సోమలలో విషాదం

సోమల మండలంలో ఘోరం జరిగిపోయింది. తల్లితోపాటు ముక్కుపచ్చలారని ఇద్దరు పిల్లల ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి.

Updated : 01 Jul 2024 05:25 IST

బావిలోపడి తల్లీకుమార్తెల మృతి
అత్తారింటి వేధింపులతో ఘటన? 
ఘటనపై గ్రామస్థుల అనుమానాలు 

తల్లీ కుమార్తెల మృతదేహాల వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు 

సోమల, న్యూస్‌టుడే: సోమల మండలంలో ఘోరం జరిగిపోయింది. తల్లితోపాటు ముక్కుపచ్చలారని ఇద్దరు పిల్లల ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. ఘటనకు దారితీసిన పరిస్థితులపై అనేక అనుమానాలుండగా.. విషయం తెలిసి గ్రామస్థులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.. ఆవులపల్లె పంచాయతీ పట్రపల్లె రోడ్డులో కాపురం ఉంటున్న సుబ్రహ్మణ్యం కుమార్తె రాణెమ్మకు పెద్దపంజాణి మండలం రాయలపేటకు చెందిన విజయకుమార్‌తో ఆరేళ్ల కిందట వివాహమైంది. వీరికి హేమశ్రీ, జస్విక కుమార్తెలు. ఆవులపల్లెలో జరిగే గంగ జాతరలో పాల్గొనడానికి శనివారం రాణెమ్మ పిల్లలతో పుట్టింటికి వచ్చారు. ఆదివారం ఉదయాన్నే పట్రపల్లెలోని పొలం వద్దకు వెళ్లి వస్తానని తల్లిదండ్రులకు చెప్పి వెళ్లారు. అక్కడ బావిలోంచి శబ్దం రావడంతో పరిసర ప్రాంత రైతులు వెంటనే స్పందించారు. అందులోకి దూకి.. రాణెమ్మ (22), హేమశ్రీ (5), జస్విక (18 నెలలు)ను రక్షించే ప్రయత్నం చేశారు. అప్పటికే వారు చనిపోవడంతో మృతదేహాలను బయటకు తీసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఎస్సై వెంకట నరసింహులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వీఆర్వో రమణ, స్థానికుల ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించి మృతదేహాలను పుంగనూరు ఆసుపత్రికి తరలించారు. బావి సమీపంలో ఆడుకొంటున్న తన మనవరాళ్లు ప్రమాదవశాత్తు అందులో పడిపోగా వారిని కాపాడేందుకు వెళ్లిన కుమార్తె సహా ముగ్గురూ మృతిచెందినట్లు తండ్రి సుబ్రహ్మణ్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు. ఘటనపై గ్రామస్థులు మరోవైపు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అత్తింటివారి వేధింపులతోనే ఈ ఘటన జరిగినట్లు చెబుతున్న నేపథ్యంలో పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాల్సి ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని