపోవడంతో భార్య విలపిస్తూ ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని