యాప్‌ ద్వారా పరిచయమై యువతిపై అత్యాచారం.. ఎస్సార్‌నగర్‌లో ఘటన

పెళ్లి చేసుకోవడానికి వరుడిని వెతుకుతున్న యువతికి యాప్‌ ద్వారా పరిచయమైన ఓ ప్రబుద్ధుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఎస్సార్‌నగర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగింది.

Updated : 02 Jul 2024 07:34 IST

అమీర్‌పేట, న్యూస్‌టుడే: పెళ్లి చేసుకోవడానికి వరుడిని వెతుకుతున్న యువతికి యాప్‌ ద్వారా పరిచయమైన ఓ ప్రబుద్ధుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఎస్సార్‌నగర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగింది. ఉప్పల్‌ ఠాణాలో జీరో ఎఫ్‌ఐఆర్‌ అయిన ఈ కేసు ఎస్సార్‌నగర్‌ పోలీసుస్టేషన్‌కు బదిలీ కావడంతో కేసు నమోదు చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. ఉప్పల్‌ ప్రాంతానికి చెందిన యువతి(27)... వివాహం  చేసుకోవడానికి యాప్‌లో శోధిస్తుండగా.. ఎస్సార్‌నగర్‌ ఠాణా పరిధిలోని జయప్రకాష్‌నగర్‌లో ఫొటో స్టూడియో నిర్వహిస్తున్న ముత్తుమ్ముల రాజశేఖర్‌(30) పరిచయమయ్యాడు. తాను ఫొటోగ్రాఫర్‌నని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి పరిచయం పెంచుకున్నాడు. యువతికి చెందిన ఈ-మెయిల్‌ ఐడీని కూడా వినియోగించేవాడు. గత నెల 24న యువతికి ఫోన్‌ చేసిన రాజశేఖర్‌ తన ఫోటో స్టూడియోకు రమ్మని పిలిచాడు. మరుసటి రోజు స్టూడియోకు వెళ్లిన యువతిని బెదిరించాడు. తాను చెప్పినట్లు వినకపోతే మెయిల్‌ ద్వారా లభ్యమైన నీ ఫొటోలను అందరికీ పంపి పరువు తీస్తానని చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం ఎవరికైనా చెపితే చంపేస్తానని హెచ్చరించాడు. బాధితురాలు అక్కడి నుంచి బయటపడి సమీప బంధువైన మహిళకు విషయం చెప్పింది. వారు ఉప్పల్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి జీరో ఎఫ్‌ఐఆర్‌ ఎస్సార్‌నగర్‌కు బదిలీ కావడంతో పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని